మ్యాప్‌ను చూస్తున్న పీవో శివశంకర్, శాంతిస్వరూప్, రేంజర్‌లు
పాతపట్నం: మండలంలోని పెద్దమల్లిపురం గ్రామ సమీపంలో ఉన్న కొండ ప్రాంతాల్లో ఎనిమిది ఏనుగులు గురువారం సంచరించాయి. ఇక్కడే రెండు రోజులుగా తిష్ఠ వేయడంతో అటవీశాఖ అధికారులు చేపట్టిన ‘ఆపరేషన్ గజ’ ముందుకు సాగడం లేదు. దీంతో బయట నుంచి తీసుకొచ్చిన శిక్షణ పొందిన ఏనుగులతో అటవీ సిబ్బంది పెద్దమల్లిపురం గ్రామం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్, డీఎఫ్‌ఓ శాంతిస్వరూప్, పాతపట్నం రేంజర్ సోమశేఖర్‌లు ఏనుగులు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి వెళతాయనే సూచనలు చేస్తూ మ్యాప్‌లను పరిశీలించారు. చుట్టుపక్కల గ్రామస్తులతో మాట్లాడి ఎటువంటి బాణసంచా కాల్చవద్దని సూచించారు. బుధవారం, గురువారం కూడా ఏనుగులు ఒకే ప్రాంతంలో ఉన్నాయని అధికారులు తెలి పారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు, శిక్షణ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దగుజ్జువాడలో పంటలు నాశనం
సారవకోట: మండలంలోని పెద్దగుజ్జువాడ గ్రామం పరిధిలోని పంటలను ఏనుగులు ధ్వంసం చేశాయి. పలువురి రైతులకు చెందిన చోడి, వేరుశనగ, నువ్వు, ఆనపకాయల పంటలను బుధవారం రాత్రి నాశనం చేశాయి. గత ఐదు రోజుల నుంచి మండలంలోని రిజర్వ్ ఫారెస్టు ఏరియాలో తిష్ఠ వేసిన ఏనుగుల గుంపు రాత్రి పూట గ్రామాల సమీపంలో ఉన్న పంటలను నాశనం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ గజ’లో భాగంగా శిక్షణ పొందిన ఏనుగులతో ఈ అడవి ఏనుగుల గుంపును రిజర్వ్ ఫారెస్టు ఏరియాలోకి అటవీశాఖ అధికారులు పంపిస్తున్నా రాత్రి పూట తిరిగి అవి గ్రామాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాలకు చేరి పంటలను తినేసి ధ్వంసం చేస్తున్నాయి. దీంట్లో భాగంగా బుధవారం రాత్రి పెద్దగుజ్జువాడ గ్రామానికి సమీపంలోని గొర్లె రుద్రుడు, గొర్లె జయడు, ఉర్లాన సింహాచలం, మల్లేషు, వసంత, సుందరరావు, శశిలకు చెందిన చోడి, వేరుశనగ, ఆనపకాయలు, నువ్వు పంటలను పాడుచేశాయి. ప్రస్తుతం ఈ ఏనుగుల గుంపు మల్లిపురం కొండలలో ఉన్నట్టు ఫారెస్టు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment