కలకంటి కన్నీరు... | Vizianagaram Police Delayed MLA Pushpa Srivani Case | Sakshi
Sakshi News home page

కలకంటి కన్నీరు...

Published Wed, Apr 17 2019 11:46 AM | Last Updated on Wed, Apr 17 2019 11:46 AM

Vizianagaram Police Delayed MLA Pushpa Srivani Case - Sakshi

మీడియాతో ఆరోజు జరిగిన సంఘటన వివరిస్తున్న పరీక్షిత్‌ రాజు, చిత్రంలో పుష్పశ్రీవాణి

ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యురాలామె. వేలాదిమంది గిరిజనులకు ప్రతినిధి ఆమె. పల్లె పల్లెలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనవిగా భావించి వాటిపై పోరాడారు. పదవి చేపట్టినప్పటినుంచి ప్రజల మధ్యే ఉంటూ... వారి బాగోగులకోసం పరితపించారు. వారికి సౌకర్యాలు కల్పించేందుకు అహర్నిశలూ పాటుపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా... తనవారికోసం రోడ్డెక్కారు. అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. వారి సమస్యలు పరిష్కరించారు. అందుకే ఆమె ఇప్పుడు ఆ గిరిజనులందరికీ ఆడబిడ్డ అయ్యారు. ఆమెను తమ గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారు. ఇదే అక్కడి టీడీపీ పెద్దలకు కంటగింపుగా మారింది. ఆమె ఉన్నంతవరకూ ఇక వేరెవ్వరూ గెలవలేరని నిర్ధారించుకున్నారు. ఎలాగైనా ఆమెను మట్టుపెట్టాలని యత్నించారు. అందులో భాగమే చినకుదమలో సాగిన దౌర్జన్యకాండ.

సాక్షి ప్రతినిధి విజయనగరం: ఓ మహిళా ప్రజాప్రతినిధి కన్నీరు పెట్టుకున్నారు. ఆమె సామాన్య వ్యక్తి కాదు. ఓ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీ‘వాణి. తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ తరఫున పోటీచేసి విజయానికి చేరువలో ఉన్నారు. అయినా ఆమెకు జరిగిన అన్యాయాన్ని పట్టించుకునే అధికారులు కరువయ్యారు. ఆమెపై హత్యాయత్నం జరిగితే దానిపై చురుకైన దర్యాప్తు సాగడం లేదు. కనీసం ఏమాత్రం చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కానరావడం లేదు. అదే ఆమె ఆవేదనకు కారణమైంది. రాజకీయంగా ఎదుర్కొనలేక ఇంతలా తనపై హత్యాయత్నానికి పాల్పడతారా... ఆ సంఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించకుండా మీనమేషాలులెక్కిస్తారా అన్నది ఆమె వాదన. అదే విషయాన్ని ఆమె మంగళవారం విజయనగరంలోని మీడియాముందుకొచ్చి తనకు జరిగిన పరాభవాన్ని కన్నీటిపర్యంతమవుతూ చెప్పారు.

అసలేం జరిగింది....
కురుపాం నియోజకవర్గం జియ్యమ్మవలస మండలం కుదమ పంచాయతీ చినకుదమ గ్రామంలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 152లో ఈ నెల 11వ తేదీన ఎన్నికల నేపథ్యంలో  అధికార పార్టీ రిగ్గింగ్‌కు పాల్పడింది. జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ దందా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తన భర్త అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజును తీసుకుని అక్కడకు చేరుకున్నారు. దీనిపై ప్రిసైడింగ్‌ అధికారితో మాట్లాడేందుకు యత్నించారు. ఇదే అదనుగా భావించిన ప్రత్యర్థి వర్గానికి చెందిన కొందరు వారిపై దాడికి పాల్పడ్డారు. భయంతో వారు లోపలికి వెళ్లగానే ఆ పోలింగ్‌ కేంద్రాన్ని చుట్టుముట్టారు. కర్రలు, మారణాయుధాలతో పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారిని హతమార్చేందు కు యత్నించారు. హఠాత్పరిణామంతో దిక్కుతో చని వారు దాదాపు మూడుగంటలపాటు అందులోనే ఉండిపోవాల్సి వచ్చింది. బయటకు రావడానికి ప్రయత్నించినా ప్రాణాలు తీసేందుకు సిద్ధం గా ఉన్నారని భావించి పోలీసులు సైతం వారిని అక్కడినుంచి రానివ్వలేదు. చివరకు ఆమె జిల్లా పోలీసు యంత్రాంగంతో మాట్లాడిన అనంతరం అడిషనల్‌ ఎస్పీ ప్రత్యేకబలగాలతో అక్కడకు చేరుకుని వారిని సురక్షితంగా ఇంటికి చేర్చగలిగారు.

జిల్లాలో అన్నిచోట్లా...టీడీపీ అకృత్యాలు
జిల్లాలో మునుపెన్నడూ లేని విపరీత పరిణామాలకు తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల సందర్బంగా తెర తీసింది.  వైఎస్సార్‌సీపీని ఎలాగైనా దెబ్బ తీ సేందుకు శాయశక్తులా ప్రయత్నం చేసింది. పథకం ప్రకారం ప్రతిపక్షపార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించింది. పార్టీ కార్యకర్తలను భయాందోళనలకు గురి చేసింది. నాయకులను ప్రలోభ పెట్టింది. ప్రతిపక్షానికి ఓట్లు పడతాయనుకున్న పోలింగ్‌ బూత్‌లలో ఉద్రిక్తత పరిస్థితులు కల్పించారు. సాలూరు నియోజకవర్గం నేరెళ్లవలస పోలింగ్‌ కేంద్రాల పరిధిలోని కొఠియా గ్రామాల గిరిజనులు ఆనాదిగా వైఎస్సార్‌సీపీకే ఓట్లు వేస్తున్నారు. ఈసారి వారిఓట్లు వైఎస్సార్‌సీపీకి పడకుండా చేయాలన్న ఉద్దేశంతో పోలింగ్‌ అధికారులతో కలిసి టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ప్రాంతంతో పాటు మిగిలిన గిరిజన ప్రాంతాల్లో అమాయక గిరిజనులకు పదిరోజుల ముందు నుంచి మద్యం సరఫరాను భారీగా చేస్తూ పోలింగ్‌ రోజు వారు ఓటు వేసేందుకు కూడా రాలేని విధంగా మద్యం మత్తులో ముంచేశారు. బొబ్బిలిలో ఏకంగా వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లపైనే దాడులకు తెగబడ్డారు.

కురుపాంలో పలు పోలింగ్‌ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీకి ఓటేస్తున్న వారిపై దౌర్జన్యానికి దిగి విచక్షణా రహితంగా కొట్టడంతో పాటు వారివద్ద ఉన్న సెల్‌ఫోన్లు సైతం లాక్కున్నారు. జిల్లాలో మరికొన్ని చోట్ల గొడవలు సృష్టించి వైఎస్సార్‌ సీపీ నాయకులను భయపెట్టేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీకి పోలీసులు సైతం వత్తాసు పలికారు. వాహన తనిఖీల్లోనూ పక్షపాత వైఖరిని చూపారు. ఈ విధంగా జిల్లాలో మునుపెన్నడు లేనట్లుగా టీడీపీ అరాచకాలకు పాల్పడింది. ఇంత చేసినా ఎన్నికల రోజు ఓటింగ్‌ సరళిని చూసి కంగుతింది. వైఎస్సార్‌సీపీకే ఓటర్లు పట్టం కడుతున్నారన్న విషయం స్పష్టమైంది. ఓటమికి చేరువవుతున్నామనే ఉక్రోషం వారిలో విచక్షణను దెబ్బతీసింది. అందుకే వారి పరపతిని వినియోగించి వైఎస్సార్‌సీపీ చేసిన ఫిర్యాదులను నీరుగార్చేలా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇన్నాళ్లయినా... చర్యలేవీ...
ఈ సంఘటనపై ఆ మరునాడే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటివరకూ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో వారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. సంఘటన జరిగి అయిదు రోజులైనా నిందితులెవరినీ అదుపులోకి తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు పోలీస్‌ ఉన్నతాధికారులను కలవడం మరింత చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి దంపతులు జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలసి కలిసి డీఐజీ జి.పాలరాజు,  ఎస్పీ ఎ.ఆర్‌.దామోదర్‌ను మంగళవారం కలసి వినతిపత్రాలు అందజేశారు. న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తనపై జరిగిన దాడిపై కన్నీటిపర్యంతమవుతూ వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement