సంత–నర్శిపురం గ్రామ సమీప చెరువులో తిష్ఠ వేసిన ఏనుగులు
శ్రీకాకుళం , వీరఘట్టం: జనావాసాలకు సమీపంలోకి ఏనుగుల గుంపు చొచ్చుకొచ్చింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఏ క్షణంలో ఎలాంటి ముప్పు వస్తుందోనని గజగజలాడుతున్నారు. విజయనగరం జిల్లా సమీప గ్రామాల నుంచి జిల్లాలోని వీరఘట్టం మండలం సంత–నర్శిపురం గ్రామ పొలిమేరల్లోకి శుక్రవారం ఆరు ఏనుగుల గుంపు చొచ్చుకొచ్చాయి. ఇవి ప్రస్తుతం చెరుకు తోటలో తిష్ఠ వేశాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఇక్కడే ఉన్నాయి. చెరువుల్లో నీరు ఉండడంతో ఇక్కడ నుంచి కదలడం లేదు. ఏనుగుల భయంతో రైతులు పొలాల వైపు వెళ్లలేదు. వరికోతలను కూడాశుక్రవారం విరమించుకున్నారు.
రెండు నెలల క్రితం సీతంపేట మండలం నుంచి వీరఘట్టం మండలంలోకి చొరబడిన ఏడు ఏనుగుల గుంపు హుస్సేనుపురం, నీలంపేట, కుంబిడి, బల్లగుడ్డి, అచ్చెపువలస, ఎస్.గోపాలపురం, జె.గోపాలపురం, పెద్దూరు, చలివేంద్రి, దశుమంతపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ చెరుకు, వరి పంటలతోపాటు అటవీ ఉత్పత్తులను నాశనం చేశాయి. అనంతరం విజయనగరం జిల్లాలోకి ప్రవేశించాయి. దీంతో మండల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏడు ఏనుగుల గుంపులో ఒకటి సెప్టెంబర్ 16న కొమరాడ మండలం అర్తాం వద్ద విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. అయితే మిగిలిన ఆరు ఏనుగులు వెళ్లిన మార్గం గుండానే మళ్లీ శుక్రవారం వీరఘట్టం మండల పరిసరాల్లోకి ప్రవేశించడంతో సమీప గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణమే ఏనుగులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని పీఏసీఎస్ అధ్యక్షుడు కర్రి గోవిందరావు విజ్ఞప్తి చేశారు.
అప్రమత్తంగా ఉండాలి
ఏనుగులు ఎటు వైపు వెళ్తాయో తెలియని పరిస్థితలో ఉన్నాయని అటవీశాఖ రేంజర్ జగదీష్ అన్నారు. ఈ పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏనుగులను దారి మళ్లించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి కదలకుండా వెళ్లిన మార్గం గుండానే వీరఘట్టం మండలంలోకి ప్రవేశించాయన్నారు. వీటి పయనాన్ని పరిశీలిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment