=డయల్ యువర్ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు
=మొత్తం 32 ఫిర్యాదులు
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసి చేతులెత్తేశారని బాధితులు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్రైమ్ సీఐ జగన్‌మోహన్ రెడ్డి స్వీకరించారు.
చిత్తూరు నగరంలోని గిరింపేటలో విక్టియా సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వాహకులు ఉద్యోగాలు తీసిస్తామని ఆశచూపి పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. డబ్బు కట్టినా ఉద్యోగాలు చూపకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. దీంతో ఆనుమానం వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తే ఉద్యోగాలు తీసివ్వలేమని చేతులెత్తేశారు. వారిపై చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరారు.
చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిలోని డాబాహోటళ్ల వద్ద రోడ్డుకిరువైపులా భారీ కంటైనర్లను నిలిపివేస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ఫిర్యాదు చేశారు. పూతలపట్టు మండలంలోని అయ్యప్పగారిపల్లె సమీపంలో ఉన్న ఇనుప ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో అనారోగ్యం పాలవుతున్నామని ఆ గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు.
శాంతిపురం మండలంలోని పలు రహదారుల్లో రోడ్లకిరువైపులా ఉన్న భారీ వృక్షాలను కొందరు రాత్రికి రాత్రే నేలకూల్చి మాయం చేస్తున్నారని అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. వరదయ్యపాళెం, బంగారుపాళెం, పాలసముద్రం పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఆ ప్రాంతంలో సారా బారిన పడి నిరుపేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో సారాతయారీ దారులపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు విన్నవించారు. వీటితో పాటు ఇసుక అక్రమరవాణా, బెల్టుషాపులు, ఆస్తి తగాదాలు, కోర్టుపరిధిలో ఉన్న కేసులు కలిపి మొత్తం 32 ఫిర్యాదులు అందాయి.