ఏనుగులు నష్టపరిపరిచిన అరటి (ఫైల్)
శ్రీకాకుళం , సీతంపేట: మన్యంలో ఏనుగుల గుంపు విధ్వంసానికి ఆర్థికంగా కుదేలైన గిరిజనులు పంటనష్ట పరిహారం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఏడాదిన్నరగా పరిహారం చెల్లింపులో మీనమేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఏనుగుల గుంపును తరిమికొట్టడంలో వైఫల్యం చెందిందనే చెప్పాలి. మరోవైపు ఇటీవల తిత్లీ తుఫాన్ ప్రభావంతో పంటలన్నీ నష్టపోయిన వీరిని ఆదుకున్న పాపానపోలేదు. దీంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు మండలాల్లోనే ప్రధానంగా వరి, అరటి, చెరుకు, జీడి మామిడి తదితర పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. 2008లో 11 ఏనుగుల గుంపు లకేరీ అడవుల నుంచి శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఏజెన్సీలో ప్రవేశించాయి. అప్పట్నుంచి నాలుగైదేళ్లుగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట మండలాల్లో పంటలను నష్టపరిచాయి. ప్రస్తుతం నాలుగు ఏనుగులు సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, హిరమండలం, కొత్తూరు మండలాల్లోనే సంచరించి పంటలను నాశనం చేస్తున్నాయి. ఏడాది కిందట మరో 7 ఏనుగుల గుంపు సంచరిస్తూ పంటలను ఇష్టానుసారంగా ధ్వంసం చేశాయి. వరి కోతకు వచ్చే సమయంలో నాశనం చేయడంతో గిరిజనులు లబోదిబోమంటున్నారు. ఇంత భారీ స్థాయిలో నష్టం కలిగిస్తున్నప్పటికీ అటవీశాఖ, ఉద్యానవనశాఖ, రెవెన్యూ శాఖలు స్థాయిలో సర్వే చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌వోఎఫ్‌ఆర్ పట్టాలు ఉన్నవారికి మాత్రమే పరిహారం చెల్లించి, పట్టాలు లేని వారిని లెక్కల్లోకి తీసుకోకపోవడం ఎంతవరకు సమంజసమని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు.
పరిహారం అరకొర పంపిణీ..
ఏనుగుల వల్ల కలిగిన పంట నష్టంపై అరకొరగా పరిహారం పంపిణీ చేసి అటవీశాఖ చేతులు దులుపుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2008 నుంచి ఇప్పటి వరకు 1,008 మంది రైతులకు 249.42 ఎకరాలకుగాను రూ.36.99 లక్షల వరకు మాత్రమే పరిహారం చెల్లించారు. ఆరు మండలాల్లో దాదాపు 8 వేల ఎకరాల్లో పంటల నష్టం ఉంటుందని గిరిజనుల అంచానా. దాదాపు రెండు వేల మందికిపైగా బాధితులు ఉన్నారు. కోటి రూపాయల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని గిరిజనులు చెబుతున్నారు. మండలంలోని అంటికొండ, అచ్చిబ, కుడ్డపల్లి, పెద్దగూడ, మండ, జక్కరవలస, బుడగరాయి, దోనుబాయి, పుబ్బాడ తదితర ప్రాంతాల పరిధిలో ఏనుగులు ఇటీవల పంటలు నాశనం చేసినా ఎటువంటి పరిహారమూ అందలేదు.
అటవీశాఖ వైఫల్యం
ఏనుగుల వల్ల పంట నష్టపోయిన వారికి పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏడాదిన్నర కిందట అరకొర పరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఏనుగులు విపరీతంగా పం టలను నాశనం చేస్తున్నాయి. వీటివల్ల పంట నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లిం చాలి. – విశ్వాసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
ఏనుగుల వల్ల పంట నష్టం కలిగిన మండలాలు: 6
ఏయే మండలాలు: సీతంపేట, కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, వీరఘట్టం, పాలకొండ
నష్టం : 8 వేల ఎకరాలపైనే ఇంతవరకూ చెల్లింపు : 249 ఎకరాలు
చెల్లించిన పరిహారం: రూ.36లక్షలు ఇంకా చెల్లించాల్సిన పరిహారం: రూ.కోటిపైనే
Comments
Please login to add a commentAdd a comment