
త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే
హిందూపురం/పుట్టపర్తి టౌన్: క్రైస్తవ సమాజంలో అత్యంత ప్రత్యేకమైన రోజుగా పరిగణించబడే గుడ్ ఫ్రైడే రానే వచ్చింది. క్రైస్తవ విశ్వాసం ప్రకారం సమాజంలో నెలకొన్న చెడును తొలగించడానికి ఈ రోజున తన జీవితాన్ని యేసు క్రీస్తు త్యాగం చేశాడు. ఆ త్యాగాలను మననం చేసుకుంటూ ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించేందుకు క్రైస్తవులు సిద్ధమయ్యారు. క్షమ, కరుణకు ప్రతిరూపంగా నిలిచిన యేసు క్రీస్తు.. లోకంలో పాపులను పరిశుద్ధులను చేసే క్రమంలో సిలువపై రక్తం చిందించిన దైవ కుమారుడిగా మరణించి కూడా పునరుత్థానుడై లేచిన సంఘటన ప్రపంచ చరిత్రలో మరెక్కడా కనిపించదు. ఆ ఘట్టాలను వివరించే గుడ్ ఫ్రైడే నుంచి ఆదివారం వచ్చే ఈస్టర్ పర్వదినం వరకు సాగే వేడుకలకు జిల్లాలోని ప్రతి ప్రార్థనామందిరాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ప్రాణ త్యాగ సమయంలోనూ క్రీస్తు తన మరణ శిక్షను అమలు చేస్తున్న రోమన్ సైనికుల కోసం లోక రక్షకుడైన తన తండ్రితో ‘తండ్రీ వీరు ఏమి చేస్తున్నారో ఎరుగరు.. వీరిని క్షమింపుము’ అని ప్రార్థించి తనలోని దయ, కరుణ తత్వాలను లోకానికి చాటారు. సిలువపై క్రీస్తు చెప్పిన ఏడు సూక్తులు లోకానికి ఆరాధ్యాలయ్యాయి.
మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు..
ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా కేవలం దేవుడికి మన హృదయాన్ని సమర్పించుకునేలా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు హిందూపురంలోని సీ అండ్ ఐజీ చర్చ్, సీ అండ్ ఐజీ కాంపౌండ్ మీషన్ చర్చి, జెరూసెలం చర్చి, బైబిల్ మిషన్ చర్చి, సీఎస్‌ఐ చర్చి, జియాన్ చర్చిలతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. శుక్రవారం గుడ్‌ప్రై డే ప్రార్థనలు, శనివారం రన్ ఫర్ జీసెస్, ఆదివారం ఈస్టర్ వేడుకలు నిర్వహించనున్నారు.
ఆదివారంతో ముగియనున్న శోకదినాలు
గుడ్‌ఫ్రైడేను పురస్కరించుకుని క్రైస్తవులు పాటించిన 40 రోజుల శోక దినాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఈ 40 రోజుల పాటు శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కనీసం నూతన దుస్తులు కూడా ధరించరు. పొరపాటున కూడా ఇతరులకు కీడు కలిగించే పనులు చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక ప్రార్థనల్లోనే గడపడం ఆనవాయితీ. శుభ శుక్రవారం తర్వాత యేసు క్రీస్తు పునరుత్థానుడై లేచిన సందర్భంగా ఆదివారం పండుగను నిర్వహించేందుకు క్రైస్తవులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు.
పుట్టపర్తిలో
విద్యుద్దీపాలంకరణలో వెలుగులీనుతున్న
కింగ్స్ చర్చ్
సర్వాంగ సుందరంగా
రూపుదిద్దుకున్న చర్చిలు
ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తుపై విశ్వాసం ప్రకటించనున్న క్రైస్తవులు