ఆపండీ..!
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: భయపడినట్లే జరిగింది. ఉద్యోగార్థులు.. ఉద్యోగులపై విభజన పిడుగు పడింది. అన్ని ప్రభుత్వ శాఖల్లోని అన్ని స్థాయిల ఉద్యోగుల బదిలీలు, పదన్నోతులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీంతోపాటు కొత్త ఉద్యోగుల నియామకాల పైనా నిషేధం విధించింది. సాధారణ నియామకాలతో పాటు.. పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతరత్రా కమిటీల ద్వారా కూడా నియామకాలు చేపట్టరాదని ఆదేశించింది. చివరికి కారుణ్య నియామకాలపైనా కరుణ చూపలేదు.
ఈ మేరకు ప్రభుత్వం జీవో నెం.2147ను జారీ చేసింది. ఈ జీవో ప్రకారం శాఖల వారీగా డిపార్టుమెంటల్ ప్రమోషన్ కమిటీలు(డీబీసీ) ఏర్పాటు చేయరాదని, సీనియారిటీ, తదితర జాబితాలు ప్రకటించరాదని స్పష్టంగా పేర్కొంది. కాగా కొత్త నియామకాలతోపాటు, ఇప్పటికే ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక ఉత్తర్వులు జారీ చేయరాదని ఆదేశించింది. పబ్లిక్ సర్వీసు కమిషన్, ఇతర నియామక సంస్థల ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన వారిని తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు పెండింగులో ఉంచాలని స్పష్టం చేసింది. బదిలీలపైనా నిషేధం విధించిన ప్రభుత్వం ఇటీవల ఎన్నికల నిబంధనల కారణంగా బదిలీ అయిన వారికి మాత్రం స్వస్థలాలకు వెళ్లేందుకు వీలుగా మినహాయింపు ఇచ్చింది.
సర్దుబాటు తర్వాతే..
కొత్త ప్రభుత్వం ఏర్పాటై.. ఈ విషయంలో ఒక విధాన నిర్ణయం తీసుకునే వరకు ఈ ఉత్తర్వు లు అమల్లో ఉంటాయని అధికారులు పేర్కొన్నప్పటికీ.. రాష్ట్ర విభజనే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులు వారి ఆప్షన్లు, స్థానికత ప్రకారం కొత్త ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాలకు వస్తారు. వారందరినీ ఆయా క్యాడర్ పోస్టుల్లో భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తా అయిన తర్వాత.. అవసరాలు, ఖాళీలను బట్టి ప్రస్తుత ఉద్యోగులకు పదోన్నతులు, కొత్త నియామకాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. అలా చేయకుంటే ఉద్యోగుల మధ్య సీనియారిటీ, హోదా సమస్యలు తలెత్తే ప్రమాదముం దని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత బదిలీలు, నియామకాలు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుం దోనని ఉద్యోగులు, నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, ఉపాధ్యాయుల తదితర శాఖల్లో గత రెండేళ్లుగా పదోన్నతులు లేవు. వారంతా బదిలీల కోసం ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంతాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారు స్వస్థలాలకు వచ్చేందుకు బదిలీలపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో వారి ఆశలపై నీళ్లు చల్లింది. ఇదిలా ఉంటే.. ఇటీవల పంచాయతీ కార్యదర్శుల పోస్టులతోపాటు మరికొన్ని శాఖల ఉద్యోగాలకు రాతపరీక్షలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా వెలువడ్డాయి. అయితే నియామక ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. రేపో మాపో వస్తాయనుకున్న తరుణంలో నిషేధం విధించడంతో వారి పరిస్థితి అయోమయంగా మారింది. రాత్రింబవళ్లు కష్టపడి సంపాదించిన ఉద్యోగం చేతికొస్తున్న తరుణంలో ఒక్క జీవోతో దూరమైపోవడం పట్ల ఎంపికైన అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.