విజయనగరం, గరుగుబిల్లి: కొద్ది రోజులుగా ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగులు తాజాగా మంగళవారం మండలంలోని సుంకి, తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోని కుడిమట్టికట్ట వద్ద ఖడ్గవలస సమీపంలో సంచరిస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోనే నాలుగు రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి పంటతో పాటు అరటి తదితర పంటలను నష్టపరుస్తున్నాయి.
ప్రణాళిక ప్రకారం తరలింపు
ఏనుగులను ఒక ప్రణాళిక ప్రకారం తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం జిల్లా అటవీశాఖ అధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఆయన సుంకి పరిసరాలలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్పారు. ఒడిశాకు వెళ్లినా తిరిగి ఇక్కడకు వచ్చాయని చెప్పారు. ఏనుగులను తరలించేందుకు బేస్ క్యాంప్స్, ట్రాక్స్‌ల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంట నష్టం జరిగితే పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పార్వతీపురం, కురుపాం రేంజర్స్ ఎం.మురళీకృష్ణ, కళ్యాణముని తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment