మాగనూరు మండలం ప్రెగడబండ గ్రామంలోని పొలాల్లో తిరుగుతున్న కృష్ణ జింకలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : దూరంగా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... ఆ పక్కనే జింకల గుంపు.. ఈ ఫొటో చూస్తేనే కంటికి ఇంపుగా ఉంది కదా! కానీ ఇవే జింకలు పాలమూరు రైతులకు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. కరువు, కాటకాలతో సతమ తమయ్యే ఈ జిల్లాలోని కొన్ని పల్లెల్లో జింకల కారణంగా ఏకంగా పంటల సాగుకు విరామం ప్రకటించారు. ముఖ్యంగా కృష్ణానది తీర ప్రాంతాలైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పలు గ్రామాల్లో రైతులు పంటలు సాగు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.
కృష్ణ జింకల దాటికి వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. ఏటా వీటి సమస్య తీవ్రతరమవుతుందే కానీ.. పరిష్కారం లభిం చడం లేదు. లేదు. ఫలితంగా ఏటా సాగుచేసిన పొలాల్లో పెట్టుబడి సైతం నష్టం వాటిల్లుతోంది. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏ మాత్రం ప్రయోజనం ఉండడం లేదు. దీంతో చేసేదేం లేక రైతులే స్వచ్ఛందంగా పంటలకు విరామం ప్రకటిస్తున్నారు.
ఏటా ఇదే తంతు
ఖరీఫ్‌లో సాగు చేసే పంటల విషయంలో రైతు లకు ప్రతీ ఏటా పాత అనుభవమే ఎదురవుతోంది. పొలంలో విత్తు సాగుచేసి మొలకలు రాగానే... కృష్ణ జింకల మందలు ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. గత ఐదారేళ్లు ఇదే తంతు సాగుతోంది. ఇటీవలి కాలంలో కురిసిన వానలకు పంటలను సాగు చేసుకుని నష్టపోవడం ఎందుకనే భావనతో పంటలకు విరామం ప్రకటించేందుకు సిద్ధం కావడం గమనార్హం. సీజన్‌లో వేసిన పత్తి, ఆముదం, కంది ఇలా ప్రతి పంటలను మొక్క దశలోనే తినేస్తున్నాయి.
గత సంవత్సరం మాగనూరు మండలంలోని ప్రెగడబండా, ఓబ్లాపూర్, గుడెబల్లూర్, ముడు మాల్, మురహార్‌దొడ్డి, అడవి సత్యావార్, పుంజనూర్, అచ్చంపేట, మాగనూర్ గ్రామాల్లో వేసిన పంటలన్నీ కృష్ణ జింకల మూలంగా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆలాగే కృష్ణా మండ లంలోని చేగుంట, ఐనాపూర్, కున్సి, తంగిడి, సూకూర్ లింగంపల్లి, కుసుమర్థి గ్రామాల్లో ఈ సంవత్సరం సాగు చేసిన కంది, పత్తి పంటలను ధ్వంసం చేశాయి.
నమోదవుతున్న కేసులు
కృష్ణానది తీర ప్రాంతమైన మాగనూరు, కృష్ణా మండలాల్లోని పరిస్థితులు జింకల ఆవాసానికి అత్యంత అనుకూలంగా మారాయి. పొదలు, పక్కనే నదీ ప్రవహిస్తుండటంతో జింకలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడం లేదు. జింకల తీరుతో విసిగిపోయిన వారు పొరపాటున వాటికి ఏమైనా అపాయం తలపెడితే తీవ్రమైన కేసులు నమోదవుతున్నాయి. షెడ్యూల్–1లో ఉన్న జీవజాతి కావడంతో అటవీశాఖ అధికారులు కృష్ణజింకల విషయంలో చాలా సీరియస్‌గా చర్యలు తీసుకుంటున్నారు. జింకలకు అపాయం తలపెట్టినట్లు నేర నిరూపణ జరిగితే దాదాపు ముడు నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇప్పటికే గతేడాది రెండు కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంత వాసుల్లో భయం నెలకొంది.
24 గంటలు గస్తీ కాయాల్సిందే..
మాగనూరు, కృష్ణా మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎవరైనా పంట సాగు చేశారంటే 24గంటల పాటు గస్తీ కాయాల్సి వస్తోంది. కొద్ది ఏమరపాటుగా ఉన్నా.. మనిషి కాపలా లేకపోయినా పంట పొలాలను సర్వనాశనం చేసేస్తాయి. దీంతో పంటలు సాగు చేసిన వారు ఒక జట్టుగా ఏర్పడి కాపాడుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎంతగా బెదింపులు చేసిన వందల సంఖ్యలో వచ్చి పొలాలను నాశనం చేస్తున్నాయి. కృష్ణ జింకల మూలంగా వేసిన పంటలను కోల్పోవడమే కాక, పెట్టుబడిగా పెట్టిన వేలాది రుపాయలు కూడా వృథా అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జింకలను అటవీ శాఖ అధికారులు ఇక్కడి నుంచి తీసుకెళ్లాలని, ఈ ప్రాంతంలో జింకలు లేకుండా చేయాలని పలుమార్లు వినతులు అందజేశారు.
కృష్ణ జింకలను ఇక్కడి నుంచి తరలిస్తే తప్ప తమ పొలాల్లో పంటలు సాగు చేసుకోలేమని రైతులు విజ్జప్తి చేశారు. ఈ విషయంపై గత సంవత్సరం ప్రెగడబండ, అచ్చంపేట గ్రామాలకు చెందిన రైతులు జిల్లా అటవీ శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదనే ఆరోపణలున్నా యి. జింకల మూలంగా దాదాపు వేల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నాయి. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం ఇవ్వడమే కాకుండా కృష్ణ జింకల బెడద నుంచి తమను కాపాడాలని బాధిత రెతులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులే జింకలను తీసుకెళ్లాలి
వన్యప్రాణులను రక్షించా ల ని, వాటిని చంపొద్దని చెప్పే ప్రభుత్వం, మా పంటలకు నష్టం చేస్తూ రూ.లక్షలు కోల్పోయేలా చేస్తున్నా ప ట్టించుకోవడం లేదు. గత రెండేళ్లలో పంటలు పోవడంతో పెట్టుబడి నష్ట పోయాం. మా పొలాల్లోకి జింకలు రాకుండా వా టిని ఇక్కడి నుండి తీసుకెళ్లి నల్లమల అడవుల్లో వదిలి వేయాలి. లేనిపక్షంలో ఈ ప్రాంతం మొత్తాన్ని జింకల కోసం లీజ్‌కు తీసుకుని మాకు ప్రతీ సంవత్సరం పరిహారం చెల్లించాలి.
– వెంకట్‌రెడ్డి, రైతు, ప్రెగడబండ, మాగనూర్
Comments
Please login to add a commentAdd a comment