శేషాచలం అడవుల్లో నుంచి ఈ ఏడాది గజరాజులు అటవీ సరిహద్దు ప్రాంతాలైన పంట పొలాల్లోకి వచ్చేయడంతో రైతుల కంటికి కునుకు కరువవుతోంది. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భీతిల్లుతున్నారు. అటవీ సరిహద్దుల్లో ఉన్న మామిడి తోటల్లో పంట కోనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో రైతులు సైతం ఆందోళన చెందారు. చివరకు రైతులే పంటను మార్కెట్ చేసుకున్నారు.
సాక్షి, భాకరాపేట(కడప) : పశ్చిమ కనుమల నుంచి వచ్చిన ఏనుగులు గుంపు శేషాచలం అడవుల్లో మకాం వేశాయి. శేషాచలం అటవీ సరిహద్దు మండలాలైన ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, వైఎస్సార్ జిల్లా బాలపల్లె అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు మామిడి కాయల సీజన్ వస్తే చాలు ఏనుగుల దాడులతో భయపడుతున్నారు. ఛామల అటవీ ప్రాంతం పరిధిలో గతంలో నాలుగేళ్ల కాలంలో 257 మంది రైతులు 709.96 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోగా, అందుకుగాను ప్రభుత్వం నుంచి రూ.60,17,599 నష్టపరిహారం రైతులకు అందింది.
అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు తమ పంటలు, ఆస్తుల నష్టానికి సంబంధించి పరిహారం అందలేదంటున్నారు. ఈ ఏడాది ఏనుగుల గుంపు అటవీ సరిహద్దు పొలాల్లోకి జూన్ మొదటి వారం వరకు రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తరువాత రెండు వారాలుగా ఏనుగుల గుంపు వచ్చి పంటను ధ్వంసం చేయడం మొదలెట్టాయి. చిన్నగొట్టిగల్లు మండలంలో టమాట పంటను నాశనం చేశాయి. రెండు రోజులుగా చంద్రగిరి మండలంలో ఏనుగులు గుంపు పంటలను నష్టపరుస్తున్నాయి. తలకోన, కల్యాణిడ్యాం పరిసర అటవీ ప్రాంతాల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నాయి.
గతేడాది రెప్పపాటులో తప్పించుకున్నా
గత ఏడాది బావి వద్ద పని చూసుకుని ఇంటికి వెళుతుండగా ఏనుగుల గుంపు పెద్ద శబ్ధాలు చేస్తూ రావడం చూసి పరుగులుతీశాను. ఒక ఏనుగు దారిలోనే ఉంది, గమనించకుండా ముందుకు వెళ్లాను. ఒక్కసారిగా పైకి రావడంతో భయపడి మరింత వేగం పెంచా. కిందపడిపోవడంతో కాలు బెణికింది. అప్పుడు నా వరి పైరు మొత్తం ధ్వంసం చేశాయి.
– విశ్వనాథ్, రైతు, మల్లెలవాండ్లపల్లె
అటవీ అధికారులువెంటనే చర్యలు చేపట్టాలి
ఏనుగుల గుంపు పగలంతా అడవుల్లో ఉంటున్నాయి. పొద్దుపోయిన తరువాత వెంటనే సమీపంలోని పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. అటవీ అధికారులు సత్వరం చర్యలు తీసుకుని ఏనుగుల గుంపును దారి మళ్లించాలి.
– నారాయణ, రైతు, మల్లెలవాండ్లపల్లె
Comments
Please login to add a commentAdd a comment