elephants attacks
-
చిత్తూరు: ఏనుగుల గుంపు హల్చల్.. టెన్షన్లో ప్రజలు!
సాక్షి, కుప్పం: చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో 70 ఏనుగుల గుంపు హల్చల్ చేసి కుప్పం వైపు దూసుకొస్తున్నట్టు కర్ణాటక ఫారెస్ట్ అధికారులు తెలిపారు. దీంతో, ఏపీ సరిహద్దు ప్రాంత అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజల్లు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. గ్రామ సరిహద్దులోను, పొలాల్లో రాత్రి పూట ప్రజలు ఉండకూడదని హెచ్చరికలు ముందస్తుగా జారీ చేసి, గ్రామాల్లో ఏనుగులు కంట పడితే వెంటనే సంబంధిత పారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఇక, ఫారెస్ట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
మా ప్రైవసీకి భంగం కల్గిస్తారా.. ఎత్తిపడేసింది..
ప్రిటోరియా: సాధారణంగా చాలా మంది సరదాగా గడపటానికి జంతువుల సఫారీలకు, అభయారణ్యాలకు వెళ్తుంటారు. ఈ సమయంలో సందర్శకులు.. క్రూరమృగాలను, ప్రత్యేక జీవులను దగ్గర నుంచి చూడటానికి ఇష్టపడతారు. వీటికోసం ఆయా పార్కులలో ప్రత్యేక వాహానాలు ఉంటాయి. అయితే, ఒక్కొసారి జంతువులను చూసే క్రమంలో.. సందర్శకులు అనుకొకుండా ఆపదలకు గురైన సంఘటనలు కొకొల్లలు. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దక్షిణాఫ్రికాలోని సెలాటి గేమ్ రిజర్వ్‌లో గత ఆదివారం(నవంబరు28) జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెలాటి గేమ్ రిజర్వ్‌లోని క్రూగెర్ నేషనల్ పార్కులో... కొందరు సందర్శకులు ప్రత్యేక వాహనంలో గైడ్ సహయంతో ఏనుగుల సఫారీకి వెళ్లారు. ఆ తర్వాత.. ఏనుగుల దగ్గరకు చేరుకున్నారు. ఆ తర్వాత.. గట్టిగా అరవడం ఆరంభించారు. వీరిని గమనించిన ఏనుగుల గుంపు కాస్త బెదిరిపోయింది. వారి వాహనం ఏనుగుల దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఒక భయానక సంఘటన చోటుచేసుకుంది. ఒక ఆఫ్రికా ఏనుగు వారు ప్రయాణిస్తున్న వాహనం వైపు ఘీంకరించుకుంటూ వచ్చింది. ‘మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండన్నట్లు..’ వారి వాహనాన్ని తొండం సహయంతో పక్కకు నెట్టి, కిందకు పడేసింది. ఈ సంఘటనతో అక్కడి వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే వాహనం నుంచి దూకి పారిపోయారు . అదృష్టవశాత్తు ఎవరికి గాయాలు కాలేవు. వాహనం మాత్రం తుక్కుతుక్కయ్యింది. శీతాకాలంలో ఏనుగులు మేటింగ్‌లో పాల్గొంటాయి. వాటి ఏకాంతానికి అంతరాయం కల్గినప్పుడు క్రూరంగా ప్రవర్తిస్తాయని రిజర్వ్ మేనెజర్ హవ్మెన్ అభిప్రాయపడ్డారు. ఈ వీడియోను.. సందర్శకులలో ఒక వ్యక్తి రికార్డు చేశాడు. అతను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీంతో ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఏనుగు ఎంత భయంకరంగా ఉంది..’, ‘కొంచెంలో బతికి బట్టకట్టారు..’, ‘మీరు ఏనుగుకు దొరికితే అంతే సంగతులు..’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Too much intrusion will take your life in Wilderness. However, wild animals keeps on forgiving us since long.#responsible_tourism specially wildlife tourism should be educational rather recreational. हांथी के इतना घुसा नही जाता 🙏 watch second video too pic.twitter.com/AOKGZ2BAjB — WildLense® Eco Foundation 🇮🇳 (@WildLense_India) November 30, 2021 -
జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రణ
సాక్షి, అమరావతి: జనారణ్యంలోకి ఏనుగులు రాకుండా నియంత్రించడంతో పాటు వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని అంతర్రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య అధికారుల సమావేశం నిర్ణయించింది. ఏనుగుల సంరక్షణపై ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన అటవీ శాఖ ముఖ్య అధికారుల సమావేశం మంగళవారం వర్చువల్ విధానంలో జరిగింది. గుంటూరులోని కార్యాలయం నుంచి రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణ అధికారి ఎన్.ప్రతీప్‌కుమార్ మాట్లాడారు. ఏనుగులు తరచూ జనారణ్యంలోకి, పంట పొలాల్లోకి రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోందన్నారు. ఏనుగులు అడవులు దాటి బయటికి రాకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ.. తమిళనాడు, కర్ణాటక నుంచి తరచుగా ఏనుగులు ఏపీలోకి ప్రవేశిస్తున్నాయని చెప్పారు. రైతులు వన్యప్రాణుల నుంచి రక్షణగా కరెంటు తీగలను అమర్చడం వల్ల అవి మరణిస్తున్నాయన్నారు. ఏనుగుల తరలింపు కోసం తమిళనాడు సిబ్బంది కాల్పులు జరుపుతుండడం వల్ల అక్కడి ఏనుగులు కౌండిన్య వైపు వస్తున్నాయ ని పేర్కొన్నారు. అలాగే కర్ణాటక నుంచి ఇంకొన్ని కుప్పం మీదుగా ఇదే అడవుల్లోకి వస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారం కోసం తరచూ సమావేశం కావాలని, సమన్వయంతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. మూడు రాష్ట్రాలను కలుపుతూ ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని పలువురు అధికారులు అభిప్రాయపడ్డారు. -
జీడి తోటకు వెళ్లిన మహిళపై..
సాక్షి, భువనేశ్వర్ : జీడి తోటకు వెళ్లిన మహిళపై దాడి చేసి చంపిందో ఏనుగు. ఈ సంఘటన ఢెంకనాల్ జిల్లా హిందోల్ అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొబొంధో గ్రామంలో ఉంటున్న దమయంతి బిశ్వాల్ అనే మహిళ గ్రామ సమీపంలోని జీడి తోటకు వెళ్లింది. అదే సమయంలో అటువైపు వచ్చిన ఏనుగును ఆమె గమనించలేదు. అది సమీపంలోకి చేరుకున్న తర్వాత గుర్తించిన దమయంతి పరుగులు పెట్టింది. అయితే ఆమెను వెంబడించిన ఏనుగు దాడి చేసి చంపేసింది. హిందోల్ అటవీ రేంజ్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానికి సామూహిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, ఈ ప్రాంతంనుంచి గజరాజును అటవీ ప్రాంతంలోకి తరిమేందుకు అటవీ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఏనుగుల విధ్వంసకాండ
బంగారుపాళెం/చంద్రగిరి/గుడిపాల : జిల్లాలో ఏనుగులు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. పంట పొలాలపై వరుస దాడులు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. బంగారుపాళెం మండలం కీరమంద గ్రామంలో మంగళవారం రాత్రి పంట పొలాలపై ఏనుగులు విధ్వంసకాండ సృష్టించాయి. పూలదడి వంక సమీపంలో గల అటవీ ప్రాంతం నుంచి రెండు ఏనుగులు మహిళా రైతు కొండమ్మ పొలంలోకి ప్రవేశించి, బోరుపైపు, స్టార్టర్‌ను ధ్వంసం చేశా యి. విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు నరేష్, గ్రామానికి చెందిన రైతులు బాల, మునిరత్నం రాత్రి 3 గంటలకు మోటారు బైక్‌పై అక్కడికి వెళ్లారు. మనుషుల రాకను గుర్తించిన ఏనుగులు వారిపై దాడికి దిగాయి. భయాందోళనకు గురైన నరేష్, బాల మునిరత్నం గ్రామంలోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో నరేష్ కిందపడడంతో దెబ్బలు తగిలాయి. మోటారు సైకిల్‌ను ఏనుగులు తొండంతో విసిరివేయడంతో పక్కనే ఉన్న నీళ్లు లేని బావిలో పడింది. అక్కడి నుంచి దేవరగుట్టకు వెళ్లిన ఏనుగులు శ్రీనివాసులుకు చెందిన గుడిసెను ధ్వంసం చేశాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత నాగరాజ గుడిసె వైపునకు వెళ్లి పాడి ఆవులపై దాడి చేశాయి. ఆవుల అరుపులు విని నాగరాజ భార్య దేవమ్మ బయటకు వచ్చింది. ఏనుగులు చేసి ఆమె భయంతో వణికిపోయింది. పశువులు కట్లు తెంపుకుని పొలాల వైపు పరుగులు తీయ డంతో వాటి వెనుకే ఏనుగులు వెళ్లిపోయాయని దేవమ్మ పేర్కొంది. వారం రోజులుగా ఏనుగులు మండలంలోని పాలమాకులపల్లె, శేషాపురం గ్రామాల్లో పంటలను ధ్వంసం చేస్తున్నట్లు రైతులు తెలిపారు. గుడిపాలలో 10 ఎకరాల్లో పంట నష్టం గుడిపాల మండలంలో మంగళవారం రాత్రి ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. అరటి తోట మూడు ఎకరాలు, చెరుకు పంట ఎకరా, పచ్చిగడ్డి ఎకరా, వరి పంట రెండు ఎకరాలు, మామిడి చెట్లు 40 దాకా దెబ్బతిన్నా యి. ఉలవపంటనూ నాశనం చేశాయి. ముత్తువాళ్లూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌నాయుడు అరటితోటలో 300 చెట్లను ధ్వంసం చేశాయి. వీసీ ఖండిగ గ్రామానికి చెందిన కోకిల అనే మహిళా రైతుకు చెందిన 50 సెంట్ల భూమిలో చెరుకు పంట ధ్వంసమైంది. బట్టువాళ్లూరు గ్రామంలో కమలాకర్ అనే రైతుకు చెందిన రెండు ఎకరాల వరిపంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. రెండు గుంపులుగా విడిపోయిన ఏనుగులు గుడిపాల మండలంలోని వెప్పాలమానుచేను, చిత్తపార అటవీ ప్రాంతంలో 14 ఏను గులు సంచరిస్తున్నాయని, మంగళవారం రాత్రి రెండుగా విడిపోవడంతో పంటలన్నింటినీ చాలావరకు ధ్వంసం చేశాయని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి పంటలను కాపాడాలని కోరుతున్నారు. కట్టడి చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం నమస్కారం సార్... మాది శ్రీనివాసమంగాపురం. నేను ఏ.రంగంపేట సమీపంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాను. రూ.60వేలు ఖర్చుపెట్టి ఎకరాలో వరి పంట వేశాను. ఏనుగులు వచ్చి పంటను నాశనం చేశాయి. రేయి కావిలి కాస్తా ఉంటే కూడా ఏనుగులు వస్తా ఉండాయి. అదే పనిగా ఫారెస్టు ఆఫీసు కాడికి పోయి వాళ్లకు చెప్పినా వాళ్లు తిరిగి మళ్లి కూడా చూడలేదు సార్. దయచేసి మాకు ఏదైనా నష్ట పరిహారం ఇవ్వండి సార్.. నేనేదో కూలి చేసుకునే వాడిని.. దయచేసి జీవాలను కట్టడి చేయండి సార్.. లేకుంటే నేను సచ్చిపోతా..మడికాడే ఉరేసుకుని సచ్చిపోతాను సార్.. అంటూ ఏనుగుల దాడిలో పంట నష్టపోయిన కౌలు రైతు కన్నయ్య తన ఆవేదనను సోషల్ మీడియా ద్వారా వెళ్లగక్కాడు. -
గంజాంలో గజేంద్ర బీభత్సం
ఒడిశా, బరంపురం: గంజాం జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోని కళ్లాల్లో ఉన్న ధాన్యం తినేందుకు వస్తున్న ఆ ఏనుగులు అక్కడి కాపలాదారులపై కూడా దాడులకు పాల్పడి, వారు చనిపోయేలా చేస్తున్నాయి. దిగపండి అటవీరేంజ్ పరిధిలో ఉన్న నిమ్మపల్లి కెనాల్ రోడ్డులో ఉన్న ధాన్యం కళ్లాల్లో ఏనుగులు మంగళవారం చొరబడి బీభత్సం సృష్టించాయి. గుంపులు గుంపులుగా అక్కడి కళ్లాల్లోకి ప్రవేశించి, అక్కడి ధాన్యం బస్తాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. అనంతరం అక్కడ కాపలాగ ఉన్న రైతు లచ్చయ్యపై దాడి చేయగా, ఆ రైతు చనిపోయాడు. ఇప్పుడు ఇదే విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.. సన్నొదొండొ వీధి నివాసి లచ్చయ్య, అరకిత పాత్రోతో కలిసి నగర శివారులోని కెనాల్ రోడ్డులో ఉన్న ధాన్యం కళ్లాల్లోని ధాన్యం బస్తాల కాపలాకు సోమవారం రాత్రి వెళ్లారు. వారు వేర్వేరు కళ్లాల్లో పడుకోగా అదేరోజు రాత్రి అక్కడి దగ్గరలోని లకాడి అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపు ఒక్కసారిగా ధాన్యం కల్లంలో చొరబడి అక్కడి బస్తాల్లోని ధాన్యాన్ని తినివేస్తున్నాయి. అదే సమయంలో ఏనుగుల అలికిడికి ఉలికిపడి లేచిన రైతు లచ్చయ్యపై ఆ ఏనుగులను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఏనుగులు అతడిపై దాడికి దిగి, గాయపరిచాయి. ఇదే విషయం తెలుసుకున్న బాధిత గ్రామస్తులు తీవ్రగాయాలతో సంఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ కూడా అతడి పరిస్థితి మెరుగుకాకపోవడంతో దిగపండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రైతు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రైతు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాధిత రైతు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పోగా ఇంట్లో పెద్ద దిక్కు కూడా కోల్పోయామని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని బాధిత గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అలాగే ఏనుగుల దాడిలో వందలాది ధాన్యం బస్తాలు ధ్వంసం కాగా బాధిత రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, అదేరోజు రాత్రి లకాడి పర్వతాల్లో సంచరిస్తున్న మరో ఏనుగుల గుంపు అడపడా గ్రామంలో చొరబడి బీభత్సం సృష్టించాయి. ఆ గ్రామ శివారులోని ధాన్యం బస్తాలను చెల్లాచెదురు చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వీటితో పాటు దిగపండి పరిధిలోని ఆదివాసీ గ్రామాల్లో ఏనుగులు తరచూ చొరబడి అక్కడి గ్రామస్తులను భయాందోళనలు కలిగిస్తుండగా ఇదే విషయంపై స్పందిస్తున్న అటవీరేంజ్ అధికారులు ఏనుగులను సమీప అడవిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తరచూ ఏనుగుల దాడుల కారణంగా పలు విషాద సంఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం. -
ఏనుగులను కవ్వించొద్దు
శ్రీకాకుళం, వీరఘట్టం: ఏనుగులను ఎవరూ కవ్వించొద్దని జిల్లా అటవీశాఖ అధికారి జి.సందీప్‌కృపాకర్ అన్నారు. వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఏనుగుల గుంపును తరిలించేందుకు బుధవారం ఇక్కడకు వచ్చిన డీఎఫ్ఓ విలేకర్లతో మాట్లాడారు. ఏనుగులను ఒడిశాలోని లఖేరీ అడవులకు తరలించేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అటవీశాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏనుగులను తరలిస్తున్నప్పుడు సమీప గ్రామాల ప్రజలు అలజడులు చేస్తే తిరగబడే అవకాశం ఉందన్నారు. ఏనుగులను రెచ్చగొట్టకుండా అటవీశాఖ అధికారులు పహారా కాస్తున్నారన్నారు. మొత్తం 20 మంది ట్రాకర్లు, రెండు జిల్లాలకు చెందిన 15 మంది అటవీశాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారన్నారు. కురుపాం ఎఫ్ఆర్ఓ మురళీకృష్ణ, పార్వతీపురం సబ్ డీఎఫ్ఓ రాజారావు, పాలకొండ రేంజర్ సోమశేఖరరావు, వీరఘట్టం డీఆర్ఓ విఠల్‌కుమార్ ఉన్నారు. రాత్రంతా ఆందోళన.. ఏనుగులు వీరఘట్టం పరిసర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి సంచరించడంతో కూరగాయల రైతులు, పొలాల్లో వరి కుప్పలు వేసిన రైతులు ఆందోళన చెందారు. మొక్కజొన్న, చెరుకు, కూరగాయల పంటలను ధ్వంసం చేశాయని రైతులు అన్నారు. ఏగునులు రాత్రంతా వీరఘట్టం ఒట్టిగెడ్డ సమీపంలోని కొట్టుగుమ్మడ బ్రిడ్జి పరిసరాల్లో తిరిగాయన్నారు. ఎం.రాజపురం జంక్షన్ మీదుగా తెల్లవారు జామున సీఎస్పీ రహదారి దాటుకుంటూ అచ్చెపువలస కొండలవైపు వెళ్లాయన్నారు. -
గజరాజుల అలజడి
శేషాచలం అడవుల్లో నుంచి ఈ ఏడాది గజరాజులు అటవీ సరిహద్దు ప్రాంతాలైన పంట పొలాల్లోకి వచ్చేయడంతో రైతుల కంటికి కునుకు కరువవుతోంది. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భీతిల్లుతున్నారు. అటవీ సరిహద్దుల్లో ఉన్న మామిడి తోటల్లో పంట కోనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో రైతులు సైతం ఆందోళన చెందారు. చివరకు రైతులే పంటను మార్కెట్ చేసుకున్నారు. సాక్షి, భాకరాపేట(కడప) : పశ్చిమ కనుమల నుంచి వచ్చిన ఏనుగులు గుంపు శేషాచలం అడవుల్లో మకాం వేశాయి. శేషాచలం అటవీ సరిహద్దు మండలాలైన ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, వైఎస్సార్ జిల్లా బాలపల్లె అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు మామిడి కాయల సీజన్ వస్తే చాలు ఏనుగుల దాడులతో భయపడుతున్నారు. ఛామల అటవీ ప్రాంతం పరిధిలో గతంలో నాలుగేళ్ల కాలంలో 257 మంది రైతులు 709.96 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోగా, అందుకుగాను ప్రభుత్వం నుంచి రూ.60,17,599 నష్టపరిహారం రైతులకు అందింది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు తమ పంటలు, ఆస్తుల నష్టానికి సంబంధించి పరిహారం అందలేదంటున్నారు. ఈ ఏడాది ఏనుగుల గుంపు అటవీ సరిహద్దు పొలాల్లోకి జూన్ మొదటి వారం వరకు రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తరువాత రెండు వారాలుగా ఏనుగుల గుంపు వచ్చి పంటను ధ్వంసం చేయడం మొదలెట్టాయి. చిన్నగొట్టిగల్లు మండలంలో టమాట పంటను నాశనం చేశాయి. రెండు రోజులుగా చంద్రగిరి మండలంలో ఏనుగులు గుంపు పంటలను నష్టపరుస్తున్నాయి. తలకోన, కల్యాణిడ్యాం పరిసర అటవీ ప్రాంతాల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. గతేడాది రెప్పపాటులో తప్పించుకున్నా గత ఏడాది బావి వద్ద పని చూసుకుని ఇంటికి వెళుతుండగా ఏనుగుల గుంపు పెద్ద శబ్ధాలు చేస్తూ రావడం చూసి పరుగులుతీశాను. ఒక ఏనుగు దారిలోనే ఉంది, గమనించకుండా ముందుకు వెళ్లాను. ఒక్కసారిగా పైకి రావడంతో భయపడి మరింత వేగం పెంచా. కిందపడిపోవడంతో కాలు బెణికింది. అప్పుడు నా వరి పైరు మొత్తం ధ్వంసం చేశాయి. – విశ్వనాథ్, రైతు, మల్లెలవాండ్లపల్లె అటవీ అధికారులువెంటనే చర్యలు చేపట్టాలి ఏనుగుల గుంపు పగలంతా అడవుల్లో ఉంటున్నాయి. పొద్దుపోయిన తరువాత వెంటనే సమీపంలోని పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. అటవీ అధికారులు సత్వరం చర్యలు తీసుకుని ఏనుగుల గుంపును దారి మళ్లించాలి. – నారాయణ, రైతు, మల్లెలవాండ్లపల్లె -
కిచ్చాడలో గజరాజుల తిష్ట
కురుపాం/జియ్యమ్మవలస: కొన్నాళ్లుగా జియ్యమ్మవలస, కొమరాడ మండలాలకు చెందిన ప్రజలను గజగజలాడిస్తున్న గజరాజుల గుంపు ఇప్పుడు కురుపాం మండలంలోని కిచ్చాడ గ్రామానికి చేరుకున్నాయి. ఈ మేరకు కిచ్చాడ గ్రామంలో ఉన్న పామాయిల్, అరటి తోటల్లోకి సోమవారం రాత్రి ప్రవేశించి తోటలకు పిచికారీ చేసే ఎరువులు ధ్వంసం చేసినట్లు గ్రామస్తులు, రైతులు మంగళవారం తెల్లవారుజామున గుర్తించారు. దీంతో గ్రామంలోని ప్రజలు భయాందోళనల మధ్య బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారి మురళీకృష్ణ, సిబ్బంది గ్రామానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి జియ్యమ్మవలస మండలం బట్లభద్ర గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను నాశనం చేశాయి -
అంతులేని ధ్వంస రచన
సీతంపేట, పాతపట్నం, హిరమండలం:ఏనుగులు మళ్లీ తడాఖా చూపిస్తున్నా యి.. రెండు రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సీతంపేట, కొత్తూరు, మెళియాపుట్టి, మందస, పాతపట్నం, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం తదితర ప్రాంతాల్లో వీరవిహారం చేయడంతో జనం బెంబేలెత్తుతున్నారు. హిరమండలంలోని తంప, దనుపురం గ్రామాల మధ్య ఉన్న జీడి, మామిడి తోటలను ఏనుగులు శుక్రవారం ధ్వంసం చేశాయి. కొండప్రాంతాల్లో ఉండాల్సిన ఏనుగులు మైదాన ప్రాంతాల్లో సంచరించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. గత రెండు రోజులుగా పాతపట్నంలో సంచరించిన ఏనుగుల గుంపు.. శనివారం ఉదయం కొరసవాడ మీదుగా తంప దనుపురం గ్రామాల మధ్యనున్న కొండపైకి చేరుకొని తిష్టవేశాయి. రాత్రి వేళల్లో ఇవి గ్రామాల్లోకి చొరబడిపోతాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పొలిమేరల్లో సంచరించడంతో బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఏనుగుల గుంపు గురువారం రాత్రి పాతపట్నం మండలం రొంపివలస,సీది నుంచి మహేంద్రతనయ నదీ తీరం మీదుగా తంప–దనుపురం ప్రాంతానికి చేరుకోవడంతో అటవీశాఖ సిబ్బంది స్ధానికులను అప్రమత్తం చేస్తున్నారు. పుష్కరకాలంగా ఇదే అవస్థ.. ఏనుగులు, జనానికి మధ్య ఎలాంటి వైరం లేకపోయినా ఇరువర్గాల నడుమ జీవన పోరాటం పన్నెండేళ్లుగా సాగుతోంది. ఐటీడీఏ పరిధిలోని వివిధ మండలాల్లోని ప్రజల అవస్థ అంతా ఇంతా కాదు. 2007లో ఏనుగులు సీతంపేట మన్యంలో ప్రవేశించాయి. రెండేళ్ల కిందట మరో ఏనుగుల గుంపు మందస వైపు నుంచి వచ్చి చేరాయి. సీతంపేట ఏజెన్సీలో ప్రస్తుతం నాలుగు ఏనుగుల గుంపు సంచరిస్తుండగా మెళియాపుట్టి, పాతపట్నం మండలా ల్లో ఆరు ఏనుగులు సంచరిస్తున్నాయి. సాగులో ఉన్న వరి, మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలను నాశనం చేస్తున్నాయి. పంటనష్టం షరా మామూలుగా మారగా అప్పుడప్పుడు ప్రజల ప్రాణాలకు సైతం ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు వేలాది ఎకరాల్లో అడవులు విస్తరించి వివిధ రకాల చెట్లకు నిలయమైన ఏజెన్సీ కొండప్రాంతాలు ఇప్పుడు విస్తీర్ణం తగ్గిపోయింది. అభివృద్ధి పేరిట అడవుల్లో రహదారులు, విద్యుత్ లైన్లు, రావడం కొండపోడు వంటి వాటి పేరుతో కాల్చి వేయడంతో మూగజీవాలకు సైతం నిలువ నీడలేక మైదాన ప్రాంతాలకు వచ్చేస్తున్నాయి. ఒడిశా లకేరీ ప్రాంతంలో ఎక్కువగా చెట్లు నరకడం, అడవుల్లో జనసంచారం, అలజడి సృష్టించడం కారణంగా ఇటు వైపు ఏనుగులు వచ్చేస్తున్నాయి. ఏనుగులు గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నప్పటికీ వాటికి అవసరమైన చెట్ల పెంపకాన్ని అటవీశాఖ చేపట్టలేదు. వెదురు, రావి, వెలగ, మర్రి, చింత, ఇతర పండ్ల జాతుల చెట్లు, దట్టమైన పచ్చిక బైళ్లు ఏనుగులకు ఆహారం. కానీ అడవుల్లో ఈ జాతులు దాదాపుగా అంతరించిపోయి ఆహారం కరువైంది. దీం తో గిరిజనులు పండించిన వేలాది ఎకరాల్లో పంటలను నాశనం చేస్తున్నాయి. ఇప్పటివరకు సుమారు 6 వేల ఎకరాలకు పైగా పంటల నష్టం సంభవించింది. గిరిజనులు లక్షల్లో నష్టపోతే పరిహారం అరకొరగా అందజేస్తున్నారు. నీరే ప్రధానం.. ఏనుగుల నివాసానికి నీటి వసతి అత్యంత ప్రధానమైంది. వాటి చర్మం దళసరిగా ఉండడంతో వేడిని తట్టుకోవడానికి తరుచుగా నీరు తాగడం, మీద చల్లుకోవడం చేస్తుంటాయి. భరించలేని పరిస్థితుల్లో బురద మట్టిని దేహనికి పూసుకుంటాయి. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో ఏనుగులకు కావా ల్సిన మేత కూడా పెరిగే అవకాశం ఉంది. దీన్ని గుర్తించడంతోనే అటవీ శాఖ గతంలో అడవుల్లో నీటి కుంటలు నిర్మించారు. అనంతరం వీటి నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో చాలావరకు నిరుపయోగంగా మారాయి. ఎక్కడైతే నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడే ఏనుగులు తిష్ట వేస్తున్నాయి. ప్రస్తుతం సీతంపేట మండలంలోని బొండిగెడ్డ వద్ద నీరు ఉండడంతో అక్కడ గత పక్షం రోజు లుగా తిరుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంత గిరిజనులంతా ఆందోళన చెందుతున్నారు. మహేంద్రతనయలో నీరు ఉండడంతో అక్కడ కొన్ని ఏనుగులు తిష్టవేశాయి. శాశ్వత పరిష్కారాలు లేవా...? ఏనుగులు, ఇతర వన్యప్రాణులు జనావాసాల వైపు రాకుండా శాశ్వత పరిష్కార మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వేసవిలోనూ వాటికి మేత, నీరు లోటు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తే దాడుల తీవ్రత బాగా తగ్గించవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఏనుగుల నియంత్రణకు కొద్ది రోజుల కిందట కందకాలు తవ్వడం వంటివి చేసినప్పటికీ గిరిజనుల నుంచి వ్యతిరేకత ఏర్పడింది. ఎందుకంటే ఆ కందకాల్లో గిరిజనులకు చెంది న ఆవులు, మేకలు వంటివి పడి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సోలార్ కంచె వంటివి ఏర్పాటు చేసినా అంత ఫలితం ఉండదని గిరిజనులు చెబుతున్నారు. మరోవైపు తమ జీవనానికి ఆటంకం ఏర్పడుతుందని తెలియజేస్తున్నారు. -
జనం ‘గజ..గజ’
చిత్తూరు, పలమనేరు: ఈ మధ్యనే కాలువపల్లె అడవిలో ఎలి ఫెంట్ ట్రాకర్స్‌పై ఏనుగులు దాడిచేయడంతో నలు గురు ట్రాకర్స్ గాయపడ్డారు. అంతకుముందు ఇదే అడవిలో అటవీ సిబ్బందిపై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రెండేళ్ల క్రితం పి.వడ్డూరుకు చెందిన చిన్నబ్బను తొక్కి చంపాయి. ఏడాది క్రితం చెత్తపెంటకు చెందిన రైతు మునీంద్రను బలిగొన్నాయి. తాజాగా పొలం వద్ద పడుకుని ఉన్న ముగ్గురిపై ఏనుగు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో పలమనేరు, కుప్పం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఆరుగురి ప్రాణాలు గజరాజుల కారణంగా గాల్లో కలిసాయి. ఏనుగులు దాడులకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్య జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో దశాబ్దాలుగా ఏనుగులు దాడుల మూలాన పంట, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పలమనేరు మండలంలోనే రెండేళ్ల కాలంలో ఏనుగుల దాడులు నాలుగైదు జరిగాయి. ప్రజల ప్రాణాలకు దినదిన గండంగా ఈ సమస్య మారినా పరిష్కారం విషయంలో పాలకుల అలసత్వం శాపంగా మారింది. అడవి నుంచి జనావాసాల్లోకి.. అడవిలో మేత, నీరు కరువై తరచూ ఈ ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఇప్పటికి ఏడు ఏనుగులు సైతం మృత్యువాత పడ్డాయి. ఏనుగులను దారి మళ్లించేందుకు ప్రజలు టపాసులు పేల్చడం, టైర్లను కాల్చడం, పెద్దపెట్టున శబ్దాలను చేస్తుండడంతో కొన్ని సందర్భాల్లో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. ఏనుగులు మూడు గ్రూపులుగా విడిపోయి, రెండు మాత్రం ఒంటరిగా మారి ఎటుపడితే అటువెళుతూ పంటలు, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తమిళనాడు పాపం–మనకు శాపం ఒక ఏనుగుకు సగటున రోజుకు 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరముంది. దీంతో అవి మేతకోసం మైళ్లదూరం వెళుతుంటాయి. మన రాష్ట్ర సరిహద్దు నుంచి ఏనుగులను తమిళనాడు అడవిలోకి వెళ్లగానే అక్కడి అటవీశాఖ వాటిని తిరిగి ఇక్కడికి మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడుతున్నాయి. నీరుగారిన లక్ష్యం పంటలను ధ్వంసం చేసే ఏనుగులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. లక్షలాది రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికి తోడు సోలార్ ఫెన్సింగ్ సక్రమంగా పనిచేయడం లేదు. ఈ మధ్యనే (ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచెస్) పనులను చేపట్టారు. వీటిని సైతం దాటి ఏనుగులు పంటల వైపు వస్తుండటంతో రైతులకేమీ పాలుబోవడం లేదు. ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. గజదాడుల ఘటనలు ♦ 2013లో ఏనుగుల గుంపు గుడిపల్లె మండలంలోని పెద్దపత్తికుంట గ్రామంలోకి చొరబడి ఓ రైతును పొట్టన పెట్టుకున్నాయి. ♦ 2014లో వి.కోట మండలంలోని నాయకనేరి ప్రాంతంలో ఓ రైతు ఏనుగు దాడిలో మరణించాడు. ♦ 2014 డిసెంబర్లో రామకుప్పం మండలం లోని ననియాల అటవీ ప్రాంతంలో వాచర్ మునెప్పను ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ♦ 2015లో గుడుపల్లె మండలంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. ♦ 2016లో బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన పెరుమాళప్ప అడవిలో ఉండగా ఏనుగులు తొక్కి చంపాయి. ♦ 2017 జూన్‌లో పలమనేరు అటవీశాఖ కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిపై మదపుటేనుగు దాడి చేసింది. వీరిలో ఒకరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ♦ 2017 ఆగస్టులో పలమనేరు మండలం పి. వ డ్డూరుకు చెందిన రైతును తొక్కి చంపేశాయి. ♦ 2018లో ఇద్దరు అటవీ ఉద్యోగులపై ఏనుగు లుదాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ♦ తాజాగా ఏనుగు కారణంగా గొబ్బిళ్లకోటూరుకు చెందిన హరికృష్ణ, ఉదయ్‌కుమార్, సోమశేఖర్ గాయపడ్డారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఏ క్షణంలో ఏనుగులు దాడులు చేస్తాయో తెలియదు. రైతుల ప్రాణాలకు రక్షణ కరువైంది.అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎలా?– మురుగన్, రైతు, చెత్తపెంట ప్రతిరోజూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం కౌండిన్య అడవిలో ప్రస్తుతం ఏనుగులు మూడు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిలో రెండు వేర్వేరుగా తిరుగుతున్నాయి. వేరుగా తిరిగే రెండు ఏనుగులు జనాన్ని చూస్తే దా డులకు పాల్పడుతున్నాయి. ప్రజలే కాదు మా సిబ్బంది, ఎలిఫెంట్ ట్రాకర్స్ కూడా గా యపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. –ఎఫ్ఆర్వో మదన్‌మోహన్‌రెడ్డి, పలమనేరు. -
బిత్రపాడులో ఏనుగుల బీభత్సం
విజయనగరం , జియ్యమ్మవలస: కురుపాం నియోజవర్గంలోని పలు గ్రామాల్లో కొద్ది నెలలుగా తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్న గజరాజులు తాజాగా జియ్యమ్మవలస మండలం బిత్రపాడులో మంగళవారం రాత్రి విధ్వంసం సృష్టించాయి. ఎకరాలకొద్దీ పంటను నాశనం చేశాయి. సుమారు ఐదు నెలలుగా ఏనుగుల నుంచి తామంతా ఇబ్బంది పడుతున్నా వాటిని శాశ్వతంగా తరలించే విషయంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ ఆరో తేదీన మండలంలోని ఏనుగులగూడలో ప్రవేశించిన ఏనుగులు నేటికీ సంచరిస్తూనే ఉన్నా ప్రభుత్వం శాశ్వతంగా తరలించే ప్రయత్నం చేయలేదు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండలాల మీదుగా ఒడిశా తరలించినా మళ్లీ ఏనుగులు తిరిగి వచ్చేస్తున్నాయి. పంట నష్టం తీవ్రంగా ఉన్నా అధికారులు చాలీచాలని పరిహారంతో చేతులు దులుపుకుంటున్నారు. ఎన్నో విధాలుగా తాము నష్టపోతుంటే ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయని బిత్రపాడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఐదు నెలలుగా.. సుమారు ఐదు నెలల నుం చి ఏనుగులు సంచరిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవ డం లేదు. పరిష్కరించలేప్పుడు కేంద్ర ప్రభుత్వ సా యం తీసుకోవాలి. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం.– అల్లు రాజేశ్వరరావు,మాజీ వైస్ ఎంపీపీ, బిత్రపాడు -
వదలని ఏనుగులు
విజయనగరం, కొమరాడ : సుమారు ఐదు నెలలుగా మండలంలోని పలు గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తూ భయానక వాతావరణం నెలకొల్పుతున్నాయి. గ్రామాల మీదుగా సంచరిస్తూ అడ్డు వచ్చిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల పకీరు అనే గిరిజనుడు ఏనుగుల దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అలాగే గంగురేగువలసలో మరో వ్యక్తిపై కూడా దాడికి తెగబడ్డాయి. ఇదిలా ఉంటే ఏనుగులను తరలించే ప్రక్రియలో భాగంగా మందుగుండు కాల్చే ప్రక్రియలో ప్రమాదవశాత్తూ గంగురేగువలసలో సుమారు పదెకరాల చెరకు పంట కాలిపోయింది. అలాగే ఆదివారం జంఝావతి కుడికాలువ దాటుకుంటూ ఆర్తాం గ్రామ సమీపంలోని పొలాల్లో ఉన్న మోటార్, పైపులను ఏనుగలు ధ్వంసం చేశాయి. గున్న ఏనుగు మృతి తట్టుకోలేక.. గతంలో ప్రమాదవశాత్తూ ఎనిమిది ఎనుగలు గుంపులో ఓ గున్న ఏనుగు ఆర్తాం పరిసరాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగిలి చనిపోయింది. దీంతో గున్నను మరిచిపోలేని ఏనుగుల గుంపు తిరిగి తిరిగి మళ్లీ మండలంలోకే వస్తున్నాయి. ఈక్రమంలో పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. కొమరాడ మండంలోని ప్రధాన పంట అయిన జొన్న, చెరకు, కూరగాయలు, తదితర పంటలు నాశనం అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఏనుగులు తిరుగుతున్న ప్రదేశాల్లో అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. దీంతో అటు ఏనుగులతోను ఇటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఏనుగులను శాశ్వతంగా తరలించాలని కోరుతున్నారు. -
ప్రాణ నష్టం జరిగితేగాని స్పందించరా...!
విజయనగరం, కురుపాం: ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలలుగా కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మవలస, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లోనే ఏనుగులు సంచరిస్తూ అరటి, వరి, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆమె మాట్లాడుతూ మూడు నెలలుగా ఏనుగులు కురుపాం నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనే ఉంటున్నాయని చెప్పారు. దీంతో రైతులు తమ వ్యవసాయ పనులను చేయలేక తమ పంటలను రక్షించుకోలేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని లేకుంటే భవిష్యత్‌లో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని పేర్కొన్నారు. గజరాజుల సంచారంతో ఈ ప్రాంత ప్రజలకు కొద్ది నెలలుగా కంటి మీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఏనుగులు మూడు మండలాల్లోనే సంచరిస్తూ పంటలనే తింటున్నాయని, మున్ముందు ప్రజలపై అవి విరుచుకుపడి ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. నెలల తరబడి వీటి సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతుంటే పాలకులు దీన్ని తీవ్రంగా పరిగణించకపోవడం దారుణం అని పేర్కొన్నారు. మరింత నష్టాలు సంభవించ కుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిపుణులను రప్పించి ఏనుగులను తరలించే చర్యలు చేపట్టాలని పుష్పశ్రీవాణి కోరారు. -
ఖడ్గవలసలో ఏనుగుల సంచారం
విజయనగరం, గరుగుబిల్లి: కొద్ది రోజులుగా ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్న ఏనుగులు తాజాగా మంగళవారం మండలంలోని సుంకి, తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోని కుడిమట్టికట్ట వద్ద ఖడ్గవలస సమీపంలో సంచరిస్తున్నాయి. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల్లో పంట నష్టం తీవ్రంగా జరుగుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు పరిసరాల్లోనే నాలుగు రోజుల నుంచి ఏనుగులు సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వరి పంటతో పాటు అరటి తదితర పంటలను నష్టపరుస్తున్నాయి. ప్రణాళిక ప్రకారం తరలింపు ఏనుగులను ఒక ప్రణాళిక ప్రకారం తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్టు పార్వతీపురం జిల్లా అటవీశాఖ అధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. మంగళవారం ఆయన సుంకి పరిసరాలలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 9 నుంచి ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాయని చెప్పారు. ఒడిశాకు వెళ్లినా తిరిగి ఇక్కడకు వచ్చాయని చెప్పారు. ఏనుగులను తరలించేందుకు బేస్ క్యాంప్స్, ట్రాక్స్ల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. పంట నష్టం జరిగితే పరిహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఆయనతో పాటు పార్వతీపురం, కురుపాం రేంజర్స్ ఎం.మురళీకృష్ణ, కళ్యాణముని తదితరులున్నారు. -
ఏడాదిన్నరగా ఎదురుచూపులే..
శ్రీకాకుళం , సీతంపేట: మన్యంలో ఏనుగుల గుంపు విధ్వంసానికి ఆర్థికంగా కుదేలైన గిరిజనులు పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏడాదిన్నరగా పరిహారం చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏనుగుల గుంపును తరిమికొట్టడంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. మరోవైపు ఇటీవల తిత్లీ తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ నష్టపోయిన వీరిని ఆదుకున్న పాపానపోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు మండలాల్లోనే ప్రధానంగా వరి, అరటి, చెరుకు, జీడి మామిడి తదితర పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. 2008లో 11 ఏనుగుల గుంపు లకేరీ అడవుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఏజెన్సీలో ప్రవేశించాయి. అప్పట్నుంచి నాలుగైదేళ్లుగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో పంటలను నష్టపరిచాయి. ప్రస్తుతం నాలుగు ఏనుగులు సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లోనే సంచరించి పంటలను నాశనం చేస్తున్నాయి. ఏడాది కిందట మరో 7 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశాయి. వరి కోతకు వచ్చే సమయంలో నాశనం చేయడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఇంత భారీ స్థాయిలో నష్టం కలిగిస్తున్నప్పటికీ అటవీశాఖ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖలు స్థాయిలో సర్వే చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఉన్నవారికి మాత్రమే పరిహారం చెల్లించి, పట్టాలు లేని వారిని లెక్కల్లోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. పరిహారం అరకొర పంపిణీ.. ఏనుగుల వల్ల కలిగిన పంట నష్టంపై అరకొరగా పరిహారం పంపిణీ చేసి అటవీశాఖ చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు 1,008 మంది రైతులకు 249.42 ఎకరాలకుగాను రూ.36.99 లక్షల వరకు మాత్రమే పరిహారం చెల్లించారు. ఆరు మండలాల్లో దాదాపు 8 వేల ఎకరాల్లో పంటల నష్టం ఉంటుందని గిరిజనుల అంచానా. దాదాపు రెండు వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. కోటి రూపాయల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. మండలంలోని అంటికొండ, అచ్చిబ, కుడ్డపల్లి, పెద్దగూడ, మండ, జక్కరవలస, బుడగరాయి, దోనుబాయి, పుబ్బాడ తదితర ప్రాంతాల పరిధిలో ఏనుగులు ఇటీవల పంటలు నాశనం చేసినా ఎటువంటి పరిహారమూ అందలేదు. అటవీశాఖ వైఫల్యం ఏనుగుల వల్ల పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏడాదిన్నర కిందట అరకొర పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏనుగులు విపరీతంగా పం టలను నాశనం చేస్తున్నాయి. వీటివల్ల పంట నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లిం చాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే ఏనుగుల వల్ల పంట నష్టం కలిగిన మండలాలు: 6 ఏయే మండలాలు: సీతంపేట, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, వీరఘట్టం, పాలకొండ నష్టం : 8 వేల ఎకరాలపైనే ఇంతవరకూ చెల్లింపు : 249 ఎకరాలు చెల్లించిన పరిహారం: రూ.36లక్షలు ఇంకా చెల్లించాల్సిన పరిహారం: రూ.కోటిపైనే -
వనాలు తరిగి.. జనాలపైకి ఉరికి..
జిల్లా వాసులను ఏనుగుల భయం వెంటాడుతూనే ఉంది. 11 ఏళ్ల క్రితం ఒడిశాలోని లకేరీ అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకొచ్చిన గజరాజులు అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇక్కడే ఉండిపోయాయి. తాజాగా ఎనిమిది ఏనుగుల గుంపు కూడా కొద్ది నెలల క్రితం జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో జనం భయాందోళన చెందుతున్నారు. పంటలపై పడి నాశనం చేస్తుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో జనం కూడా ఏనుగుల దాడిలో చనిపోయారు. అయినా అటవీ శాఖ అధికారులు వీటిని సాగనంపే ఏర్పాట్లపై మీనమేషాలు లెక్కిస్తున్నారు తప్పితే సీరియస్‌గా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఒడిశాలోని అటవీ ప్రాంతంలో మైనింగ్ జోరుగా జరుగుతుండడంతో మరికొన్ని ఏనుగులు సిక్కోలు ఏజెన్సీలోకి వచ్చే అవకాశం ఉందనే సమాచారం అధికారులను.. ప్రజలను కలవర పెడుతోంది. శ్రీకాకుళం, వీరఘట్టం/పాలకొండ: జిల్లాలో ఏనుగుల గుంపుల సంచారం వెనుక మానవ తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. వాటి ఆవాసాలపై అక్రమార్కులు దాడులు చేస్తే అవి కూడా దాడులు చేస్తున్నాయి. దట్టమైన అడవుల్లో జరుగుతున్న మైనింగ్ కారణంగానే అభయారణ్యం నుంచి జనారణ్యంలోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా విస్తీర్ణం 5,837 చదరపు కిలోమీటర్లు ఉంది. ఇందులో అటవీ భూములు 616 చదరపు కిలోమీటర్లు. 70,350 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి భూభాగంలో 33 శాతం అడవులు ఉంటే వన్యప్రాణులకు, ప్రకృతి సంపదతో పాటు మానవాళి మనుగడకు ఎటువంటి ముప్పు ఉండదని శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. అయితే మన జిల్లాలో మాత్రం అడవులు కేవలం 10 శాతం మాత్రమే ఉన్నాయి. వన్యప్రాణులు ఉండేందుకు సరైన ఆవాసాలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. దీంతో 11 ఏళ్లలో రెండు పర్యాయాలు రెండు గుంపులుగా వచ్చిన 11 ఏనుగులు అడవుల్లో ఉండలేక జనారణ్యంలోకి వస్తూ పంటలు నాశనం చేస్తున్నాయి. జనాలపై విరుసుకుపడి ప్రాణాలను హరిస్తున్నాయి. ఇదీ పరిస్థితి.. జిల్లాకు పక్కనే అతి సమీపంలో ఒడిశా రాష్ట్రంలోని లకేరీ అటవీ ప్రాంతంలో అభయారణ్యం ఉంది. ఇందులో వందల సంఖ్యలో ఏనుగులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అభయారణ్యం చుట్టూ విలువైన గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకు అక్కడ మైనింగ్ మాఫియా చేపడుతున్న బాంబ్ బ్లాస్టింగ్ల వల్ల ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. పెద్ద శబ్దాలకు భయపడడం ఏనుగుల నైజం. బాంబు బ్లాస్టింగ్ వల్ల భయంతో ఒడిశా అటవీ ప్రాంతాన్ని వదిలి శ్రీకాకుళం జిల్లాలోని అటవీ ప్రాంతంలోకి చొచ్చుకువస్తున్నాయి. గజ భయం సిక్కోలు ప్రజలను గజ భయం వెంటాడుతోంది. ఇప్పటికే గత 11 ఏళ్లలో రెండు పర్యాయాలు రెండు గుంపులుగా వచ్చిన ఏనుగులతోనే భయభ్రాంతులకు గురవుతున్న అటవీ ప్రాంత ప్రజలకు మరో ముప్పు పొంచిఉందనే సమాచారం చేరింది. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు అటవీశాఖ అధికారులే చెబుతున్నారు. ఒడిశా లకేరీ అభయారణ్యం నుంచి ఈ ఏనుగుల గుంపు విజయనగరం–శ్రీకాకుళం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల గుండా ప్రవేశిస్తున్నాయి. గతంలో కూడా ఇదే ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగుల గుంపు ఏళ్ల తరబడి కదలకుండా తిష్ఠ వేశాయి. ఇప్పుడు మరో గుంపు రానుందనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిద్రావస్థలో సర్కార్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ప్రయత్నిస్తే ప్రస్తు తం ఉన్న ఏనుగుల గుంపును తరలించవచ్చు. మరో ఏనుగుల గుంపు జిల్లాలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవచ్చు.అయితే ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గతంలో ఓసారి చేపట్టిన ఆపరేషన్ గజ కూడా సత్ఫలితా లు ఇవ్వలేదు. అటవీశాఖ అధికారులు ఏమైనా వ్యూహరచన చేస్తున్నారంటే అదీ లేదు. చివరకు జిల్లాలో ఏనుగులు సంచరిస్తే ఎంతో మేలు అన్నట్లుగా ఈ శాఖ వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఏనుగులను తరలించే చర్యల్లో భాగంగా పుష్కలంగా నిధులు ఖర్చు చేయవచ్చు. వాటికి లెక్కలు అడిగేవారుండరు. అమలు కాని హామీలు... 2007లో ఒడిశా నుంచి జిల్లాలోకి చొరబడిన ఏనుగులు ఇంతవరకూ 11 మందిని హతమార్చాయి. పలువురుని గాయపరిచాయి. గతంలో అటవీశాఖ మంత్రిగా పని చేసిన శత్రుచర్ల విజయరామరాజు పాలకొండ, కురుపాం అటవీ రేంజ్‌ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ఏనుగులు సంచరించే అభయారణ్యం (ఎలిఫెంట్ జోన్)గా మార్చుతామని ప్రకటన చేశారు. అయితే ఒక ప్రాంతాన్ని అభయారణ్యంగా చేయాలంటే రూ.కోట్ల నిధులు ఖర్చుతో కూడుకున్న పని. అడవి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న వేలాది మందికి జీవనోపాధి కల్పించి, ఆవాసం కల్పించాలి. ఇలా చేయాలంటే రూ.కోట్లు ఖర్చు చేయాలి. దీంతో అప్పటి ప్రభుత్వం అభయారణ్యం ప్రతిపాదనను పక్కన పెట్టేసింది. అప్పటి నుంచి ఏనుగుల గుంపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతాల్లో సంచరిస్తూనే ఉన్నాయి. అప్పుడప్పుడూ ఒడిశా అడవుల వైపు వెళుతూ మరలా వెళ్లిన తోవలోనే తిరిగి జిల్లాలోకి వచ్చేస్తున్నాయి. ఇలా ఏనుగులు వస్తూ..పోతూ ఉండడంతో ఇవి నడిచే ప్రాంతాల్లో ఉన్న పంటలు నాశనమౌతున్నాయి. ఏనుగులను తరలించేందుకు కూడా ఇప్పటి ప్రభుత్వం చొర వ చూపక పోవడంతో ప్రాణ భయంతో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. వీటికి తోడు మరో ఏనుగుల గుంపు వచ్చే అవకాశం ఉందనే సమాచారంతో గిరిజనులు వణికిపోతున్నారు. -
గజ..గజ!
శ్రీకాకుళం , వీరఘట్టం: జనావాసాలకు సమీపంలోకి ఏనుగుల గుంపు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు వస్తుందోనని గజగజలాడుతున్నారు. విజయనగరం జిల్లా సమీప గ్రామాల నుంచి జిల్లాలోని వీరఘట్టం మండలం సంత–నర్శిపురం గ్రామ పొలిమేరల్లోకి శుక్రవారం ఆరు ఏనుగుల గుంపు చొచ్చుకొచ్చాయి. ఇవి ప్రస్తుతం చెరుకు తోటలో తిష్ఠ వేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడే ఉన్నాయి. చెరువుల్లో నీరు ఉండడంతో ఇక్కడ నుంచి కదలడం లేదు. ఏనుగుల భయంతో రైతులు పొలాల వైపు వెళ్లలేదు. వరికోతలను కూడాశుక్రవారం విరమించుకున్నారు. రెండు నెలల క్రితం సీతంపేట మండలం నుంచి వీరఘట్టం మండలంలోకి చొరబడిన ఏడు ఏనుగుల గుంపు హుస్సేనుపురం, నీలంపేట, కుంబిడి, బల్లగుడ్డి, అచ్చెపువలస, ఎస్.గోపాలపురం, జె.గోపాలపురం, పెద్దూరు, చలివేంద్రి, దశుమంతపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ చెరుకు, వరి పంటలతోపాటు అటవీ ఉత్పత్తులను నాశనం చేశాయి. అనంతరం విజయనగరం జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏడు ఏనుగుల గుంపులో ఒకటి సెప్టెంబర్ 16న కొమరాడ మండలం అర్తాం వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. అయితే మిగిలిన ఆరు ఏనుగులు వెళ్లిన మార్గం గుండానే మళ్లీ శుక్రవారం వీరఘట్టం మండల పరిసరాల్లోకి ప్రవేశించడంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని పీఏసీఎస్ అధ్యక్షుడు కర్రి గోవిందరావు విజ్ఞప్తి చేశారు. అప్రమత్తంగా ఉండాలి ఏనుగులు ఎటు వైపు వెళ్తాయో తెలియని పరిస్థితలో ఉన్నాయని అటవీశాఖ రేంజర్ జగదీష్ అన్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏనుగులను దారి మళ్లించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కదలకుండా వెళ్లిన మార్గం గుండానే వీరఘట్టం మండలంలోకి ప్రవేశించాయన్నారు. వీటి పయనాన్ని పరిశీలిస్తున్నామన్నారు. -
వచ్చిన దారినే...
జిల్లాలోకి ఏనుగుల గుంపు ఏ మార్గంలో ప్రవేశించాయో అదే మార్గంలో వెనక్కి వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. శుక్రవారం రాత్రి జిల్లాను వీడి శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన చర్యలు కూడా చేపట్టినట్టు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిపారు. మరోవైపు గజరాజులు ఎప్పుడు జిల్లాను దాటి వెళ్తాయా? అని ఆసక్తితో చూస్తున్నారు. విజయనగరం, జియ్యమ్మవలస: జిల్లాలోని ఏజెన్సీలోకి వచ్చిన గజరాజులు వచ్చిన మార్గానే వెనక్కి తరలుతున్నాయి. సెప్టెంబరు 6న మండలంలోని ఏనుగులగూడ, గడసింగుపురంలో ప్రవేశించిన ఎనిమిది ఎనుగుల గుంపు పెదబుడ్డిడి, అంకవరం, కుదమ, గిజబ, బాసంగి, వెంకటరాజపురం నుంచి కొమరాడ మండలం గుణానుపురం, అర్తాం తదితర గ్రామాల మీదుగా ఒడిశా రాష్ట్రంలో కొద్ది రోజుల కిందట ప్రవేశించాయి. తిరుగు పయనంలో మండలంలో ఈ నెల 4న ఏడు ఏనుగులు వెంకటరాజపురంలో తిష్ట వేశాయి. వీటిలో ఒక ఏనుగు అర్తాం వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందింది. ఈ క్రమంలో అటవీ శాఖ సిబ్బంది తేనెటీగల శబ్దాన్ని అనుకరించి వచ్చిన తోవనే వెళ్లేటట్టు ఏర్పాటు చేశారు. చింతలబెలగాం, గవరమ్మపేట, పరజపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో సంచరిస్తూ వచ్చిన తోవనే వెళ్తున్నాయి. శుక్రవారం సాయంత్రానికి కుదమ మీదుగా చినబుడ్డిడి, అంకవరం నుంచి గడసింగుపురం వద్ద తిష్టవేశాయి. శుక్రవారం రాత్రికి వచ్చిన మార్గంలోనే ఏనుగులగూడ, గడసింగుపురం గ్రామాల మీదుగా జిల్లా వీడి వెళ్లే అవకాశం ఉందని అటవీ శాఖాధికారులు పేర్కొన్నారు. ఏ మార్గంలో వచ్చాయో అదే మార్గంలో వెనక్కి పంపేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిపారు. -
వచ్చిన దారినే...
విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామ పొలిమేరలో ఆదివారం ఉదయం నుంచి ఏనుగులు తిష్ట వేశాయి. సాయంత్రం ఐదు గంటల వరకు గుమ్మడిగెడ్డ వాగులో తిష్ట వేసిన ఏనుగులు బయటకు రాగానే వాటిని తేనేటీగల శబ్ధంలా అనుకరణ చేసి వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లేందుకు అటవీ శాఖాధికారులు ప్రయత్నించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వెంకటరాజపురం గ్రామంలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా అటవీ శాఖాధికారి గొంప లక్ష్మణ్, కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ సిబ్బందిని అప్రమత్తం చేసి చాకచక్యంగా గ్రామంలోకి రాకుండా అరటి తోటలోకి వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు పొలాల్లోకి వెళ్లడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. తేనేటీగల అనుకరణ శబ్ధం కురుపాం ఫారెస్ట్ మొదటిది రాహుల్ పాండే (సీసీఎఫ్) విశాఖపట్నం వారి సూచనల మేరకు ఆదివారం కురుపాం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న వెంకటరాజపురంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపుపై తేనెటీగల శబ్ధాన్ని అనుకరణ మొదటిగా ప్రవేశపెట్టి సఫలీకృతం అయినట్లు కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ తెలిపారు.రాష్ట్రంలోనే మొదటగా తేనెటీగల శబ్ధాన్ని అనుకరించినట్లు తెలిపారు. దీని వల్ల ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా ఏనుగులు వచ్చే దారినే వెళ్లడానికి వీలు కలిగిందని తెలిపారు. గుమ్మిడిగెడ్డ వాగు నుంచి బయటకు వచ్చిన వెంటనే తేనెటీగల శాబ్ధాన్ని అనుకరించడంతో తొలుత ఎలా వచ్చాయో అదేదారిన వెళ్లినట్టు మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఏనుగులు గతంలో వచ్చిన బాసంగి, గిజబ తదితర గ్రామాల మీదుగా వెళ్తున్నట్టు తెలిపారు. నష్టం జరిగినా ఆదుకుంటాం ఏనుగుల గుంపుతో పంటలకు ఎటువంటి నష్టం జరిగినా రైతులకు నష్టపరిహారం అందిస్తామని జిల్లా అటవీ శాఖాధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. ప్రజలు రాత్రి సమయాలలో ఏనుగులు సంచరించే ప్రాంతాలలో తిరగరాదని సూచించారు. కార్యక్రమంలో కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ, పార్వతీపురం అటవీ సిబ్బంది అప్పారావు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం అటవీసిబ్బంది పాల్గొన్నారు. వెనక్కి వెళ్లిన గజరాజులు కొమరాడ: కొద్ది నెలల కిందట నాగావళి నది దాటి గుణానపురంలోకి వచ్చిన ఏనుగుల గుంపు మండలంలో పలు చోట్ల తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ వచ్చాయి. వీటి రాకతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ రాత్రివేళ సంచరించడం మానుకున్నారు. శనివారం రాత్రి నాగావళి నది దాటి జియ్యమ్మవలస మండలం వెంకటాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాయి. దీంతో కొమరాడ మండల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన ఏనుగుల గుంపు ఏ మార్గంలో వచ్చాయో...అదే మార్గంలో వెనక్కి వెళ్లాయి. వెళ్లే క్రమంలో నాగావళి నది దాటి నిమ్మలపాడు గ్రామంలో వరి పంటను ధ్వంసం చేశాయి. దీంతో స్పందించిన రెవెన్యూ శాఖ పంట నష్టం అంచనా వేసేందుకు సిద్ధమైంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేస్తామని అధికారులు తెలిపారు. -
ఏనుగులను కవ్వించొద్దు
శ్రీకాకుళం, కొత్తూరు: పొలాల్లోకి వస్తున్న ఏనుగుల గుంపుపై ప్రజలు కవ్వింపు చర్యలకు పాల్పడొద్దని పాతపట్నం రేంజర్ సోమశేఖర్ తెలిపారు. నాలుగు ఏనుగులు గుంపు శుక్రవారం రాత్రి మండలంలోని దాశరధీపురం, కాశీపురం మధ్య కొండ ప్రాంతంలో తిష్ట వేశాయి. ఇవి వరి పొలాల్లోకి వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఏనుగుల గుంపు కదలికలపై కేర్ టేకర్స్ నిఘా పెడుతున్నారని తెలిపారు. కొండపై నుంచి కిందకు దిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈయనతోపాటు స్థానిక అటవీశాఖ అధికారి తిరుపతిరావు, సిబ్బంది ఉన్నారు. -
ఏనుగుల పల్లెబాట
శేషాచలం అడవుల్లో ఆహారం,నీటి సమస్య ఎదురవడంతో22 ఏనుగులు పల్లెబాట పట్టాయి.అటవీ సమీప పంట పొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. అరటి, వరి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల నివారణ కోసం అటవీ శాఖాధికారులు ఎంచుకున్న తాత్కాలిక చర్యలు కంటి తుడుపుగా మారాయి. పంటలు కోల్పోతున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వైఎస్ఆర్ జిల్లా, రాజంపేట: తిరుపతి ఫారెస్టు డివిజన్ పరిధిలోని ఏనుగుల మంద రాజంపేట ఫారెస్టు డివిజన్లోని రోళ్లమడుగు ప్రాంతం వైపుగా అడుగులు వేశాయి. తోటలు, పంటలపై దాడులుకు దిగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.ప్రతి ఏడాది వేసవిలో నీరు , ఆహారం కోసం శేషాచల అటవీ ప్రాంతంలోని శివారుగ్రామాల్లో సంచరిస్తూ పంటలను తొక్కి నాశనం చేస్తున్నాయి. అటవీశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగుల దాడులిలా.. ♦ 2017 మే నెలలో కుక్కలదొడ్డి, ఎస్‌కొత్తపల్లె, శెట్టిగుంట, కె.బుడుగంటపల్లె, దేశెట్టిపల్లె, లక్ష్మీపురం, వీపీఆర్ కండ్రిక ప్రాంతాల్లో మామిడితోటలు, మోటార్లు, పైపులను నాశనం చేశాయి. గత వారంలో ఎస్‌కొత్తపల్లెకు చెందిన నాగేంద్ర అనే రైతు ఏనుగుల దాడిలో గాయపడిన సంగతి విధితమే. ♦ రాజంపేట రేంజ్ పరిధిలోని రోళ్లమడుగులో 15 ఏళ్ల క్రితం సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అది పనిచేయడంలేదని రైతులు చెబుతున్నారు. ♦ 2018 సెప్టెంబరు నెలలో రోళ్లమడుగు అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న అరటితోటలు, వరిపంటలతోపాటు పైపులైన్లను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. గ్రామస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేశాయి. మేత,నీరు లేక.. శేషాచలం అటవీ ప్రాంతం రాజంపేట, తిరుపతి డివిజన్ పరిధిలో విస్తరించి ఉంది. ఏనుగుల గుంపు చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. అడవిలో మేత, నీరు లేకపోవడంతో దాహార్తి తీర్చుకోవడానికి రాత్రి సమయంలో ఈ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. నష్టపరిహారమేది..! ఏనుగుల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు అటవీశాఖ వద్ద బడ్జెట్ ఉందని అధికారులు చెపుతున్నారు. అయితే చెల్లింపులో జాప్యం కొనసాగుతోందనే విమర్శలు బాధితరైతుల నుంచి వినిపిస్తోంది. నష్టాన్ని సక్రమంగా అంచనా వేయకపోవడంతో రైతులు అపారంగా నష్టపోతున్నారు.ఏనుగుల దాడుల నివారణకు అటవీశాఖ శాశ్వత చర్యలు తీసుకోలేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని, పంటలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. అడవిలోకి వెళ్లొద్దని హుకుం ఏనుగుల గుంపు దిన్నెల, రోళ్ల మడుగు ప్రాంతంలోని అటవీ గ్రామాల పరిధిలో పంటపొలాలపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవి గ్రామాల్లోకి రాకుండా రాజంపేట డివిజన్ అటవీశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. 30మంది సిబ్బందిని నియమించి తప్పట్ల చప్పుడు, బాణసంచా కాలుస్తూ దట్టమైన అటవీ ప్రాంతంలోకి గజరాజులను తరలిస్తున్నారు.ఇప్పుడు దిన్నెలలో ఏడు, శేషాచలం ప్రాంతంలో 15 ఏనుగులు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. గ్రామస్తులను అడవిలోకి వెళ్లవద్దని హుకుం జారీచేశారు. పంట నష్టం జరిగితే ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని హితువు పలుకుతున్నారు. సోలార్ ఫెన్సింగ్ పునరుద్ధరణకు చర్యలు రాజంపేట రేంజ్ పరిధిలోని అటవీ గ్రామమైన రోళ్లమడుగు శివారులో సోలార్ ఫెన్సింగ్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాం. గతంలో కూడా ఫెన్సింగ్ ఉండేది. అయితే కందకాలు తీసేందుకు వీలు లేని పరిస్థితులు ఉన్నాయి. రెండురోజుల కిందట ఏనుగుల దాడుల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఉద్యానవన, వ్యవసాయశాఖ నుంచి నివేదికలు అందిన తర్వాత రైతులకు పరిహారం చెల్లిస్తాం. –ఖాదర్‌వల్లి, డీఎఫ్ఓ, రాజంపేట ఫారెస్టు డివిజన్ -
జనారణ్యంలోకి గజరాజులు
విజయనగరం, కొమరాడ(కురుపాం): మండలంలోని గుణానపురం గ్రామానికి చేరువలో ఆరు పెద్ద ఏనుగులు, రెండు చిన్న ఏనుగులతో కూడిన గుంపు ఒకటి గురువారం వచ్చింది. గిజబ నుంచి తోటపల్లి రిజర్వాయర్‌లో దిగి ఈదుకుంటూ అవి చెరకు తోటలోకి చేరుకోవడంతో గుణానుపురం, పరశురాంపురం ప్రజలు భయాందోళన చెందుతున్నా రు. వాటిని బయటకు పంపించేందుకు అధికారులు రెండు రోజులుగా కుస్తీ పడుతున్నా ఫలితం లేకపోయింది. ఈ ఏనుగుల గుంపు చెరకును తిన్నంత తిని మిగతాది తొక్కుతూ వరి పొలా లను తొక్కుతూ పంటలను నాశనం చేస్తూ నాగా వళి నదిలోకి వెళ్లి స్నానాలు చేస్తూ సేద తీర్చుకుంటున్నాయి. గురువారం ఉదయం నుండే డీఎఫ్ఓ జి.లక్ష్మణ్, పార్వతీపురం ఆర్డీఓ బి. సుదర్శనదొర, కొమరాడ తహసీల్దార్ రాజ్‌కుమారి, ఎస్ఐ రాజేష్, అటవీశాఖాధికారులు, పోలీసులు, సాయంత్రం 4 గంటల నుంచి శబ్దాలు చేస్తూ వాటిని తరలించడానికి ప్రయత్నం చేస్తున్నా వాటి ని అసలు అవి పట్టించుకోవడం లేదు. ప్రజలకు హెచ్చరికలు ఏనుగులకు కనీసం కిలోమీటరు దూరం వరకూ ఎవరూ వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి దూరంగా ఉండాలని మైక్‌లో హెచ్చరికలు జారీచేస్తున్నారు. అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏనుగులను తరలించకపోవడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. తమ పంటలు నాశనం అవుతున్నాయని లబోదిబోమంటున్నారు. భయాందోళనలో ప్రజలు... గ్రామాల్లోకి ఏనుగులు చేరుకోవడంతో పంటలను నాశనం చేయడమే గాకుండా రైతులు, ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన ఎవరిపై దాడిచేస్తాయో, ఏ పంట పొలాలను తొక్కి పడేస్తాయోతెలియక ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఒకరిపై దాడి.. మండలంలోని అర్తాం గ్రామానికి చెందిన సత్యనారాయణ రాజుపై ఏనుగులు దాడిచేసి కుడికాలును తొండంతో కొట్టాయి. చెరకు తోటలో ఉన్న ఏనుగులను చూసేందుకు వెళ్లిన సత్యనారాయణ రాజుపై చేసిన దాడివల్ల కాలికి గాయమైంది. ఆయన్ను కుటుంబ సభ్యులు పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
ఏనుగులను రెచ్చగొట్టొద్దు
వీరఘట్టం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న గజరాజులు శుక్రవారం వీరఘట్టం మండలం దశుమంతపురం సమీపంలోని ఉత్తరావల్లి చంద్రశేఖర్‌కు చెందిన చెరకు తోటలో తిష్ఠవేశాయి. అయితే ఈ ఏనుగులను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన దశుమంతపురం, పెదబుడ్డిడి గ్రామాల ప్రజల్లో కొందరు రాళ్లు విసురుతూ కేకలు వేయడంతో వీరి తీరుపై అటవీశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగులను రెచ్చగొట్ట వద్దని పాలకొండ రేంజర్ జగదీష్ వారిని హెచ్చరించారు. గజరాజులను అడవుల్లోకి తరలించాలంటే ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని సూచించారు. ప్రస్తుతం ఏనుగులు ప్రశాంతంగా ఉన్నాయని, వాటిని కవ్వించే విధంగా ప్రవర్తించవద్దని కోరారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డీఎఫ్ఓలు శాంతిస్వరూప్, లక్ష్మణరావు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఏనుగుల సంచారాన్ని గమనించాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎఫ్ఆర్ఓ లు ప్రహ్లాద, రాంబాబు, విఠల్‌కుమార్ ఉన్నారు. అనుకూలంగా ఉన్న పరిసరాలు వీరఘట్టం మండలంలోని దశుమంతపురం పరిసరాలు అనుకూలంగా ఉండడంతో గజరాజుల గుంపు ఈ ప్రాంతంలో తిష్ఠవేశాయి. చుట్టూ అరటి, చెరుకు తోటలు, మధ్యలో నాగావళి, వట్టిగెడ్డల నీరు పుష్కలంగా ఉండడంతో ఏనుగులు ఇ క్కడ తిష్ఠ వేసినట్లు అధి కారులు చెబుతున్నారు. వీటిని అడవుల్లోకి తరలించేందుకు ముమ్మర ప్ర యత్నాలు చేస్తున్నామని రేంజర్ జగదీష్ తెలిపారు. ప్రస్తుతం గజరాజులు చినబుడ్డిడి–డంగభద్ర తోటల్లో సంచరిస్తున్నాయని వెల్లడించారు. -
గడప దాటనివ్వని గజరాజులు
శ్రీకాకుళం,వీరఘట్టం: వీరఘట్టం మండలంలో ఏనుగుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి ఇల్లీసుపురం కొండల్లో ఉన్న 8 ఏనుగులు మంగళవారం తెల్లవారేసరికి ఎం.రాజపురం సమీపంలోని చెరుకుపంటలో చొరబడ్డాయి. వి.జగన్నాంనాయుడు, బురిడి కాశింనాయుడికి చెందిన 5 ఎకరాల చెరుకు పంటను ధ్వంసం చేశాయి. గణపతి, రాగోలు అప్పలనాయుడు, జంపు పోతయ్య, దుర్గారావు, కృష్ణ, రౌతు అప్పలనాయుడులకు చెందిన వరి పంటలను పాక్షికంగా నాశనం చేశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎం.రాజపురం శివారు ప్రాంత పొలాల్లో ఉన్న ఏనుగులను అటవీశాఖ అధికారులు చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. పాలకొండ రేంజర్ డి.జగదీష్ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మందుగుండు సామగ్రి పేల్చడంతో ఏనుగుల గుంపు ఎం.రాజపురం–వీరఘట్టం పంట పొలాల మీదుగా అచ్చెపువలస సమీపంలోని ఎలుగులమెట్టకు చేరుకుని కొండపై తిష్ఠ వేశాయి. ఈ కొండకు అచ్చెపువలస సమీపంలో ఉండడంతో అటవీశాఖ అధికారులు మందుగుండు సామగ్రి అధికంగా పేల్చారు. సాయంత్రం వరకు అచ్చెపువలస కొండపై ఉన్న ఏనుగులు దిశ ఏవిధంగా ఉంటుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆందోళలనలో రైతన్నలు.. ఈ ఏడాది ఖరీఫ్‌ను ముందస్తుగా ప్రారంభించిన రైతులు 20 రోజుల కిందటే ఉభాలు పూర్తి చేశారు. ప్రస్తుతం వరి పంట తొలి దశలో ఉంది. హుస్సేనుపురం, కత్తులకవిటి పంచాయతీల్లో సుమారు 5 ఎకరాల్లో వరిపంట, మరో 5 ఎకరాల్లో చెరుకు పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంట ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేయాల్సి ఉందని,పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. అచ్చెపువలస సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలుసుకున్న వీరఘట్టం ప్రజలు పెద్ద ఎత్తున అచ్చెపువలస చేరుకోవడంతో వీరిని అదుపుచేసేందుకు అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పడ్డారు. పోడు వ్యవసాయానికి దెబ్బ ఏనుగులు కొండ ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో గిరిజనులు పోడు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కుంబిడి, గంగమ్మపేట, అచ్చెపువలస, నీలంపేట, గదబవలస, ఇల్లీసుపురం, సందిమానుగూడ, రామాపురం గిరిజనులు గడపదాటేందుకు భయాందోళన చెందుతున్నారు. పరిస్థితులు అనుకూలంగా లేవు... ఏనుగులను దోనుబాయి అటవీ ప్రాంతంలోకి తరలిస్తే కొంతవరకు సమస్య సద్దుమణుగుతుందని రేంజర్ జగదీష్ అన్నారు. ప్రస్తుతం పంటలు ఉండడంతో ఏనుగులను తరలించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పారు. తొందరపడితే పంటలు పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆయనతో పాటు వీరఘట్టం, పాలకొండ ఎఫ్‌ఎస్‌ఓలు విఠల్‌కుమార్, ప్రహ్లాద, టాస్క్‌ఫోర్స్ ఎఫ్ఎస్ఓ రాంబాబు, వైర్లెస్ ఎఫ్ఎస్ఓ సాయిరాం మహాపాత్రో, గార్డులు, బీట్ ఆఫీసర్లు, ట్రాకర్లుపాల్గొన్నారు. -
ఏనుగుల బీభత్సం
పలమనేరు : గంగవరం మండలంలోని కీలపట్ల, కొత్తపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతుల వ్యవసాయ బోర్లు, స్టార్టర్లు, డ్రిప్ పరికరాలు, పంటలను ఆదివారం రాత్రి ఏనుగులు తొక్కి నాశనం చేశాయి. కీలపట్ల, కొత్తపల్లి గ్రామాల సమీపంలోని అడవిలోంచి మూడు ఏనుగులు పంటలపై పడ్డాయి. గోవిందప్ప, రాధమ్మ, రాజేంద్రకు చెందిన బోరు మోటారు, పైపులు, స్టార్టర్లను ధ్వంసం చేశాయి. రాజేంద్ర, వెంకటరమణారెడ్డికి చెందిన చెరుకు, టమాట, బీన్సు, వరినారు తొక్కేశాయి. ఏనుగుల దాడులతో మూడు లక్షలు రూపాయల దాకా నష్టం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు. ట్రెంచ్ లేని దారిలోనే .... ఏనుగులు అడవిని దాటకుండా అధికారులు ట్రెంచ్‌లను తవ్వించారు. కానీ కేసీపెంట వద్ద కొందరు రైతులు ట్రెంచ్ నిర్మాణాలను అడ్డుకున్నారు. ఫలితంగా కొంతమేర ఈ పనులు ఆగాయి. అదే చోటు నుంచి మూడు రోజులుగా ఏనుగులు పొలాల్లోకి వస్తున్నట్టు రైతులు చెబుతున్నారు. అటవీ శాఖ సిబ్బంది, వీఆర్వోలు పంటలను పరిశీలించి నష్టం అంచనాలను తయారు చేశారు. త్వరగా ట్రెంచ్ పనులను పూర్తిచేసి ఏనుగుల బెడద నుంచి పంటలు కాపాడాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఒంటరి ఏనుగు దాడి పెద్దపంజాణి: మండలంలోని కొలత్తూరు పం చాయతీ మద్దలకుంట గ్రామ సమీపంలోని పంట పొలాలపై ఒంటరి ఏనుగు ఆదివారం రాత్రి దాడి చేసింది. రాయలపేటకు చెందిన రెడ్డెప్ప మామిడి, టమాట పంటలకు స్వల్పంగా నష్టం చేకూర్చింది. మద్దలకుంట గ్రామానికి చెందిన గంగులప్పకు సంబంధించిన నారుమడిని తొక్కి నాశనం చేసింది. బాధిత రైతుల సమాచారంతో ఫారెస్టు బీట్ ఆఫీసర్ దొరస్వామి, వీఆర్ఓ సుబ్రమణ్యం ఆచారి సోమవారం పొలాలను పరిశీలీంచారు. ఏనుగు కోగిలేరు అటవీ ప్రాంతం నుంచి వచ్చి మద్దలకుంట, నాగిరెడ్డిపల్లి మీదుగా తూర్పు అడవిలోకి వెళ్లిందని అటవీ అధికారులు తెలిపారు. -
ఆపరేషన్ గజేంద్రలో మరో అపశ్రుతి
మెళియాపుట్టి : మెళియాపుట్టి మండలంలో ఏనుగుల తిష్ఠ వేయడంతో గిరిజనులు భయాందోళన చెందుతున్నారు. నందవ, పరశురాంపురం ప్రాంతానికి చేరిన ఏనుగుల గుంపు రెండు రోజుల్లో ఇద్దరి ప్రాణాలు బలిగొన్నాయి. ఈ నెల 14న హీరాపురం వద్ద జీడితోటలో పిక్కలు ఏరుతున్న వృద్ధురాలు మెళియాపుట్టి నీలమ్మను ఏనుగులు తొక్కి చంపగా, ఆదివారం పెద్దమడి కాలనీకి చెందిన సవర రామారావు(45)ను ఏనుగులు హతమార్చాయి. రామారావు జీడితోటల వైపు పశువులను మేత కోసం తీసుకొని వెళ్లగా జీడితోటల్లో తిష్ఠవేసి ఉన్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపాయి. కుటుంబీకులు గత రెండు రోజులుగా రామారావు కోసం గాలింపు చేపట్టిన గుర్తించ లేకపోయారు. మంగళవారం శవం కుళ్లిన వాసన రావడంతో స్థానికులు తోటల్లోకి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. వరుసగా ఇద్దరు గిరిజనులు మృత్యువాత పడడంతో స్థానికులు భయాందోళ చెందుతున్నారు. ఆపరేషన్ గజేంద్ర తమ ప్రాణాలపైకి వచ్చిందని మండిపడుతున్నారు. రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాత పడడంతో ఏం చేయాలో అర్థకాక అటవీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. కాగా సంఘటనా స్థలాన్ని జిల్లా అటవీశాఖ అధికారి శాంతి స్వరూప్, ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, పోలీస్, రెవెన్యూ, ఇతర అధికారులు సందర్శించారు. రామారావు మృతదేహం కుళ్లిపోవడంతో వైద్యుడ్ని రప్పించి సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ‘సంఘటన దురదృష్ఠకరం’ ఏనుగుల దాడిలో మరో వ్యక్తి చనిపోవడం దురదృష్టకరమని డీఎఫ్ఓ శాంతి స్వరూప్ అన్నారు. సంఘటన స్థలంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అందవలసిన సహాయాన్ని అందిస్తామన్నారు. ఏనుగుల గుంపును ఒడిశా అడవుల్లోకి పంపించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. గిరిజనుల ఆందోళన ఏనుగులను ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించేందుకు సాగుతున్న ఆపరేషన్ గజేంద్రకు అంతరాయం కలుగుతోంది. గిరిజనులు మృత్యువాత పడుతుండడంతో వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెద్దమడి కాలనీ చెందిన సవర రామారావు మృతి చెండంతో గిరిజన సంఘ జేఏసీ నాయకులు వాబ యోగి, సీహెచ్ శాంతారావు, ఎండయ్య, దుర్యోధన ఆధ్వర్యంలో గిరిజనులు గ్రామ మెయిన్ రోడ్డుపై మంగళవారం రాత్రి ధర్నాకు దిగారు. దీంతో రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. ఈ సందర్భంగా జేఏసీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆపరేషన్ గజేంద్ర పేరుతో హత్యా కాండ చేస్తోందని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, డీఎఫ్‌ఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గిరిజనులు చేపట్టిన ధర్నా స్థలానికి ఎస్ఐ రాజేస్, సిబ్బంది చేరుకొని గిరిజనులను శాంతింప చేశారు. -
గజగజ..!
10.3.2018 టొంపటగూడ కుమార్ పాతపట్నం నియోజకవర్గంలోని కొత్తూరు మండలం రాయల పంచాయతీ పరిధి టింపటగూడ గిరిజన గ్రామానికి చెందిన యువకుడు. సమీపంలోని పొన్నుటూరు వద్ద చెరకు తోటలోకి వెళ్లిన అతనిపై ఏనుగులు దాడిచేసి చంపేశాయి. 14.4.2018 పాతపట్నం నియోజకవర్గంలోనే మెళియాపుట్టి మండలంలో హీరాపురం గ్రామానికి చెందిన ఎం నీలమ్మ అనే గిరిజన వృద్ధురాలు ఎప్పటిలాగే జీడితోటలోకి వెళ్లింది. ఏనుగులు ఆమెపై దాడిచేసి ప్రాణాలు తీశాయి. 15.4.2018 మెళియాపుట్టి మండలంలోనే పెద్దమడి గ్రామానికి చెందిన సవర రామారావు (47) ఎప్పటిలాగే జీడితోటలోకి పశువులను మేతకు తోలుకెళ్లాడు. అక్కడే ఉన్న ఏనుగుల గుంపు అతన్ని తొక్కి చంపేశాయి. రెండ్రోజుల తర్వాత మంగళవారం అతని మృతదేహం బయటపడింది. సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : ఈ ముగ్గురి ప్రాణాలు తీసినవీ ఒడిశా ఏనుగులే. ఒక గున్న ఏనుగు సహా మొత్తం ఎనిమిది ఏనుగులు గత రెండు నెలలుగా జిల్లాలో వీరవిహారం చేస్తున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటనే కాదు ప్రాణాలనూ బలిగొంటున్నాయి. ఏ నిమిషంలో ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని సరిహద్దు ప్రాంతంలోని రైతులు, గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ప్రమాదకరంగా మారిన ఈ ఏనుగులను ఒడిశా దారి పట్టించడానికి గత నెల 27వ తేదీన ప్రారంభించిన ఆపరేషన్ గజేంద్ర తొలుత కొంతవరకూ సత్ఫలితాలను ఇచ్చింది. అయితే రెండు వారాలుగా ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారడంతో ఆ ఆపరేషన్ కాస్తఆలస్యమవుతోంది. సరిహద్దుకు సమీపంలోనే... ప్రస్తుతం ఒడిశా–ఆంధ్రా సరిహద్దు మండలమైన మెళియాపుట్టిలో రెండు వారాలుగా ఎనిమిది ఏనుగులు తిష్టవేశాయి. వాటిలో ఒకటి గున్న ఏనుగు. ఇది గాకుండా మిగిలిన ఏడు ఏనుగులు గత ఏడాది కాలంలో ఒడిశా నుంచి మన జిల్లాలోకి చొరబడటం, కొన్నాళ్ల తర్వాత మళ్లీ వెనక్కి వెళ్లిపోవడం చేస్తుండేవి. అయితే ఎండాకాలం ప్రారంభంలో పలాస, మందస ప్రాంతంలోకి మరోసారి చొరబడిన ఈ ఏనుగులతో గున్న ఏనుగు కూడా తోడయ్యింది. ఆహారం, నీరు వెతుక్కోవడంతో పాటు ఆ చిన్న ఏనుగును రక్షించుకోవడంపైనే మిగతా ఏడు ఏనుగులు దృష్టి పెడుతున్నాయి. గత నెలాఖరులో ఆహారం, నీరు వెతుక్కుంటూ వంశధార నదీ వెంబడి ఆమదాలవలస రూరల్ ప్రాంతంలోకి వచ్చేశాయి. వాటిని వెనక్కి మళ్లించేందుకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ గజేంద్ర పేరుతో చర్యలు చేపట్టారు. 50 మంది సుశిక్షిత సిబ్బందిని రంగంలోకి దించారు. అలాగే చిత్తూరు నుంచి గణేష్, జయంతి అనే కుకీ (శిక్షణ పొందిన) ఏనుగులను రప్పించారు. వాటి సహాయంతో ఒడిశా ఏనుగులను వెనక్కి మళ్లించడానికి చర్యలు చేపట్టారు. ఈ ప్రారంభంలో సజావుగానే సాగింది. మెళియాపుట్టి వెళ్లిన తర్వాత మొండికేశాయి. జీడితోటలు, అరటితోటలతో పాటు చెరువుల్లో నీరు ఉండటంతో అక్కడే తిష్టవేశాయి. ఆపరేషన్ గజకు సంబంధించిన చర్యలతో పాటు వాటిని చూడటానికి వచ్చే ప్రజల హడావుడి, స్థానికులు టపాసులు, బాంబులను పేల్చి హోరెత్తించడంతో ఆ ఏనుగుల ధోరణిలో మార్పు వచ్చింది. అత్యంత ప్రమాదకరంగా మారాయి. తామున్న తోటల్లో ఎవరు వచ్చినా దాడిచేసి ప్రాణాలు తీస్తున్నాయి. గత వారం రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆ విధంగానే బలయ్యారు. సరిహద్దులో గజగజ... మెళియాపుట్టి మండలంలో నుంచి ఏనుగులను ఒడిశా సరిహద్దు దాటించాలంటే దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరమే ఉంది. మధ్యలోనున్న నందలకొండపైకి వాటిని మళ్లించాలి. ఈ మార్గంలో భరణికోట, భరణికోట కాలనీ, జక్కరివీధి, బంజీరు వంటి ఆరేడు గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో జీడిమామిడి, అరటి తోటలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆహారం సమృద్ధిగా లభిస్తుండటంతో పగలంతా ఆ తోటల్లోనే ఏనుగులు ఉండిపోతున్నాయి. సాయంత్రం పూట కాస్త అక్కడి నుంచి కదిలినా ఆ సమయంలో కుకీ ఏనుగులు అక్కడికి వెళ్లే పరిస్థితి ఉండట్లేదని అటవీశాఖ సిబ్బంది చెబుతున్నారు. అయితే అవి మైదాన ప్రాంతం వైపు రాకుండా కుకీ ఏనుగులను అప్రమత్తం చేస్తున్నారు. ఒడిశా ఏనుగుల ధోరణి ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో బాణసంచా కాల్పులు కూడా ఆపేశారు. ప్రజలు ఏనుగులు ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఫలసాయం చేతికందే సమయంలో ఈ బెడద మొదలైందని, తాము తీవ్రంగా నష్టపోతున్నామని సరిహద్దులోని గిరిజనులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏనుగుల దాడిలో మృతులు... హిరమండలం మండలంలోని ఎగువ రుగడలో 2016 నవంబర్ 26వ తేదీన ఏనుగు దాడిలో పాతపట్నం మండలం సోద గ్రామానికి చెందిన కేసరి తవిటయ్య(70) ప్రాణాలు కోల్పోయాడు. 2007 డిసెంబరు 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావును, దోనుబాయ గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. 2007 డిసెంబరు 19వ తేదీన కుంబిడి నాగరాజు అనే వీరఘట్టానికి చెందిన విలేకరిని హుస్సేన్‌పురం వద్ద దారుణంగా చంపేశాయి. ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును, వీరఘట్టం మండలం చలివేంద్రి వద్ద కొండగొర్రె సాంబయ్యను కూడా ఇదే తరహాలో ఏనుగులు పొట్టనపెట్టుకున్నాయి. ఒడిశాకు తరలించే ప్రయత్నాలు... ఎనిమిది ఏనుగులను ఒడిశాలోని అటవీ ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేస్తున్నాం. వాటి ధోరణి ప్రమాదకరంగా మారింది. అవి ఉన్న తోటల్లోకి వెళ్లవద్దని ప్రజలకు హెచ్చరికలు చేస్తున్నాం. కానీ కొంతమంది సరిగా అర్థం చేసుకోలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. అటవీ శాఖ సిబ్బంది అంతా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. జనావాసాల్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – సీహెచ్ శాంతిస్వరూప్, జిల్లా అటవీశాఖాధికారి, శ్రీకాకుళం. -
ముందుకు సాగని ఆపరేషన్ గజ
పాతపట్నం: మండలంలోని పెద్దమల్లిపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఎనిమిది ఏనుగులు గురువారం సంచరించాయి. ఇక్కడే రెండు రోజులుగా తిష్ఠ వేయడంతో అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ ముందుకు సాగడం లేదు. దీంతో బయట నుంచి తీసుకొచ్చిన శిక్షణ పొందిన ఏనుగులతో అటవీ సిబ్బంది పెద్దమల్లిపురం గ్రామం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్, డీఎఫ్ఓ శాంతిస్వరూప్, పాతపట్నం రేంజర్ సోమశేఖర్లు ఏనుగులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళతాయనే సూచనలు చేస్తూ మ్యాప్‌లను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడి ఎటువంటి బాణసంచా కాల్చవద్దని సూచించారు. బుధవారం, గురువారం కూడా ఏనుగులు ఒకే ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలి పారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దగుజ్జువాడలో పంటలు నాశనం సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ గ్రామం పరిధిలోని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పలువురి రైతులకు చెందిన చోడి, వేరుశనగ, నువ్వు, ఆనపకాయల పంటలను బుధవారం రాత్రి నాశనం చేశాయి. గత ఐదు రోజుల నుంచి మండలంలోని రిజర్వ్ ఫారెస్టు ఏరియాలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు రాత్రి పూట గ్రామాల సమీపంలో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ గజ’లో భాగంగా శిక్షణ పొందిన ఏనుగులతో ఈ అడవి ఏనుగుల గుంపును రిజర్వ్ ఫారెస్టు ఏరియాలోకి అటవీశాఖ అధికారులు పంపిస్తున్నా రాత్రి పూట తిరిగి అవి గ్రామాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు చేరి పంటలను తినేసి ధ్వంసం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా బుధవారం రాత్రి పెద్దగుజ్జువాడ గ్రామానికి సమీపంలోని గొర్లె రుద్రుడు, గొర్లె జయడు, ఉర్లాన సింహాచలం, మల్లేషు, వసంత, సుందరరావు, శశిలకు చెందిన చోడి, వేరుశనగ, ఆనపకాయలు, నువ్వు పంటలను పాడుచేశాయి. ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపు మల్లిపురం కొండలలో ఉన్నట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు. -
కనికరించట్లేదు
సీతంపేట/కొత్తూరు: ఏనుగుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మాత్రం కనికరించట్లేదు. ఐటీడీఏ సబ్‌ప్లాన్ పరిధిలో వివిధ మండలాల్లో సంచరించి ప్రాణ, ఆస్తినష్టానికి పాల్పడుతున్న ఏనుగులను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తూరు మండలలోని టింపటగూడకు చెందిన కుమార్(20)పై చెరుకు తోటలో ఏనుగులు దాడి చేసి ప్రాణం తీసిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒడిశా లఖేరీ అడవుల నుంచి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల సరిహద్దులో ఏనుగుల గుంపు ప్రవేశించి పదకొండేళ్లలో 15 మందిని పొట్టనపెట్టుకున్నాయి. దీంతో గిరిజన ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జరిగిన మొదటి పాలకవర్గ సమావేశంలో.. ఏనుగులను ఒడిశాకు తరలిస్తామని చెప్పినా అది మాటలకే పరిమితమైంది. జిల్లాలో వరుస సంఘటనలు ఇలా.. 2007 డిసెంబర్ 14న సీతంపేట మండలం చినబగ్గకు చెందిన పసుపురెడ్డి అప్పారావుతో పాటు దోనుబాయ గ్రామానికి చెందిన సిరిపోతుల మేరమ్మను కోదుల వీరఘట్టం వద్ద ఏనుగులు మట్టుపెట్టాయి. అదే నెల 19న వీరఘట్టానికి చెందిన పాత్రికేయుడు కుంబిడి నాగరాజును హుస్సేన్‌పురం వద్ద హతమార్చాయి. 21న ఇదే మండలం సంతనర్సిపురం వద్ద తెంటు శ్రీనివాసరావును, 2008 జనవరి 1న కొండగొర్రె సాంబయ్యను విచక్షణారహితంగా చెట్లకు విసిరికొట్టి హతమార్చాయి. అనంతరం 2016 సంవత్సరం హిరమండలం మండలం పాడలి గ్రామానికి చెందిన శాశుబిల్లి మురళి(25 పై దాడి చేసి ప్రాణాలు తీశాయి. 2017 సంవత్సరం హిరమండలం ఎగురు రుగడ గ్రామానికి కీసరతవిటయ్యపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేసింది. ఇలా దశాబ్దంలో 15 మందిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ దాడుల్లో మృతి చెందిన వారికి అరకొర పరిహారంతో ప్రభుత్వం సరిపెట్టింది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ కొలువు ఇప్పిస్తామని అప్పట్లో నేతలు చెప్పినా అవి అమలుకు నోచుకోలేదు. దీంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భారీగా పంటలకు నష్టం వేసవి తాపానికి తట్టుకోలేక తాగునీరు, ఆహారం కోసం ఏనుగులు వరి, చెరకు, అరటి, కంది, మామిడి, జీడి, పనస వంటి పంట పొలాలను, తోటలను ధ్వంసం చేస్తున్నాయి. మరికొన్ని సంఘటనల్లో గిరిజనులు వేసుకున్న పాకలను కూడా పీకిపారేశాయి. పూరిళ్లను పడదోశాయి. 2 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను నాశనంచేశాయి. సుమారు రూ.36 లక్షల పరిహారం చెల్లించారు. ఇంకా రూ.30 లక్షల వరకు పరిహారం చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎటువంటి పరిహారం లేకపోవడం గమనార్హం. ఫలితమివ్వని ఆపరేషన్ గజ 2007 అక్టోబర్‌లో ఏనుగుల గుంపును తరలించేందుకు అప్పటి అటవీశాఖ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ శత్రుచర్ల విజయరామరాజు తీసుకున్న నిర్ణయం మేరకు ‘ఆపరేషన్ గజ’ చేపట్టారు. చిత్తూరు, బెంగుళూరుకు సంబంధించిన తర్ఫీదు పొందిన మావటిలతోపాటు జయంతి, గణేష్ అనే శిక్షణ పొందిన ఏనుగులను రంగంలోకి దించారు. ఆశించినంతగా ఫలితం ఇవ్వకపోయినా రెండు ఏనుగులను అదుపులోకి తీసుకుని ప్రత్యేక వాహనాలతో ఒడిశా అడవుల్లోకి పంపించే ప్రయత్నం చేశారు. ఇందులో ఒకటి మార్గమధ్యంలోనే మృతిచెందింది. అనంతరం వివిధ కారణాలతో 11 ఏనుగుల్లో ఏడు మృతి చెందగా నాలుగు మిగిలాయి. అటవీశాఖాధికారుల సూచనల మేరకు ప్రత్యేక నిఘా బృందాలు, రూట్ ట్రాకర్లను ఏర్పాటుచేయడంతో ప్రమాద హెచ్చరిక బోర్డులు, సోలార్ లైట్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఎలిఫేంట్ జోన్‌గా గుర్తించాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. గిరిజనులు దీనిని వ్యతిరేకించడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోక తప్పలేదు. ఇదే క్రమంలో కందకాలు తవ్వే ఏర్పాట్లను చేపట్టినా ఫలితం ఇవ్వలేదు. ఆందోళనలో గ్రామస్తులు పది రోజుల నుంచి పొన్నుటూరు పంట పొలాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు ఎప్పు డు దాడి చేస్తుందోనని పొన్నుటూరు, బంకితో పాటు పలు గిరిజన గ్రామాల ప్రజ లు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో గ్రామాల్లోకి చొరబడతాయేమోననే భయం వీరిని వెంటాడుతోంది. ఒడిశా నుంచి వచ్చిన ఏనుగుల గుంపును అధికారులు తరలించకపోవడం, ఈ సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో కుమార్ మృతిచెందాడని గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. -
ప్రాణాలపైకొచ్చిన సరదా
కొత్తూరు: మండలంలోని పొన్నుటూరు పరిసరాల్లో గత 10 రోజులుగా ఏనుగుల గుంపు చెరుకు, అరటి తోటల్లో తిష్ఠవేశాయి. వీటిని చూసేందుకు సమీపంలో ఉన్న పలు గ్రామాలకు చెందిన ప్రజలు రోజూ వస్తున్నారు. అయితే రాయల పంచాయతీ పరిధి టింపటగూడ, అంజలిగూడకు చెందిన ఇద్దరు గిరిజనులు ఏనుగులను చూసేందుకు శనివారం రాత్రి వెళ్లినట్టు సమాచారం. ఈ సమయంలో చెరుకు తోటల్లో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా భయంకరంగా ఘీంకారం చేశాయి. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఏనుగులను చూసేందుకు వెళ్లిన వారిపై దాడిచేశాయని అనుమానిస్తున్నారు. ఇంతలో ఏనుగులను చూసేందుకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువకుల్లో ఒకరు చెరుకు తోటల్లోనుంచి తిరిగి బయటకు వచ్చినట్టు తెలిసింది. మరో వ్యక్తి రాకపోవడంతో ఆ యువకుడిపై ఏనుగులు దాడిచేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏనుగుల ఘీంకారాలను విన్న పొన్నుటూరు, బంకి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. వీరితో పాటు అప్పటికే అక్కడ కాపలా ఉన్న అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. టింపగూడకు చెందిన గిరిజనులు పొన్నుటూరు చేరుకున్నారు. ఎక్కువ మంది చేరడంతో గందరగోళం నెలకొంది. వీరిని అక్కడ నుంచి అటవీ సిబ్బంది పంపించారు. అయితే ఏనుగుల దాడిలో టింపగూడకు చెందిన యువకుడు మృతిచెంది ఉంటాడని సంఘటనా స్థలం వద్దకు చేరుకొన్నవారు అనుమానిస్తున్నారు. ఏనుగులు ఉన్న చోటకు వెళ్లేందుకు అటవీ సిబ్బంది, ప్రజలు భయపడుతున్నారు. ఆచూకీలేని యువకుడి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఆ యువకుడి బంధువులు తెలిపారు. అటవీశాఖ రేంజర్ వివరాల సేకరణ ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి చెందాడన్న అనుమానాలు గుప్పుమనడంతో పాతపట్నం అటవీశాఖ రేంజర్ సోమశేఖర్ సంఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడా, లేదా అనేది ఇప్పుడు గుర్తించలేమని స్పష్టం చేశారు. రాత్రి కావడంతో చెరుకు తోటల్లో ఏనుగుల గుంపు ఉన్నందున చెరుకు తోటల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. తెల్లవారితే తప్ప ఏమి జరిగిందని చెప్పలేమని ఆయన తెలిపారు. ఆయనతోపాటు అటవీశాఖ అధికారి రామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు. -
పంట పొలాలపై గజరాజుల బీభత్సం
కుప్పం : చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని కొన్ని గ్రామాల పంట పొలాలపై ఏనుగులు దాడి చేస్తున్నాయి. మండలంలోని కంగోలి, రాముల గుట్టచేను ప్రాంతాల్లోని పంటపొలాలను నాశనం చేశాయి. గజరాజుల బీభత్సంతో గ్రామస్తులు, రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఏనుగులను తరిమేందుకు గ్రామస్థులు యత్నిస్తుండగా, అటవీశాఖ అధికారుల జాడ కనబడటం లేదు. ఈ ప్రాంతాల్లో ఏనుగుల దాడులు జరగడం సర్వసాధారణంగా మారింది. -
గజరాజుల బీభత్సం
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ - ఒడిశా సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం వల్ల గిరిపుత్రులు భయాందోళనకు గురవుతున్నారు. విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలోని ఏజెన్సీ గ్రామాల్లో కొన్ని రోజులుగా ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తూ రైతులకు అంతులేని నష్టాన్ని మిగుల్చుతున్నాయి. తాజాగా గురువారం ఉదయం సాలూరు మండలంలోని శికపరువు గ్రామంలో నాలుగు ఏనుగులు సంచరిస్తూ కనిపించాయి. స్థానికులు వాటి నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనే బాధల్లో ఉన్నారు. ఎలాగైనా అటవీ అధికారులు కల్పించుకుని వారిని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. -
చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం
-
పండ్ల తోటలపై ఏనుగుల దాడి
కుప్పం రూరల్, న్యూస్‌లైన్: పండ్ల తోటలపై ఏనుగుల గుంపు దాడి చేయడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఏనుగుల బారి నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోతున్నా రు. వుండల పరిధిలోని అటవీ ప్రాంత శివారు గ్రావూలైన గుడ్లనాయునపల్లె, జరుగు, యునవునాసనపల్లె, పరుకుంట్లపల్లె గ్రావూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు అరటి, పుచ్చకాయు తోటల ను ధ్వంసం చేసింది. పరుకుంట్లపల్లెలోని చిన్నక్క, రత్నవ్ము, జరుగు గ్రామంలోని వీటి.రావుప్పకు చెందిన 6.7 ఎకరాల పుచ్చకాయుతోట పూర్తిగా దెబ్బతింది. అలాగే పరకుంట్లపల్లెలోని కెంపన్నకు చెందిన రెండు ఎకరాల అరటి తోట, జరుగు గ్రామంలోని క్రిష్ణప్ప చెందిన మూడు ఎకరాల రాగి పంటను ఏనుగులు నాశనం చేశారుు. అప్పులు చేసి సాగు చేశామని, పంట చేతికోచ్చే సవుయూనికి ఏనుగులు దాడి చేయడంతో పూర్తిగా నష్టపోయూవుని రైతులు కన్నీటి పర్యంతమయ్యూ రు. ఏనుగుల దాడిలో పంటనష్టం జరిగిన ప్రతిసారీ పరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎప్పుడు వస్తుందో తెలియడం లేదన్నా రు. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, నాలుగేళ్లుగా ఏనుగులు దాడులు చేస్తున్నా శాశ్వత పరిష్కారం చూపడం లేదని రైతులు వాపోతున్నారు.