గడప దాటనివ్వని గజరాజులు | Elephants Attacks On Srikakulam Villages | Sakshi
Sakshi News home page

గడప దాటనివ్వని గజరాజులు

Published Wed, Sep 5 2018 11:59 AM | Last Updated on Wed, Sep 5 2018 11:59 AM

Elephants Attacks On Srikakulam Villages - Sakshi

ఎం.రాజపురం సమీపంలోని పంట పొలాల్లో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు

శ్రీకాకుళం,వీరఘట్టం: వీరఘట్టం మండలంలో ఏనుగుల స్వైర విహారంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సోమవారం రాత్రి ఇల్లీసుపురం కొండల్లో ఉన్న 8 ఏనుగులు మంగళవారం తెల్లవారేసరికి ఎం.రాజపురం సమీపంలోని చెరుకుపంటలో చొరబడ్డాయి. వి.జగన్నాంనాయుడు, బురిడి కాశింనాయుడికి చెందిన 5 ఎకరాల చెరుకు పంటను ధ్వంసం చేశాయి. గణపతి, రాగోలు అప్పలనాయుడు, జంపు పోతయ్య, దుర్గారావు, కృష్ణ, రౌతు అప్పలనాయుడులకు చెందిన వరి పంటలను పాక్షికంగా నాశనం చేశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎం.రాజపురం శివారు ప్రాంత పొలాల్లో ఉన్న ఏనుగులను అటవీశాఖ అధికారులు చెదరగొట్టే ప్రయత్నాలు చేశారు. పాలకొండ రేంజర్‌ డి.జగదీష్‌ ఆధ్వర్యంలో అటవీశాఖ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి మందుగుండు సామగ్రి పేల్చడంతో ఏనుగుల గుంపు ఎం.రాజపురం–వీరఘట్టం పంట పొలాల మీదుగా అచ్చెపువలస సమీపంలోని ఎలుగులమెట్టకు చేరుకుని కొండపై తిష్ఠ వేశాయి. ఈ కొండకు అచ్చెపువలస సమీపంలో ఉండడంతో అటవీశాఖ అధికారులు మందుగుండు సామగ్రి అధికంగా పేల్చారు. సాయంత్రం వరకు అచ్చెపువలస కొండపై ఉన్న ఏనుగులు దిశ ఏవిధంగా ఉంటుందో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఆందోళలనలో రైతన్నలు..
ఈ ఏడాది ఖరీఫ్‌ను ముందస్తుగా ప్రారంభించిన రైతులు 20 రోజుల కిందటే ఉభాలు పూర్తి చేశారు. ప్రస్తుతం వరి పంట తొలి దశలో ఉంది. హుస్సేనుపురం, కత్తులకవిటి పంచాయతీల్లో సుమారు 5 ఎకరాల్లో వరిపంట, మరో 5 ఎకరాల్లో చెరుకు పంటను ఏనుగులు ధ్వంసం చేశాయి. పంట ఏపుగా పెరిగేందుకు ఎరువులు వేయాల్సి ఉందని,పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తుండడంతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు ఆందోళన చెందుతున్నారు. అచ్చెపువలస సమీపంలో ఏనుగులు సంచరిస్తున్నట్లు తెలుసుకున్న వీరఘట్టం ప్రజలు పెద్ద ఎత్తున అచ్చెపువలస చేరుకోవడంతో వీరిని అదుపుచేసేందుకు అటవీశాఖ అధికారులు ఇబ్బందులు పడ్డారు.  

పోడు వ్యవసాయానికి దెబ్బ
ఏనుగులు కొండ ప్రాంతాల్లో సంచరిస్తుండడంతో గిరిజనులు పోడు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు. ముఖ్యంగా కుంబిడి, గంగమ్మపేట, అచ్చెపువలస, నీలంపేట, గదబవలస, ఇల్లీసుపురం, సందిమానుగూడ, రామాపురం గిరిజనులు గడపదాటేందుకు భయాందోళన చెందుతున్నారు.

పరిస్థితులు అనుకూలంగా లేవు...
ఏనుగులను దోనుబాయి అటవీ ప్రాంతంలోకి తరలిస్తే కొంతవరకు సమస్య సద్దుమణుగుతుందని రేంజర్‌ జగదీష్‌ అన్నారు. ప్రస్తుతం పంటలు ఉండడంతో ఏనుగులను తరలించేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదని చెప్పారు. తొందరపడితే పంటలు పాడయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే ఏనుగులను అటవీ ప్రాంతంలోకి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఆయనతో పాటు వీరఘట్టం, పాలకొండ ఎఫ్‌ఎస్‌ఓలు విఠల్‌కుమార్, ప్రహ్లాద, టాస్క్‌ఫోర్స్‌ ఎఫ్‌ఎస్‌ఓ రాంబాబు, వైర్‌లెస్‌ ఎఫ్‌ఎస్‌ఓ సాయిరాం మహాపాత్రో, గార్డులు, బీట్‌ ఆఫీసర్లు, ట్రాకర్లుపాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement