crop collapsed
-
ఖమ్మంలో కడగండ్లు.. రంగారెడ్డిలో వడగళ్లు
సాక్షి, నెట్వర్క్: ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలను గురువారం అకాల వర్షం ముంచెత్తింది. తెల్లవారుజామున కురిసిన వర్షంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చర్ల, పాల్వంచ, ఇల్లెందు, జూలూరుపాడు, బూర్గంపాడు మండలాల్లో కల్లాల్లో ఆరబోసిన మిర్చి రాశుల్లోకి నీళ్లు చేరి మిరపకాయలు కొట్టుకుపోయాయి. పలుచోట్ల పట్టాలు కప్పి ఉంచినప్పటికీ కింది నుంచి జలాలు చేరి తడిశాయి. వరిపంట నేలవాలింది. బూర్గంపా డు మార్కెట్ యార్డు, వైరా, తల్లాడ మండలాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. నీటి ఉధృతికి రాశులు కొట్టుకుపోవడంతో రైతులు కాపాడుకునేందుకు అరిగోస పడ్డారు. కారేపల్లిలో ఈదురుగాలులకు వరిపంట నేలవాలగా, మామిడికాయలు రాలిపోయాయి. మధిర మండలం మల్లారంలో గొర్రెలను మేపుతున్న నర్సింహ యాదవ్ (45) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో..: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని యాచారం, చేవెళ్ల మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వంద ఎకరాల్లోని వరిపంట నేలవాలింది. ఇంకా 50 ఎకరాల్లో మామిడితోటలు, మరో 50 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పరిగి మండలంలోని పలు గ్రామాల్లో 800కుపైగా ఎకరాల్లోని వివిధ పంటలు దెబ్బతిన్నాయి. రెండో రోజూ తీరని నష్టం.. మహబూబ్‌నగర్ జిల్లాలో రెండోరోజూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం రైతుల్ని బెంబేలెత్తించింది. నవాబుపేట మండలం కొల్లూర్‌లో ఈదురుగాలులకు రైస్‌మిల్లు పైకప్పు పూర్తిగా దెబ్బతిని బియ్యం, ధాన్యం తడిసిపోయాయి. గండేడ్‌లో ఇటుకబట్టీలకు తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలో అత్యధికంగా నవాబుపేట మండలంలో 4 సెం.మీ వర్షపాతం నమోదైంది. నారాయణపేట జిల్లా మాగనూరు, మరికల్ మండలాల్లో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. మరికల్లో దాదాపు 650 ఎకరాల్లో వరిపంటలు దెబ్బతిన్నాయి. -
గజరాజుల అలజడి
శేషాచలం అడవుల్లో నుంచి ఈ ఏడాది గజరాజులు అటవీ సరిహద్దు ప్రాంతాలైన పంట పొలాల్లోకి వచ్చేయడంతో రైతుల కంటికి కునుకు కరువవుతోంది. అటవీ సమీప గ్రామాల్లో ప్రజలు భీతిల్లుతున్నారు. అటవీ సరిహద్దుల్లో ఉన్న మామిడి తోటల్లో పంట కోనుగోలు చేయడానికి వ్యాపారులు ఎవరూ రాకపోవడంతో రైతులు సైతం ఆందోళన చెందారు. చివరకు రైతులే పంటను మార్కెట్ చేసుకున్నారు. సాక్షి, భాకరాపేట(కడప) : పశ్చిమ కనుమల నుంచి వచ్చిన ఏనుగులు గుంపు శేషాచలం అడవుల్లో మకాం వేశాయి. శేషాచలం అటవీ సరిహద్దు మండలాలైన ఎర్రావారిపాళెం, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, వైఎస్సార్ జిల్లా బాలపల్లె అటవీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు మామిడి కాయల సీజన్ వస్తే చాలు ఏనుగుల దాడులతో భయపడుతున్నారు. ఛామల అటవీ ప్రాంతం పరిధిలో గతంలో నాలుగేళ్ల కాలంలో 257 మంది రైతులు 709.96 ఎకరాల్లో వివిధ రకాల పంటలు నష్టపోగా, అందుకుగాను ప్రభుత్వం నుంచి రూ.60,17,599 నష్టపరిహారం రైతులకు అందింది. అయితే ఇప్పటికీ చాలా మంది రైతులు తమ పంటలు, ఆస్తుల నష్టానికి సంబంధించి పరిహారం అందలేదంటున్నారు. ఈ ఏడాది ఏనుగుల గుంపు అటవీ సరిహద్దు పొలాల్లోకి జూన్ మొదటి వారం వరకు రాకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తరువాత రెండు వారాలుగా ఏనుగుల గుంపు వచ్చి పంటను ధ్వంసం చేయడం మొదలెట్టాయి. చిన్నగొట్టిగల్లు మండలంలో టమాట పంటను నాశనం చేశాయి. రెండు రోజులుగా చంద్రగిరి మండలంలో ఏనుగులు గుంపు పంటలను నష్టపరుస్తున్నాయి. తలకోన, కల్యాణిడ్యాం పరిసర అటవీ ప్రాంతాల్లో పంటలకు నష్టం కలిగిస్తున్నాయి. గతేడాది రెప్పపాటులో తప్పించుకున్నా గత ఏడాది బావి వద్ద పని చూసుకుని ఇంటికి వెళుతుండగా ఏనుగుల గుంపు పెద్ద శబ్ధాలు చేస్తూ రావడం చూసి పరుగులుతీశాను. ఒక ఏనుగు దారిలోనే ఉంది, గమనించకుండా ముందుకు వెళ్లాను. ఒక్కసారిగా పైకి రావడంతో భయపడి మరింత వేగం పెంచా. కిందపడిపోవడంతో కాలు బెణికింది. అప్పుడు నా వరి పైరు మొత్తం ధ్వంసం చేశాయి. – విశ్వనాథ్, రైతు, మల్లెలవాండ్లపల్లె అటవీ అధికారులువెంటనే చర్యలు చేపట్టాలి ఏనుగుల గుంపు పగలంతా అడవుల్లో ఉంటున్నాయి. పొద్దుపోయిన తరువాత వెంటనే సమీపంలోని పంట పొలాల్లోకి వచ్చేస్తున్నాయి. ఏనుగులు రాకుండా అడ్డుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు. అటవీ అధికారులు సత్వరం చర్యలు తీసుకుని ఏనుగుల గుంపును దారి మళ్లించాలి. – నారాయణ, రైతు, మల్లెలవాండ్లపల్లె -
అకాల వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర పంటనష్టం
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. పలుచోట్ల వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి. మరికొన్ని చోట్ల వడగండ్ల వాన కురియడంతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. తెలంగాణాలో సిద్ధిపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఎక్కువగా పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వ్యవసాయ, హార్టీ కల్చర్, సెరి కల్చర్ అధికారులకు సూచనలు చేస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖ లేఖలు రాసింది. తెలంగాణ వ్యాప్తంగా 30 వేల ఎకరాలల్లో తీవ్రంగా పంటనష్టం జరిగినట్లు అంచనాకు వచ్చారు. శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తిరుపతి నగరంలో కూడా చిరుజల్లులు పడ్డాయి. కర్నూలు జిల్లా నల్లమల అటవీప్రాంతంలో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడా భారీ వర్షం కురిసింది. దీంతో నంద్యాల- గిద్దలూరు రోడ్డు మార్గంలోని నల్లమల ఘాట్ రోడ్డులో వర్షపు నీరు భారీగా నిలిచి వాహనదారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అకాలవర్షాలకు ఆంధ్రాలో కూడా పలుచోట్ల పంటనష్టం వాటిల్లింది. తెలంగాణాలో వర్ష సూచన ఈరోజు(శనివారం)తో పాటు రేపు కూడా ఉరుమలు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశముందని, అక్కడక్కడా వడగండ్లు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముంది. ఆంధ్రాలో ఈదురుగాలులతో కూడిన వర్షం శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముంది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. -
కృష్ణ.. కృష్ణా!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దూరంగా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... ఆ పక్కనే జింకల గుంపు.. ఈ ఫొటో చూస్తేనే కంటికి ఇంపుగా ఉంది కదా! కానీ ఇవే జింకలు పాలమూరు రైతులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. కరువు, కాటకాలతో సతమ తమయ్యే ఈ జిల్లాలోని కొన్ని పల్లెల్లో జింకల కారణంగా ఏకంగా పంటల సాగుకు విరామం ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతాలైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణ జింకల దాటికి వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా వీటి సమస్య తీవ్రతరమవుతుందే కానీ.. పరిష్కారం లభిం చడం లేదు. లేదు. ఫలితంగా ఏటా సాగుచేసిన పొలాల్లో పెట్టుబడి సైతం నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. దీంతో చేసేదేం లేక రైతులే స్వచ్ఛందంగా పంటలకు విరామం ప్రకటిస్తున్నారు. ఏటా ఇదే తంతు ఖరీఫ్‌లో సాగు చేసే పంటల విషయంలో రైతు లకు ప్రతీ ఏటా పాత అనుభవమే ఎదురవుతోంది. పొలంలో విత్తు సాగుచేసి మొలకలు రాగానే... కృష్ణ జింకల మందలు ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. గత ఐదారేళ్లు ఇదే తంతు సాగుతోంది. ఇటీవలి కాలంలో కురిసిన వానలకు పంటలను సాగు చేసుకుని నష్టపోవడం ఎందుకనే భావనతో పంటలకు విరామం ప్రకటించేందుకు సిద్ధం కావడం గమనార్హం. సీజన్లో వేసిన పత్తి, ఆముదం, కంది ఇలా ప్రతి పంటలను మొక్క దశలోనే తినేస్తున్నాయి. గత సంవత్సరం మాగనూరు మండలంలోని ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడు మాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, పుంజనూర్, అచ్చంపేట, మాగనూర్ గ్రామాల్లో వేసిన పంటలన్నీ కృష్ణ జింకల మూలంగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలాగే కృష్ణా మండ లంలోని చేగుంట, ఐనాపూర్, కున్సి, తంగిడి, సూకూర్ లింగంపల్లి, కుసుమర్థి గ్రామాల్లో ఈ సంవత్సరం సాగు చేసిన కంది, పత్తి పంటలను ధ్వంసం చేశాయి. నమోదవుతున్న కేసులు కృష్ణానది తీర ప్రాంతమైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పరిస్థితులు జింకల ఆవాసానికి అత్యంత అనుకూలంగా మారాయి. పొదలు, పక్కనే నదీ ప్రవహిస్తుండటంతో జింకలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం లేదు. జింకల తీరుతో విసిగిపోయిన వారు పొరపాటున వాటికి ఏమైనా అపాయం తలపెడితే తీవ్రమైన కేసులు నమోదవుతున్నాయి. షెడ్యూల్–1లో ఉన్న జీవజాతి కావడంతో అటవీశాఖ అధికారులు కృష్ణజింకల విషయంలో చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. జింకలకు అపాయం తలపెట్టినట్లు నేర నిరూపణ జరిగితే దాదాపు ముడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే గతేడాది రెండు కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంత వాసుల్లో భయం నెలకొంది. 24 గంటలు గస్తీ కాయాల్సిందే.. మాగనూరు, కృష్ణా మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా పంట సాగు చేశారంటే 24గంటల పాటు గస్తీ కాయాల్సి వస్తోంది. కొద్ది ఏమరపాటుగా ఉన్నా.. మనిషి కాపలా లేకపోయినా పంట పొలాలను సర్వనాశనం చేసేస్తాయి. దీంతో పంటలు సాగు చేసిన వారు ఒక జట్టుగా ఏర్పడి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతగా బెదింపులు చేసిన వందల సంఖ్యలో వచ్చి పొలాలను నాశనం చేస్తున్నాయి. కృష్ణ జింకల మూలంగా వేసిన పంటలను కోల్పోవడమే కాక, పెట్టుబడిగా పెట్టిన వేలాది రుపాయలు కూడా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జింకలను అటవీ శాఖ అధికారులు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని, ఈ ప్రాంతంలో జింకలు లేకుండా చేయాలని పలుమార్లు వినతులు అందజేశారు. కృష్ణ జింకలను ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప తమ పొలాల్లో పంటలు సాగు చేసుకోలేమని రైతులు విజ్జప్తి చేశారు. ఈ విషయంపై గత సంవత్సరం ప్రెగడబండ, అచ్చంపేట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా అటవీ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నా యి. జింకల మూలంగా దాదాపు వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడమే కాకుండా కృష్ణ జింకల బెడద నుంచి తమను కాపాడాలని బాధిత రెతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులే జింకలను తీసుకెళ్లాలి వన్యప్రాణులను రక్షించా ల ని, వాటిని చంపొద్దని చెప్పే ప్రభుత్వం, మా పంటలకు నష్టం చేస్తూ రూ.లక్షలు కోల్పోయేలా చేస్తున్నా ప ట్టించుకోవడం లేదు. గత రెండేళ్లలో పంటలు పోవడంతో పెట్టుబడి నష్ట పోయాం. మా పొలాల్లోకి జింకలు రాకుండా వా టిని ఇక్కడి నుండి తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలి వేయాలి. లేనిపక్షంలో ఈ ప్రాంతం మొత్తాన్ని జింకల కోసం లీజ్‌కు తీసుకుని మాకు ప్రతీ సంవత్సరం పరిహారం చెల్లించాలి. – వెంకట్‌రెడ్డి, రైతు, ప్రెగడబండ, మాగనూర్ -
భారీ వర్షాలతో పంటలకు నష్టం
మద్నూర్(జుక్కల్): వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు పత్తి పంట దెబ్బతిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట మొగ్గలు కాస్తున్న సమయంలో భారీ వర్షాలతో పత్తి పంట నీటిలో మునిగిపోయిందని రైతులు కలత చెందుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో రైతులు ఎక్కువ శాతం పత్తి పంటను సాగుచేస్తున్నారు. గతేడాది గులాబీ రంగు పురుగు, గిట్టుబాటు ధర, అంతంత మాత్రమే వచ్చిన దిగుబడితో నిండా అప్పుల్లో కూరుకుపోయామని రైతులు వాపో యారు. ఈ సారైనా పంట బాగా పండితే అప్పు లు తీర్చుకుందామని రైతులు చర్చించుకుంటున్నారు. అలాగే చేతికొచ్చిన పెసర, మినుము పంటలు బారీ వర్షాలతో నీట మునిగి కుళ్లిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు. -
వడగండ్లతో టమాట రైతు కుదేలు
చిత్తూరు: అకాల వర్షాల వల్ల అన్నదాతలు కష్టాల పాలవుతున్నారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి వందల ఎకరాల్లో టమాట, మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. అప్పు చేసి మరీ పెట్టుబడులు పెడ్తుంటే వడగండ్లు తమకు కడగండ్లనే మిగుల్చుతున్నాయని.. అకాలంలో వచ్చిన వర్షాల వల్ల టమాట తోటలన్ని నేలపాలయ్యాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.