వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్
సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : అధికార తెలుగుదేశం పార్టీకి జిల్లాలో భారీ షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్జహాన్, ఆమె భర్త, కోఆప్షన్ సభ్యుడు ఎస్‌ఎంఆర్ పెదబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోటస్‌పాండ్ నివాసంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని నేతృత్వంలో బుధవారం వారు వైఎస్సార్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు మరికొందరు కార్పొరేటర్లు కూడా వైఎస్సార్ సీపీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్న ఎస్‌ఎంఆర్ పెదబాబు 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశంలో చేరారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసిన బడేటి బుజ్జి గెలుపునకు అత్యంత కీలకంగా వ్యవహరించారు. నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవి బీసీ మహిళకు రిజర్వు కావడంతో పెదబాబు భార్య నూర్జహాన్‌కు ఆ పదవి కట్టబెట్టారు.పెదబాబు కోఆప్షన్ సభ్యుడిగా ఎంపికయ్యారు.
ఏలూరు నగరం అభివృద్ధికి కృషి
మేయర్ నూర్జహాన్, పెదబాబు పాలకవర్గ సభ్యులను సమన్వయం చేసుకుని ఏలూరు కార్పొరేషన్‌లో రూ.160 కోట్ల మేరకు అభివృద్ధి పనులు చేశారు. ఏలూరు స్మార్ట్ సిటీగా, అర్భన్ డెవలెప్‌మెంట్ అథారిటీగా రావడంలో వీరు ముఖ్య భూమిక పోషించారు. అమృత్, ఎస్సీ, ఎస్టీ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేశారు. మేయర్ నూర్జహాన్, పెదబాబులకు ప్రభుత్వం ఇచ్చిన జీతాలు, ఇతర అరియర్స్‌ను ఏడాదికి ఒక్కసారి పేద ముస్లింలకు పంపిణీ చేయడంతో పాటు, పేద విద్యార్థులను చదివించారు.
ఏలూరు నగరంలోని దేవాలయాలు, చర్చిలు, మసీదులకు తమ సొంత నిధులు దానం చేశారు. అయితే గడిచిన నాలుగేళ్లలో స్థానిక ఎమ్మెల్యే బడేటి బుజ్జి నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, పలు ఇబ్బందులకు గురి చేయడంతో పెదబాబు, నూర్జహాన్ విసిగిపోయారు. మరోవైపు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పాదయాత్ర స్ఫూర్తితో జగన్‌మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయితేనే నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయవచ్చనే ఉద్దేశంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఎస్‌ఎంఆర్ పెదబాబు తెలిపారు.
టీడీపీలో అవమానాలు భరించలేకే ఆ పార్టీకి రాజీనామా చేశామని చెప్పారు. ఆళ్లనానిని ఎమ్మెల్యేగా గెలిపించి తీసుకొస్తామని భరోసానిచ్చారు. అధినేత ఆదేశిస్తే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని నూర్జహాన్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ఏపీ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని వ్యాఖ్యానించారు. ఏలూరు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతోనే వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పనిచేయడానికి ముందుకొచ్చామని వెల్లడించారు.
పోలవరం సీటుపై తమ్ముళ్ల రచ్చ
పోలవరం అసెంబ్లీ సీటు పంచాయతీపై సీఎం చంద్రబాబునాయుడు నివాసం వద్ద తెలుగు తమ్ముళ్లు రచ్చరచ్చ చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు పోలవరం అసెంబ్లీ టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేక వర్గం నినాదాలు చేయగా, ఆయనకే సీటు కేటాయించాలని అనుకూల వర్గం డిమాండ్ చేస్తోంది. రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి కొట్లాటకు దారి తీసింది. పోలీసులు రంగప్రవేశం చేసినా వారిని అదుపు చేయలేకపోయారు.
పార్టీలోని రెండు వర్గాల నేతల అరుపులు, కేకలతో సీఎం నివాస ప్రాంతం దద్దరిల్లింది. సీటు కోసం బరితెగించిన తెలుగు తమ్ముళ్లు ఒకరిపైకి మరొకరు దూసుకొచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాలు ఇద్దరూ అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలవరం సీటును మొడియం శ్రీనివాసరావుకు ఇస్తే ఓడించి తీరుతామని ఆయన వ్యతిరేక వర్గం నేతలు హెచ్చరిస్తున్నారు.
మరోవర్గం మాత్రం మొడియంకు సీటు కేటాయించకపోతే పార్టీకి సహకరించేదిలేదని అల్టిమేటం జారీ చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం అభ్యర్థి ఎంపిక గందరగోళంగా మారింది. కొవ్వూరు, గోపాలపురం సీట్లపై సమీక్షలు జరిగినా అభ్యర్థుల ఎంపిక మాత్రం జరగలేదు. మరోవైపు మంత్రి పితాని సత్యనారాయణ పార్టీ మారిపోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment