కేసును పక్కదారి పట్టిస్తున్నారు.. | MLA Pushpa Srivani Visit Visakha Range DIG Office | Sakshi
Sakshi News home page

నా హత్యకు కుట్ర!

Published Wed, Apr 17 2019 11:42 AM | Last Updated on Wed, Apr 17 2019 11:42 AM

MLA Pushpa Srivani Visit Visakha Range DIG Office - Sakshi

ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తదితరులు

విజయనగరం టౌన్‌: తనను హత్య చేసేందుకే  మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజు కుట్ర పన్ని దాడులు చేయించారని  కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆరోపించారు.  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న కురుపాం నియోజకవర్గం చినకుదమ గ్రామంలో తనపై జరిగిన దాడికి సంబంధించి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని, కేసును పక్కదారి పట్టించకుండా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ  విశాఖ రేంజ్‌ డీఐజీ జి.పాలరాజును,  ఎస్పీ ఎఆర్‌.దామోదర్‌ను మంగళవారం వారి చాంబర్‌లో  కలిసి ఆమె వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో  వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు పెనుమత్స సాంబశివరాజు, ఎమ్మెల్సీ, పార్టీ ఉత్తరాంధ్ర    కన్వీనర్‌ కోలగట్ల వీరభద్రస్వామి,  విజయనగరం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్, అరకు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త బొత్స అప్పలనరసయ్య, నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు, పార్వతీపురం నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఉన్నారు. ఈ మేరకు డీఐజీ, ఎస్పీలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ చేయించి, నిందితులను అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మీడియాతో  మాట్లాడుతూ  ఏప్రిల్‌ 11న తనపై జరిగిన దాడికి సంబంధించిన విషయంలో  ఎస్సీ, ఎస్టీ సెల్‌ డీఎస్పీ పాపారావు అనుసరిస్తున్న వైఖరిపై తమకు అనుమానం ఉందనీ, ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయనీ, అందువల్ల తనకు ఆ ఇన్విస్టిగేషన్‌ వల్ల, అధికారి వల్ల  న్యాయం జరగదని భావించి  డీఐజీ, ఎస్పీలను కలిశామన్నారు. 

ఏప్రిల్‌ 11న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, చిన్నకుదమ బూత్‌ నంబరు152లో రిగ్గింగ్‌ జరుగుతుందనే  సమాచారంతో  అక్కడున్నటువంటి పీఓతో, ఇక్కడ రిగ్గింగ్‌ జరుగుతుందని ఫిర్యాదు చేసేందుకు తాను  వెళ్లిన సందర్భంలో అక్కడున్నటు జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ , ఆయన మనుషులు విజయరామరాజు ప్రోత్బలంతో తనపై  తీవ్రమైన దాడి చేశారన్నారు. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా తీవ్రంగా గాయపరిచి తనను, తన భర్తను చంపించే ప్రయత్నం జరిగిందన్నారు.  ఆ విజువల్స్‌ పోలీసు శాఖకు అందజేశామన్నారు.  మూడు గంటల పాటు నిర్బంధించి, కరెంటు తీసి, చిత్రహింసలు పెట్టి, రాళ్లతో, సుత్తులతో కొట్టి, భయాందోళనకు గురి చేశారన్నారు.

ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి భర్త, అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు మాట్లాడుతూ  రిగ్గింగ్‌ జరుగుతుందని వెళితే జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ రిగ్గింగ్‌కి పాల్పడుతున్నారన్నారు.  దారుణంగా రిగ్గింగ్‌ చేస్తున్నారని నిలదీస్తే అటాక్‌ చేశారని,  ఊర్లోని అందరినీ రెచ్చగొట్టి, తమపై దాడులు చేశారన్నారు.  ఎమ్మెల్యే మహిళా అని చూడకుండా గాయపరిచారని,  శత్రుచర్ల ఆయన వాహనంతో  వచ్చి బూత్‌ని ఆక్రమించేశారన్నారు.  తమ కుటుంబానికి తగు రక్షణ కల్పిండంతో పాటు కేసును త్వరితగతిన విచారణ చేయించి నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. వారి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి  జమ్మాన ప్రసన్నకుమార్,  జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌ కుమార్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాముల నాయుడు, జి.సూరపురాజు, ఎమ్‌ఎల్‌ఎన్‌.రాజు (హర్షరాజు)  తదితరులున్నారు.

ఫిర్యాదు చేస్తే...
తాము ఫిర్యాదు ఇస్తే ఈ రోజు వరకూ ఎటువంటి చర్య లేదని,  నిన్న విజయరామరాజు డీఎస్పీని కలిసిన తర్వాత, నేను ఈ రోజు కలిసిన తర్వాత ఆయన మాటల్లో వ్యత్యాసం కనిపించిందన్నారు.  తనపై జరిగిన దాడిపై తమకు న్యాయం జరగదని భావించి, మహిళా ఎమ్మెల్యేకే భద్రత లేదంటే సామాన్యులకు ఇంకెక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకూ ఎంతవరకైనా వెళతామన్నారు. జెడ్పీటీసీ భర్త డొంకాడ రామకృష్ణ  ఆ గ్రామంలో ప్రజలకు అబద్దాలు చెప్పి, తాను దాడి చేశానని చెప్పి రెచ్చగొట్టారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement