ఎలాగయ్యూ బాబూ!
Published Sun, Jan 12 2014 4:02 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఏలూరు ఎంపీ సీటు కేటాయింపు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో రెండు ముఖ్య కుటుం బాల మధ్య దూరాన్ని పెంచుతోంది. ఈ స్థానం నుంచి మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాగంటి బాబు పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అదే సీటుపై కన్నేసిన ముళ్లపూడి కుటుంబీకులు తమ వర్గీయుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతుండటం ఆసక్తికరంగా మారింది. కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బుల్లిరామయ్య మనుమడు రాజీవ్ ఈ సీటు కోసం తెరవెనుక గట్టి ప్రయత్నాలు చేస్తుండటం మాగంటి వర్గీయులకు మింగుడు పడటం లేదు. తనకు దక్కుతుందనుకున్న సీటు కోసం చివరి దశలో ముళ్లపూడి కుటుంబం పోటీకి రావడంతో ఆయన నొచ్చుకుంటున్నారని సమాచారం. ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది.
కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన మాగంటి బాబుకు తొలినాళ్లలో చంద్రబాబు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. 2009 ఎన్నికల్లో ఏలూరు లోక్‌సభా స్థానం నుంచి మాగంటిని పోటీకి దింపగా ఓటమి పాలయ్యూరు. అయినా పార్టీని అంటిపెట్టుకుని ఉంటూ.. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. నియోజ కవర్గంలో పార్టీని చాలావరకూ ఆయనే నడిపిస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆయనకే ఏలూరు ఎంపీ సీటు దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. ఆయన కూడా కొద్దిరోజుల నుంచి టీడీపీ తరఫున తానే మళ్లీ ఏలూరు నుంచి పోటీ చేస్తానని చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే పార్లమెం టరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరుగుతున్నారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నా పోటీ చేసేందుకు మళ్లీ రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
ముళ్లపూడి కుటుంబం ఒత్తిడి
ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి బోళ్ల బులిరామయ్య మనుమడు రాజీవ్ కన్నేసి దానికోసం ప్రయత్నాలు చేస్తుం డటం పార్టీలో చర్చకు దారితీసింది. ముళ్లపూడి కుటుంబం తరఫున ఆయనకు సీటివ్వాలని కూడా కొందరు కోరుతుండటం చర్చనీయాంశమైంది. బోళ్ల రాజీవ్ తాను సైతం తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తానని కొద్దిరోజుల క్రితం స్పష్టం చేశారు. ఇప్పుడు ఏలూరు ఎంపీ సీటు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచా రం జరుగుతోంది. నిజానికి 25 ఏళ్లపాటు ఏలూరు సీటును తెలుగుదేశం పార్టీ ముళ్లపూడి-బోళ్ల కుటుంబానికే కేటాయిస్తూ వస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి 2004 ఎన్నికల వరకూ బోళ్ల బులిరామయ్య ఇక్కడ నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తూ వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో బుల్లిరామయ్య సొంత ప్రాంతమైన తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఆయన పోటీకి దిగే అవకాశం లేకుండాపోయింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన మాగంటి బాబుకు ఆ సీటును కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఏలూరు ఎంపీ సీటును తమకే ఇవ్వాలని బోళ్ల కుటుంబం కోరుతుం డటం చర్చనీయాంశమైంది. అయితే ఆ కుటుంబానికి బాగా పట్టున్న తణుకు సెగ్మెంట్ నరసాపురం పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వెళ్లిన నేపథ్యంలో ఆ కుటుంబానికి ఏలూరు సీటు ఎలా ఇస్తారనే వాదన వినిపిస్తోంది. ఇవేమీ పట్టిం చుకోకుండా రాజీవ్ తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. దీంతో మాగంటి వర్గీయులు కారాలు మిరియాలు నూరుతున్నారు. డబ్బుంటే సరిపోదంటూ బోళ్ల వర్గీయులపై పెద్దఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.
Advertisement
Advertisement