శ్రీకాకుళం కలెక్టరేట్: ప్రభుత్వ వ్యవహారాల్లో తప్పు ఎక్కడ జరిగినా.. ఎవరు చేసినా బలవుతున్నది కిందిస్థాయి ఉద్యోగులే. బీసీ సంక్షేమ శాఖలో కొందరు ఉద్యోగులు ఇప్పుడు ఇదే తరహా శిక్ష అనుభవిస్తున్నారు. చేయని పాపానికి మూడు నెలలుగా జీతాలకు నోచుకోక అలమటిస్తున్నారు. ఉద్యోగుల బదిలీలు నిబంధనలకు లోబడి జరగాలి. అందుకు విరుద్ధంగా జరిగితే సదరు ఉద్యోగుల జీతాల చెల్లింపును ట్రెజరీ అధికారులు అడ్డుకుంటారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కార్యాలయంలో అక్రమ బదిలీల కారణంగా ఆరుగురు ఉద్యోగులకు మార్చి నుంచి జీతాలు అందడం లేదు.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధికారిని వేడుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ శాఖలో ఆరుగురు ఉద్యోగులను నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఏడాది ఫిబ్రవరి 27న బదిలీ చేశారు. జిల్లా కార్యాలయంలో ఉన్న వారిని సహాయ సంక్షేమాధికారుల కార్యాలయాలకు, అక్కడున్న వారిని జిల్లా కార్యాలయానికి బదిలీ చేశారు. డి.పార్వతీదేవి, బి.పార్వతి, బాలకృష్ణ, మమత, శాంతిప్రసాద్, చంద్రశేఖర్, త్రినాథరావులు ఇలా బదిలీ అయ్యారు. వీరి జీతాలు బిల్లులు ఖజానా కార్యాలయానికి పంపగా వారు తిరస్కరించారు. బదిలీలు నిబంధనల ప్రకారం జరగనందున ఆ బిల్లులను ఆమోదించలేమని వారు పేర్కొన్నారు.
దీనిపై సదరు ఉద్యోగులు జిల్లా బీసీ సంక్షేమాధికారికి పలుమార్లు ఫిర్యాదు చేశారు. దీంతో మూడు నెలలుగా వేతనాలు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. వీరి జీతాలను బదిలీకి ముందు ఉన్న స్థానం నుంచే చెల్లించాల్సి ఉంటుందని, లేదా బదిలీలను డిప్యుటేషన్‌గా మార్చుకుంటే తప్ప జీతాలు విడుదలయ్యే పరిస్థితి లేదని ట్రెజరీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే విషయాన్ని బీసీ సంక్షేమాధికారి లాలా లజపతిరావు వద్ద ప్రస్తావించగా జిల్లా ట్రెజరీ ఆధికారులతో మాట్లాడామని, రెండు మూడు రోజుల్లో జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
3 నెలలుగా జీతాల్లేవు
Published Tue, Jun 10 2014 2:11 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement