సంఘటనా స్థలం వద్ద గుమిగూడిన ప్రజలు
కొత్తూరు: మండలంలోని పొన్నుటూరు పరిసరాల్లో గత 10 రోజులుగా ఏనుగుల గుంపు చెరుకు, అరటి తోటల్లో తిష్ఠవేశాయి. వీటిని చూసేందుకు సమీపంలో ఉన్న పలు గ్రామాలకు చెందిన ప్రజలు రోజూ వస్తున్నారు. అయితే రాయల పంచాయతీ పరిధి టింపటగూడ, అంజలిగూడకు చెందిన ఇద్దరు గిరిజనులు ఏనుగులను చూసేందుకు శనివారం రాత్రి వెళ్లినట్టు సమాచారం. ఈ సమయంలో చెరుకు తోటల్లో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా భయంకరంగా ఘీంకారం చేశాయి. ఈ అరుపులు విన్న చుట్టుపక్కల వారు ఏనుగులను చూసేందుకు వెళ్లిన వారిపై దాడిచేశాయని అనుమానిస్తున్నారు. ఇంతలో ఏనుగులను చూసేందుకు వెళ్లిన ఇద్దరు గిరిజన యువకుల్లో ఒకరు చెరుకు తోటల్లోనుంచి తిరిగి బయటకు వచ్చినట్టు తెలిసింది.
మరో వ్యక్తి రాకపోవడంతో ఆ యువకుడిపై ఏనుగులు దాడిచేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. ఏనుగుల ఘీంకారాలను విన్న పొన్నుటూరు, బంకి గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకొన్నారు. వీరితో పాటు అప్పటికే అక్కడ కాపలా ఉన్న అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. టింపగూడకు చెందిన గిరిజనులు పొన్నుటూరు చేరుకున్నారు. ఎక్కువ మంది చేరడంతో గందరగోళం నెలకొంది. వీరిని అక్కడ నుంచి అటవీ సిబ్బంది పంపించారు. అయితే ఏనుగుల దాడిలో టింపగూడకు చెందిన యువకుడు మృతిచెంది ఉంటాడని సంఘటనా స్థలం వద్దకు చేరుకొన్నవారు అనుమానిస్తున్నారు. ఏనుగులు ఉన్న చోటకు వెళ్లేందుకు అటవీ సిబ్బంది, ప్రజలు భయపడుతున్నారు. ఆచూకీలేని యువకుడి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఆ యువకుడి బంధువులు తెలిపారు.
అటవీశాఖ రేంజర్ వివరాల
సేకరణ
ఏనుగుల దాడిలో గిరిజనుడు మృతి చెందాడన్న అనుమానాలు గుప్పుమనడంతో పాతపట్నం అటవీశాఖ రేంజర్ సోమశేఖర్ సంఘటనా స్థలానికి శనివారం రాత్రి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. అయితే ఏనుగుల దాడిలో వ్యక్తి మృతి చెందాడా, లేదా అనేది ఇప్పుడు గుర్తించలేమని స్పష్టం చేశారు. రాత్రి కావడంతో చెరుకు తోటల్లో ఏనుగుల గుంపు ఉన్నందున చెరుకు తోటల్లోకి వెళ్లేందుకు అవకాశం లేదన్నారు. తెల్లవారితే తప్ప ఏమి జరిగిందని చెప్పలేమని ఆయన తెలిపారు. ఆయనతోపాటు అటవీశాఖ అధికారి రామ్మూర్తి, సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment