
దశుమంతపురం చెరుకు తోటలో ఉన్న ఏనుగులను పరిశీలిస్తున్న పాలకొండ రేంజర్ జగదీష్, టాస్క్‌ఫోర్స్ బృందం.
వీరఘట్టం: శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో సంచరిస్తున్న గజరాజులు శుక్రవారం వీరఘట్టం మండలం దశుమంతపురం సమీపంలోని ఉత్తరావల్లి చంద్రశేఖర్‌కు చెందిన చెరకు తోటలో తిష్ఠవేశాయి. అయితే ఈ ఏనుగులను చూసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన దశుమంతపురం, పెదబుడ్డిడి గ్రామాల ప్రజల్లో కొందరు రాళ్లు విసురుతూ కేకలు వేయడంతో వీరి తీరుపై అటవీశాఖ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏనుగులను రెచ్చగొట్ట వద్దని పాలకొండ రేంజర్ జగదీష్ వారిని హెచ్చరించారు.
గజరాజులను అడవుల్లోకి తరలించాలంటే ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమని సూచించారు. ప్రస్తుతం ఏనుగులు ప్రశాంతంగా ఉన్నాయని, వాటిని కవ్వించే విధంగా ప్రవర్తించవద్దని కోరారు. అనంతరం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల డీఎఫ్‌ఓలు శాంతిస్వరూప్, లక్ష్మణరావు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. ఎప్పటికప్పుడు ఏనుగుల సంచారాన్ని గమనించాలని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఎఫ్‌ఆర్‌ఓ లు ప్రహ్లాద, రాంబాబు, విఠల్‌కుమార్ ఉన్నారు.
అనుకూలంగా ఉన్న పరిసరాలు
వీరఘట్టం మండలంలోని దశుమంతపురం పరిసరాలు అనుకూలంగా ఉండడంతో గజరాజుల గుంపు ఈ ప్రాంతంలో తిష్ఠవేశాయి. చుట్టూ అరటి, చెరుకు తోటలు, మధ్యలో నాగావళి, వట్టిగెడ్డల నీరు పుష్కలంగా ఉండడంతో ఏనుగులు ఇ క్కడ తిష్ఠ వేసినట్లు అధి కారులు చెబుతున్నారు. వీటిని అడవుల్లోకి తరలించేందుకు ముమ్మర ప్ర యత్నాలు చేస్తున్నామని రేంజర్ జగదీష్ తెలిపారు. ప్రస్తుతం గజరాజులు చినబుడ్డిడి–డంగభద్ర తోటల్లో సంచరిస్తున్నాయని వెల్లడించారు.