పాలకపక్ష సభ్యులందరికీ సమాధానమిస్తున్న కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి
జిల్లా పరిషత్ సమావేశం సాక్షిగా అధికార పార్టీ ఆగడాలు మరోసారి బహిర్గతమయ్యాయి. అధికారులపై అడ్డగోలుగా విరుచుకుపడటాన్ని తప్పుపట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యే... అందునా గిరిజన మహిళపై మూకుమ్మడిగా మాటలదాడికి దిగారు. ఒక్క మహిళపై వందగొంతుకలు ఒక్కటై... వేలు చూపించి భయపెట్టేందుకు యత్నించి... క్షమాపణ చెప్పాలంటూ పట్టుబట్టాయి. తాను చేయని తప్పునకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని దీటుగానే ఎదుర్కొన్నారు. ఆమెకు అండగా నిలిచిన మరో ప్రతి పక్ష ఎమ్మెల్యేపైనా... నిందలకు దిగారు. ప్రతిపక్షం గొంతునొక్కడానికి శతవిధాలా యత్నించి... చివరకు ప్రజాసమస్యల గురించి చర్చనే విస్మరిం చారు. సమస్యలపై ప్రస్తావించాలని వచ్చిన విపక్షఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా చేసి తూతూ మంత్రంగా చిన్నపాటి చర్చలతో ముగించారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా పరిషత్ సర్వసభ్యసమావేశం ఆద్యంతం వాడి వేడిగా సాగింది. జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన సమావేశం చర్చలకంటే వ్యక్తిగతంగా ప్రతిపక్షంపై దాడికి దిగడానికే పాలకపక్ష సభ్యులు ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్టు స్పష్టమైంది. తొలుత సమావేశంలో కొంతమంది జెడ్పీటీసీలు అధికారులను నిలదీశారు. ఆర్‌అండ్‌బీ స్థలం లో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని తాము ఎన్నిసార్లు చెబుతున్నాజిల్లా పంచాయతీ అధికారి సత్యనారాయణ పట్టించుకోవడం లేదనేది వారి ప్రధాన ఆరోపణ. దానికి పంచా యతీ అధికారి సమాధానమిస్తూ.. ఆ స్థలం రోడ్లు, భవనాల శాఖది కనుక నిర్మాణాలు ఆపే అధికారం తమకు లేదన్నారు. ఆయన సమాధానానికి టీడీపీ ప్రజాప్రతినిధులు సంతృప్తి చెందలేదు. అడుగడుగునా నిలదీస్తూ, ఆయన పనితీరు సరిగ్గాలేనందున చర్యలకు సిఫారసుకోసం తీర్మానం చేయాలంటూ పట్టుబట్టారు. ఒకానొక సందర్భంలో డీపీఓ సత్యనారాయణ ఆవేదన చెంది తాను ధర్మబద్ధంగా మాత్రమే పనిచేస్తానన్నారు. ఆ మా టకు జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి కల్పిం చుకుని మిమ్మల్నెవరు అధర్మంగా పనిచేయమన్నారు. మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారంటూ డీపీఓను హెచ్చరించారు. ఇలా కాసేపు కొనసాగగా ఆయనపై తీర్మానం చేయాలని చివరిగా టీడీపీ నేతలంతా తేల్చారు.
అధికారుల పక్షాన నిలిచినందుకు...
సభలో తన వంతు వచ్చినపుడు ప్రసంగం మొదలు పెట్టిన కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి టీడీపీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. అధికారపార్టీ ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని, గతంలోనూ ఇదే విధంగా ప్రవర్తించడంతో అధికారులంతా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. ఈ చర్యలను తాను ఖండిస్తున్నానని, అధికారులకు పెద్దదిక్కైన జిల్లా కలెక్టర్ స్పందించి టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కురుపాం నియోజకవర్గానికి రూ.110 కోట్లతో తాగునీటి పధకాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేస్తున్నట్టు జీఓ జారీ చేశారని, అయితే 24 గంటల్లో ఆ జీఓ మార్చేశారనీ తెలిపారు. కురుపాం నియోజకవర్గంపై ఎందుకంత వివక్ష చూపుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణిని నిలదీశారు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా అధికార పార్టీ జెడ్పీటీసీలు, జెడ్పీ వైస్ చైర్మన్ బలగం కృష్ణమూర్తి నాయుడు కలుగజేసుకుని 6 నెలలుగా ఒక సమస్యను పరిష్కరించకుండా నీరు గారుస్తున్నారని, ఆ అధికారిపై చర్య తీసుకోమని చెప్పామే తప్ప, ఏ అధికారిని కించపరిచేవిధంగా మాట్లాడలేదని, తమపై నిందలు వేసినందుకు ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి క్షమాపణ చెప్పాలని పట్టుబట్టారు.
ప్రేక్షకపాత్ర.. అవహేళన
చాలా కాలం తర్వాత జెడ్పీ సమావేశానికి వచ్చిన ఎంపీ అశోక్ గజపతిరాజు కూడా సభ ప్రారంభంలోనే అధికా రులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఆయన తర్వాత మిగతా వారు అదే బాటను అనుసరించారు. ఈ క్రమంలో వారి తీరు సరైంది కాదన్న ప్రతిపక్ష గిరిజన, మహిళా ఎమ్మెల్యేపై టీడీపీ జెడ్పీటీసీలు విరుచుకుపడుతుంటే.. ఒకానొక దశలో ఆమెపై భౌతిక దాడికి పాల్పడతారేమోనన్న భయాందోళనలు కలిగిస్తుంటే అశోక్ నోరుమెదపకుండా చూస్తూ కూర్చుకున్నారు. కనీసం ఇలాంటి ప్రవర్తన తప్పని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేను హేళన చేస్తూ మాట్లాడారు. జెడ్పీ సమావేశంలో ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుతగిలి, మీరేదైనా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడండంటూ హేళనగా నవ్వుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చులకన చేసేలా విధంగా కేఏ నాయుడు ప్రవర్తించిన తీరు విమర్శలపాలైంది.
భయానక వాతావరణం
టీడీపీ నేతలు అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే దగ్గరకు మూకుమ్మడిగా వచ్చి తీవ్రంగా వాదనలకు దిగా రు. చేతులు, వేలు చూపిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేశారు. ఆవేశంతో ఊగిపోతూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ మహిళా ఎమ్మెల్యేపై మాటల దాడి చేశారు. దీంతో సభలో భయానక వాతావరణం ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మాత్రం ఏ మాత్రం బెదరకుండా... కొంతమంది మాత్రమే అధికారులను టార్గెట్ చేస్తున్నారన్నానే తప్ప అందరినీ అనలేదని క్షమాపణ చెప్పే ప్రపక్తే లేదని తేల్చి చెప్పారు. పుష్పశ్రీవాణికి సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి, ఎంపీపీ అనిమి ఇందిర బాసటగా నిలిచారు. కొంత సేపటికి జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి కలుగజేసుకుని అధికార పార్టీ జెడ్పీటీసీలకు మాట్లాడడానికి అవకాశం ఇస్తానని చెప్పి ఎవరి సీట్లతో వారిని కూర్చోమన్నారు.
ఐదు అంశాలపైనే చర్చ
తొలుత సమావేశంలో 58కి పైగా అంశాలపై చర్చించాలని అజెండా రూపొందించారు. కానీ మధ్యలో పాలకపక్ష సభ్యులు సమావేశాన్ని పక్కదారిపట్టించడంతో కేవలం ఐదు అంశాలపైనే చర్చ జరిగింది. ఆరోగ్యం, వ్యవసాయం, డీపీఏ, ఉపాధిహామి , ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలవరకే పరిమితమైంది. ముందుగా ఆరోగ్యశాఖపై చర్చించారు. ఆతర్వాత డ్వామా( ఉపాధిహామీ), వ్యవసాయశాఖ, జిల్లా పంచాయతీ శాఖపై చర్చించారు. చివరిగా ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖపై చర్చించి ముగించారు. ఇదే చివరి సమావేశం కావడంతో ఎక్కువ అంశాలపై చర్చిస్తారని పలువురు భావించినప్పటికీ ఐదింటితోనే ముగించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment