జియ్యమ్మవలస: వెంకటరాజపురం పొలిమేరలో తిష్ట వేసిన ఏనుగులు
విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని వెంకటరాజపురం గ్రామ పొలిమేరలో ఆదివారం ఉదయం నుంచి ఏనుగులు తిష్ట వేశాయి. సాయంత్రం ఐదు గంటల వరకు గుమ్మడిగెడ్డ వాగులో తిష్ట వేసిన ఏనుగులు బయటకు రాగానే వాటిని తేనేటీగల శబ్ధంలా అనుకరణ చేసి వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లేందుకు అటవీ శాఖాధికారులు ప్రయత్నించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో వెంకటరాజపురం గ్రామంలోకి చొచ్చుకురావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. జిల్లా అటవీ శాఖాధికారి గొంప లక్ష్మణ్, కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ సిబ్బందిని అప్రమత్తం చేసి చాకచక్యంగా గ్రామంలోకి రాకుండా అరటి తోటలోకి వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. గ్రామంలోకి వచ్చిన ఏనుగులు పొలాల్లోకి వెళ్లడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తేనేటీగల అనుకరణ శబ్ధం కురుపాం ఫారెస్ట్ మొదటిది రాహుల్ పాండే (సీసీఎఫ్) విశాఖపట్నం వారి సూచనల మేరకు ఆదివారం కురుపాం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న వెంకటరాజపురంలో తిష్ట వేసిన ఏనుగుల గుంపుపై తేనెటీగల శబ్ధాన్ని అనుకరణ మొదటిగా ప్రవేశపెట్టి సఫలీకృతం అయినట్లు కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ తెలిపారు.రాష్ట్రంలోనే మొదటగా తేనెటీగల శబ్ధాన్ని అనుకరించినట్లు తెలిపారు. దీని వల్ల ప్రజలకు ఎటువంటి అపాయం జరగకుండా ఏనుగులు వచ్చే దారినే వెళ్లడానికి వీలు కలిగిందని తెలిపారు. గుమ్మిడిగెడ్డ వాగు నుంచి బయటకు వచ్చిన వెంటనే తేనెటీగల శాబ్ధాన్ని అనుకరించడంతో తొలుత ఎలా వచ్చాయో అదేదారిన వెళ్లినట్టు మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం ఏనుగులు గతంలో వచ్చిన బాసంగి, గిజబ తదితర గ్రామాల మీదుగా వెళ్తున్నట్టు తెలిపారు.
నష్టం జరిగినా ఆదుకుంటాం
ఏనుగుల గుంపుతో పంటలకు ఎటువంటి నష్టం జరిగినా రైతులకు నష్టపరిహారం అందిస్తామని జిల్లా అటవీ శాఖాధికారి జి.లక్ష్మణ్ తెలిపారు. ప్రజలు రాత్రి సమయాలలో ఏనుగులు సంచరించే ప్రాంతాలలో తిరగరాదని సూచించారు. కార్యక్రమంలో కురుపాం రేంజర్ ఎం.మురళీకృష్ణ, పార్వతీపురం అటవీ సిబ్బంది అప్పారావు, గుమ్మలక్ష్మీపురం, కురుపాం అటవీసిబ్బంది పాల్గొన్నారు.
వెనక్కి వెళ్లిన గజరాజులు
కొమరాడ: కొద్ది నెలల కిందట నాగావళి నది దాటి గుణానపురంలోకి వచ్చిన ఏనుగుల గుంపు మండలంలో పలు చోట్ల తిష్ట వేసి పంటలను నాశనం చేస్తూ వచ్చాయి. వీటి రాకతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ రాత్రివేళ సంచరించడం మానుకున్నారు. శనివారం రాత్రి నాగావళి నది దాటి జియ్యమ్మవలస మండలం వెంకటాపురం గ్రామ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లాయి. దీంతో కొమరాడ మండల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వచ్చిన ఏనుగుల గుంపు ఏ మార్గంలో వచ్చాయో...అదే మార్గంలో వెనక్కి వెళ్లాయి. వెళ్లే క్రమంలో నాగావళి నది దాటి నిమ్మలపాడు గ్రామంలో వరి పంటను ధ్వంసం చేశాయి. దీంతో స్పందించిన రెవెన్యూ శాఖ పంట నష్టం అంచనా వేసేందుకు సిద్ధమైంది. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment