రికార్డులు పరిశీలిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గోవర్థనరావు
649 ఎకరాల భూమి సేకరణ
Published Fri, Sep 16 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM
తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు ఏర్పాట్లు
లావేరు: తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాలకు జిల్లాలో ఏడు మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని తోటపల్లి, వంశధార ప్రాజెక్టుల భూసేకరణ విభాగం స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ బి.గోవర్థనరావు అన్నారు. గురుగుబిల్లి, లావేరు గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. తోటపల్లి ప్రాజెక్టు కాలువల కోసం గురుగుబిల్లి వద్ద సేకరించిన భూములను పరిశీలించారు. అనంతరం లావేరులో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి మండలంలో తోటపల్లి కాలువల కోసం సేకరించిన భూముల వివరాలుపై తహసీల్దార్, అధికారులతో చర్చించారు.
తర్వాత విలేకరులతో మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో కాలువల తవ్వకాల కోసం లావేరు, రణస్థలం, జి.సిగడాం, రాజాం, రేగిడి, సంతకవిటి, వంగర మండలాల్లో 649 ఎకరాల భూమిని సేకరిస్తున్నామన్నారు. ఇప్పటివరకూ 50 ఎకరాలు మినహా మిగతా భూమిని అంతా కాలువల కోసం సేకరించామని చెప్పారు. కాలువల తవ్వకాలకు భూములు ఇవ్వడానికి ఏడు మండలాల్లో రైతులు బాగా సహకరించారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు మొదటి విడతగా రూ. 55 కోట్లు నష్టపరిహారం చెల్లించామని పేర్కొన్నారు. మరో రూ. 15 కోట్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయనతో పాటు తహసీల్దార్ బందరు వెంకటరావు, ఆమదాలవలస డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, ఆర్‌ఐ డి.సన్యాసిరావు, లావేరు మండల సర్వేయర్ నాగభూషణరావు తదితరులు ఉన్నారు.
Advertisement