లకాడి పర్వతాల నుంచి దిగపండిలోకి చొరబడుతున్న ఏనుగుల గుంపు
ఒడిశా, బరంపురం: గంజాం జిల్లాలోని పలు గ్రామాల్లో ఏనుగుల గుంపులు చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. గ్రామాల్లోని కళ్లాల్లో ఉన్న ధాన్యం తినేందుకు వస్తున్న ఆ ఏనుగులు అక్కడి కాపలాదారులపై కూడా దాడులకు పాల్పడి, వారు చనిపోయేలా చేస్తున్నాయి. దిగపండి అటవీరేంజ్ పరిధిలో ఉన్న నిమ్మపల్లి కెనాల్ రోడ్డులో ఉన్న ధాన్యం కళ్లాల్లో ఏనుగులు మంగళవారం చొరబడి బీభత్సం సృష్టించాయి. గుంపులు గుంపులుగా అక్కడి కళ్లాల్లోకి ప్రవేశించి, అక్కడి ధాన్యం బస్తాలను పూర్తిగా ధ్వంసం చేశాయి. అనంతరం అక్కడ కాపలాగ ఉన్న రైతు లచ్చయ్యపై దాడి చేయగా, ఆ రైతు చనిపోయాడు. ఇప్పుడు ఇదే విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకిత్తిస్తోంది.
వివరాలిలా ఉన్నాయి..
సన్నొదొండొ వీధి నివాసి లచ్చయ్య, అరకిత పాత్రోతో కలిసి నగర శివారులోని కెనాల్ రోడ్డులో ఉన్న ధాన్యం కళ్లాల్లోని ధాన్యం బస్తాల కాపలాకు సోమవారం రాత్రి వెళ్లారు. వారు వేర్వేరు కళ్లాల్లో పడుకోగా అదేరోజు రాత్రి అక్కడి దగ్గరలోని లకాడి అటవీ ప్రాంతంలోని ఏనుగుల గుంపు ఒక్కసారిగా ధాన్యం కల్లంలో చొరబడి అక్కడి బస్తాల్లోని ధాన్యాన్ని తినివేస్తున్నాయి. అదే సమయంలో ఏనుగుల అలికిడికి ఉలికిపడి లేచిన రైతు లచ్చయ్యపై ఆ ఏనుగులను అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ ఏనుగులు అతడిపై దాడికి దిగి, గాయపరిచాయి. ఇదే విషయం తెలుసుకున్న బాధిత గ్రామస్తులు తీవ్రగాయాలతో సంఘటన స్థలంలో పడి ఉన్న క్షతగాత్రుడిని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. అయితే అక్కడ కూడా అతడి పరిస్థితి మెరుగుకాకపోవడంతో దిగపండి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రైతు ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన వైద్యులు రైతు మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో బాధిత రైతు కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట పోగా ఇంట్లో పెద్ద దిక్కు కూడా కోల్పోయామని వాపోయారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇవ్వాలని బాధిత గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అలాగే ఏనుగుల దాడిలో వందలాది ధాన్యం బస్తాలు ధ్వంసం కాగా బాధిత రైతులంతా ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, అదేరోజు రాత్రి లకాడి పర్వతాల్లో సంచరిస్తున్న మరో ఏనుగుల గుంపు అడపడా గ్రామంలో చొరబడి బీభత్సం సృష్టించాయి. ఆ గ్రామ శివారులోని ధాన్యం బస్తాలను చెల్లాచెదురు చేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వీటితో పాటు దిగపండి పరిధిలోని ఆదివాసీ గ్రామాల్లో ఏనుగులు తరచూ చొరబడి అక్కడి గ్రామస్తులను భయాందోళనలు కలిగిస్తుండగా ఇదే విషయంపై స్పందిస్తున్న అటవీరేంజ్ అధికారులు ఏనుగులను సమీప అడవిలోకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తరచూ ఏనుగుల దాడుల కారణంగా పలు విషాద సంఘటనలు చోటుచేసుకుంటుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment