
మాట్లాడుతున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
విజయనగరం, కురుపాం: ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలలుగా కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లోనే ఏనుగులు సంచరిస్తూ అరటి, వరి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మూడు నెలలుగా ఏనుగులు కురుపాం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనే ఉంటున్నాయని చెప్పారు. దీంతో రైతులు తమ వ్యవసాయ పనులను చేయలేక తమ పంటలను రక్షించుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని లేకుంటే భవిష్యత్‌లో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొన్నారు.
గజరాజుల సంచారంతో ఈ ప్రాంత ప్రజలకు కొద్ది నెలలుగా కంటి మీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఏనుగులు మూడు మండలాల్లోనే సంచరిస్తూ పంటలనే తింటున్నాయని, మున్ముందు ప్రజలపై అవి విరుచుకుపడి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నెలల తరబడి వీటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే పాలకులు దీన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. మరింత నష్టాలు సంభవించ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిపుణులను రప్పించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని పుష్పశ్రీవాణి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment