పనామాసిటీ:త్వరలో రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పనామా కాలువ(Panama Canal)ను కొనేస్తానంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలపై పనామా అధ్యక్షుడు జోస్ రౌల్ ములినో తాజాగా స్పందించారు. అసలు ఈ అంశంపై ట్రంప్‌తో చర్చించాల్సిన అవసరమే లేదన్నారు.
ఈమేరకు ములినో మీడియాతో మాట్లాడారు. కాలువ పనామేనియన్లకు చెందిందన్నారు. కెనాల్‌పై ఎవరితోనూ ఎలాంటి చర్చలు జరపాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. అమెరికా(America) వాణిజ్య నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలుచేస్తోందనే ట్రంప్ ఆరోపణలను ములినో ఖండించారు.అదేవిధంగా పనామా కెనాల్‌లో చైనా జోక్యం లేదన్నారు.
కెనాల్ రుసుములు పబ్లిక్ అండ్ ఓపెన్ ప్రాసెస్ కింద అధ్యక్షుడు లేదా అడ్మినిస్ట్రేటర్ పాదర్శకంగా నిర్ణయిస్తారన్నారు.కాగా, ట్రంప్ ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడుతూ..అట్లాంటిక్, పసఫిక్ సముద్రాలను కలిపే పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు.
అమెరికాకు చెందిన వాణిజ్య,నావికాదళ నౌకల నుంచి పనామా దేశం భారీగా ఫీజులు వసూలు చేస్తోందని,వీటిని తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేశారు. లేకపోతే ఆ కాలువను తిరిగి అప్పగించాలన్నారు. దీంతో పాటు డెన్మార్క్ అధీనంలోని గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేస్తామని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment