dial your SP
-
కోడలి కుటుంబం నుంచి రక్షించండి
కర్నూలు: కోడలు కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని పత్తికొండ మండలం పెద్దహుల్తి గ్రామానికి చెందిన హుల్తెన్న ఎస్పీ గోపీనాథ్ జట్టికి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో ఎస్పీ గోపీనాథ్ జట్టి పోలీస్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 ఫోన్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్ చేసుకున్నారు. అలాగే ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జి ల్లా వ్యాప్తంగా మొత్తం 67 ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదుల్లో కొన్ని... ♦ ఇల్లు లేని పేదలకు ప్రభుత్వ స్థలాలు ఇప్పిస్తానని చెప్పి తహసీల్దార్ సంతకం ఫోర్జరీతో నకిలీ పట్టాలు ఇచ్చి మోసం చేశారని నగరంలోని కృష్ణానగర్‌కు చెందిన విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. సంఘటనపై విచారణ జరిపి మోసం చేసినవారిని శిక్షించి తమ డబ్బులు ఇప్పించాలని కోరారు. ♦ తన పొలంలోకి రానివ్వకుండా కొందరు వ్యక్తులు బెదిరిస్తున్నారని తుగ్గలి మండలం ఎద్దులదొడ్డి గ్రామానికి చెందిన రామనాథ అయ్యమ్మ వాపోయింది. భూ సమస్య గురించి కొంతమంది నుంచి ప్రాణహాని ఉందని, విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరింది. ♦ ఆదోని ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో కొందరు పేకాట నిర్వహిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని ఆయా కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు. ♦ కర్నూలు నగరంలో నెలనెలా స్కీమ్‌ల పేరుతో కొందరు డబ్బులు కట్టించుకుని మోసాలకు పాల్పడుతున్నారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పలు కాలనీల వాసులు ఫిర్యాదు చేశారు. ♦ తన తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన పొలాన్ని కుమారుడు కౌలుకు తీసుకుని 12 ఏళ్లైనా ఇంతవరకు డబ్బు ఇవ్వకపోగా జీవనాధారం కోసం పొలాన్ని అమ్ముకుందామంటే అడ్డుకుంటున్నాడని, న్యాయం చేయాలని శిరివెళ్ల మండలం గోవిందపల్లె గ్రామానికి చెందిన సిరిగిరి సుంకమ్మ ఫిర్యాదు చేసింది. చీకటి పడితే కళ్లు సరిగా కనిపించవని, ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు తనకు పొలాన్ని రాసిచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ♦ తమ కుమార్తెను అనుమానంతో హత్య చేశారని కొత్తపల్లి మండలం ఎదురుపాడు గ్రామానికి చెందిన నేరేడు చిన్నయ్య ఫిర్యాదు చేశారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాదర్బార్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడ్మిన్ ఎస్పీ షేక్షావలి, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు నజీముద్దీన్, బాబుప్రసాద్, వెంకటాద్రి, వినోద్‌కుమార్, సీఐలు ములకన్న, పవన్‌కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం
– డయల్ 100, 9989819191 కాల్స్‌పై ఎస్పీ సమీక్ష అనంతపురం సెంట్రల్: ఆపదలో ఉన్న బాధితులకు సత్వరన్యాయం అందించడమే లక్ష్యంగా డయల్ 100, 99898 19191 విభాగాలు పనిచేయాలని ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సూచించారు. జులై నెలలో ఆయా కాల్స్‌కు వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం సంబంధిత అధికారులతో ఎస్పీ సమీక్షించారు. జులైలో మొత్తం 2,306 కాల్స్ అందాయని, ప్రతి రోజూ సగటును 73 కాల్స్ వచ్చినట్లు వివరించారు. వీటిలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వెంటనే సహాయచర్యలు అందించినట్లు తెలిపారు. ఓడీసీ, కణేకల్లు, పట్నం, శెట్టూరు ప్రాంతాల్లో బెల్టు దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. వజ్రకరూరు, శెట్టూరు, కళ్యాణదుర్గం ప్రాంతాల్లో నాటుసారా విక్రేతలను పట్టుకొని బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్న ప్రజలతో పాటు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లైతే డయల్ 100, 99898 19191 నంబర్లను ఆశ్రయిస్తే వంద శాతం న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు. -
సమస్యల పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ
నెల్లూరు(క్రైమ్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నగర డీఎస్పీ వెంకటరాముడు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం గురువారం జరిగింది. ఎస్పీ విశాల్‌గున్నీ, ఏఎస్పీ శరత్‌బాబు అందుబాటులో లేకపోవడంతో నగర డీఎస్పీ పాల్గొన్నారు. సమస్యలివే.. ఎస్ 2 థియేటర్‌కు వెళ్లే రహదారిలో అడ్డదిడ్డంగా వాహనాలను నిలపడం, ఫుట్‌పాత్‌ను ఆక్రమించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోందని రామ్మూర్తినగర్‌కు చెందిన డాక్టర్ సుధాకర్‌రెడ్డి చెప్పారు. తన తమ్ముడ్ని అతని భార్య ప్రియుడితో కలిసి హత్యచేసిందని, సాక్ష్యులను బెదిరిస్తున్నారని జనార్దన్‌రెడ్డికాలనీకి చెందిన ప్రసాద్ పేర్కొన్నారు. తన ఇంట్లో 2013లో దొంగతనం జరిగిందని, ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదని గాయత్రీనగర్‌కు చెందిన గిరిజ ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులను ఇంత వరకూ అరెస్ట్ చేయలేదని కోటకు చెందిన కంచి శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాంతాల్లో బెల్టుషాపుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, వీటిని తొలగించాల్సిందిగా పలువురు కోరారు. సమస్యలపై స్పందించిన డీఎస్పీ విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, మహిళా డీఎస్పీ శ్రీనివాసాచారి, తదితరులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జరిగిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి తొమ్మిది ఫిర్యాదులు అందాయి. ఎస్పీ విశాల్‌గున్నీ, ఎఎస్పీ బి.శరత్‌బాబులు అందుబాటులో లేకపోవడంతో నెల్లూరు రూరల్, నగర, ఎస్బీ డీఎస్పీలు తిరుమలేశ్వర్‌రెడ్డి, జి.వెంకటరాముడు, ఎన్.కోటారెడ్డిలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుంచి ఫోన్ల ద్వారా ఫిర్యాదులను స్వీకరించారు. దగదర్తికి చెందిన అరుణమ్మ ఈ ఏడాది నవంబర్ ఒకటో తేదీన తన ఇంట్లో దొంగతనం జరిగిందని, నిందితుడు విషయం పోలీసులకు తెలిపినా ఇంతవరకూ ఎలాంటి చర్య తీసుకోలేదని పేర్కొంది. విడవలూరుకు చెందిన మనోజ్‌కుమార్ తన భార్యపై తన అన్న దాడిచేశాడని అతనిపై చర్యలు తీసుకోవాలని, నగరానికి చెందిన గిరిబాబు మద్రాçసుబస్టాండ్, పొగతోట ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉందని ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన నర్సింహారెడ్డి ఆత్మకూరు బస్టాండ్ వద్ద గతేడాది తన తల్లి ఉండగా నగల బ్యాగ్‌ను అపహరించుకొని వెళ్లారనీ ఇంతవరకూ కేసులో ఎలాంటి పురోగతి లేదని, అనంతసాగరం మండలానికి చెందిన విజయ్ తన ఎద్దులను దుండగులు అపహరించుకుని వెళ్లారని ఇంతవరకూ ఎలాంటి న్యాయం జరగలేదని ఫిర్యాదు చేశారు. ఎస్బీ ఇన్స్పెక్టర్ సి.మాణిక్యరావు పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారమే లక్ష్యం
డయల్ యువర్ ఎస్పీలో ఏఎస్పీ శరత్‌బాబు నెల్లూరు(క్రైమ్): బాధితుల సమస్యల సత్వర పరిష్కారమే డయల్ యువర్ ఎస్పీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశమని జిల్లా అదనపు ఎస్పీ బి. శరత్‌బాబు స్పష్టంచేశారు. ఏఎస్పీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి 13 ఫిర్యాదులు అందాయి. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్బీ, నగర , మహిళా డీఎస్పీలు ఎన్.కోటారెడ్డి, జి.వెంకటరాముడు, కె.శ్రీనివాసాచారి పాల్గొన్నారు. -
సమస్యలపై ఫిర్యాదు చేస్తే తక్షణ పరిష్కారం
ఎస్పీ విశాల్‌గున్నీ నెల్లూరు(క్రైమ్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేస్తే తక్షణమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్లో ఆయన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15 మంది బాధితులు తమ సమస్యలను ఆయనకు ఫోను ద్వారా తెలియజేశారు. స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకొంటామని వారికి హామీ ఇచ్చారు. నగరంలోని చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతానికి చెందిన వాస్తు రామచంద్రయ్య పోలీసు కార్యాలయం వాస్తు సరిగా లేదనీ, దానిని మార్పులు చేయాలని సూచించారు. అనంతసాగరానికి చెందిన విజయకుమార్ తన గేదెలు పోయి నెలలు గడుస్తున్నా కనీస చర్యలు చేపట్టలేదనీ, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన వెంకటేష్ ఆత్మకూరు బస్టాండు వద్ద ఆటోల వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్థంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. బట్వాడిపాలెంకు చెందిన ప్రతాప్ తమ ఇళ్ల ఎదుట నిలిపి ఉంచిన వాహనాల నుంచి కొందరు ఆకతాయిలు పెట్రోల్‌ను దొంగలిస్తోన్నారని, రంగనాయకులుపేటకు చెందిన షాహీద్ సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల అటువైపు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వెంకటాచలం మండలం ఎగువమిట్టకు చెందిన పెంచలయ్య బెల్టుషాపులను తొలగించాలని, గూడూరుకు చెందిన శ్రీనివాసులు తమ ఇంటివద్దనే టపాసులు గోదాములు ఉన్నాయనీ, ప్రతి ఏడాది వారు తమను దీపావళి పండగ చేసుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని తెలిపారు. వీటితో పాటు పలు సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఎస్పీ సత్వరమే న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు బి.శరత్‌బాబు, అదనపు ఎస్పీ కె.సూరిబాబు, నగర డీఎస్పీ జి.వెంకటరాముడు, ఎస్బీ డీఎస్పీ కోటారెడ్డి, ఎస్బీ ఇన్స్పెక్టర్ సి.మాణిక్యరావు, ఎస్ఐ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఎస్పీకి 30 ఫిర్యాదులు
నెల్లూరు(క్రైమ్): జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. ఎస్పీ విశాల్‌గున్నీ అందుబాటులో లేకపోవడంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, నగర డీఎస్పీ జి. వెంకటరాముడులు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా బెల్టుషాపులు, ట్రాఫిక్ సమస్యలు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఇలా 30ఫిర్యాదులు అందాయి. దగదర్తికి చెందిన ఎస్.శ్రీనివాసులురెడ్డి, కోటమండలం చిట్టేడుకు చెందిన వెంకటేశ్వర్లు తమ ప్రాంతాల్లో బెల్టుషాపులు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముత్తుకూరుకు చెందిన కృష్ణయ్య కృష్ణపట్నం పోర్టు పామాయిల్ ఫ్యాక్టరీల వద్ద లారీలు ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లుతోందన్నారు. నగరానికి చెందిన విజయప్రకాష్ నగరంలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని చెప్పారు. నిప్పోసెంటర్కు చెందిన మహేశ్వరి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా పోలీసులకు ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకోవాల్సిన వారు నిందితులకు కొమ్ముకాస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వింజమూరుకు చెందిన కన్నయ్య, కోటకు చెందిన సుధాకర్ పోలీసుస్టేషన్లో న్యాయం జరగడం లేదనీ, కేసులు నమోదుచేశారే కాని ఇంతవరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ ఎన్.కోటారెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ సి. మాణిక్యరావు, ఎస్ఐ బి.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
సమస్యలను పరిష్కరించండి సారూ..
డయల్ యువర్ ఎస్పీలో బాధితుల మొర నెల్లూరు(క్రైమ్): తమ సమస్యలను సత్వరమే పరిష్కరించి న్యాయం చేయాలంటూ పలువురు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్పీ విశాల్‌గున్నీ అందుబాటులో లేకపోవడంతో గురువారం నెల్లూరు రూరల్, నగర డీఎస్పీలు డాక్టర్ తిరుమలేశ్వర్‌రెడ్డి, వెంకటరాముడు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యలు.. నగరంలో ట్రాఫిక్ పరిస్థితి దయనీయంగా ఉందని, ఆర్టిసీ బస్టాండ్ వద్ద పరిస్థితి అధ్వానంగా ఉందని నగరానికి చెందిన జిలానీ ఫిర్యాదు చేశారు. గంటల తరబడి ఆటోలను రోడ్లపై నిలిపేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు ఒక్కోసారి అంబులెన్స్‌లు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని చెప్పారు. కోవూరుకు చెందిన కోటేశ్వరరావు తన ఇంట్లో 2012లో దొంగతనం జరిగిందని, ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన రాజేష్‌కుమార్ తన సెల్‌ఫోన్ చోరీ విషయాన్ని, కసుమూరుకు చెందిన ఓ వివాహిత తన కాపురాన్ని చక్కదిద్దాలని ఫిర్యాదు చేశారు. పరిశీలించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఎస్బీ ఎస్సై శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
ఎర్రచందనం అడ్డుకట్టకు తొలి ప్రాధాన్యత మరింత పటిష్టంగా డయల్ యువర్ ఎస్పీ కౌంటర్ కేసుల్లో విచారణ పటిష్టంగా ఉండాలి జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పలమనేరు: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని పలు పోలీస్స్టేషన్ల సందర్శనలో భాగంగా శుక్రవారం ఆయన పలమనేరులోని అటవీశాఖ అతిథి గృహంలో విలేకరుల సమావేశం నిర్వహించా రు. తాను జిల్లా ఎస్పీగా కొత్తగా విధుల్లో చేరినందున పోలీస్స్టేషన్లు, సిబ్బందితో పరిచయం కోసం జిల్లా మొత్తం తిరుగుతున్నట్టు తెలిపారు. అందరూ నాకెందుకులే అనుకోకుండా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే నేరాలు అదుపులోకి వస్తాయన్నారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ అయ్యే ప్రసక్తే లేదన్నారు. వివిధ పోలీస్స్టేషన్లలో క్రైమ్ వివరాలను అధ్యయనం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. దీనిపై జిల్లాలోని సిబ్బందితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామన్నారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఓ యాక్షన్ ప్లాన్‌ను తయారు చేస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందిని పూర్తిగా తగ్గించేందుకు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరముందన్నారు. అందుకే తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణతో పాటు డ్రైవర్లలో చైతన్యం తీసుకొస్తామన్నారు. దీనికి ప్రజల నుంచి సహకారం ఉండాలన్నారు. ఇసుక అక్రమ రవాణాపై తమ వద్ద సమాచారం ఉందని, దీనిపై పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటు కర్ణాటక, అటు తమిళనాడుకు ఎర్రచందనం తరలకుండా పూర్తి స్థాయి లో నిఘా పెట్టామని ఎస్పీ తెలిపారు. తమ ముందున్న సవాళ్లలో మొదటి ప్రాధాన్యం ఎర్రచందనం స్మగ్లింగ్ ను అరికట్టడమేనన్నారు. భవిష్యత్తులో సైబర్ క్రైమ్, కమ్యూనిటీ పోలిసింగ్ తదితరాలకు స్థలాల సమస్య ఏర్పడుతుందన్నారు. అందుకే జిల్లాలోని పోలీస్ ఆస్తులను ఈ అవసరాల కోసం ఉపయోగించుకునేలా పథకం సిద్ధం చేశామన్నారు. ఇక కౌంటర్ కేసుల విషయంలో బాధితులకు న్యాయం జరిగేలా పోలీసుల విచారణ పటిష్టంగా ఉండాలన్నారు. ఎవరు ఫిర్యాదు ఇచ్చినా దాన్ని స్వీకరించాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (ఐవో)పై ఉంటుందన్నారు. అయితే విచారణలో తప్పుడు కేసులను రెఫర్ చేయాలని ఆయన సూచించారు. ఇలాంటి కేసులను తాము 98 వరకు గుర్తించి వాటిని రెఫర్ చేశామని పలమనేరు డీఎస్పీ హరినాథరెడ్డి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమ్నాన్ని మరింత పటిష్టంగా నిర్వహిస్తామని ఎస్పీ చెప్పారు. గత ఎస్పీ ప్రవేశపెట్టిన అన్ని కార్యక్రమాలు ఖచ్చితంగా అమలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఎస్పీ వెంట పలమనేరు, గంగవరం సీఐలు బాలయ్య, రామక్రిష్ణ, ఎస్ఐలు రవినాయక్ తదితరులు ఉన్నారు. -
డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదుల వెల్లువ
చిత్తూరు (అర్బన్): చిత్తూరు నగరంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బుధవారం సన్నిహితం సీఐ చిన్నగోవిందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు ఇలా ఉన్నాయి. ములకలచెరువు మండలం పాతకోట గ్రామంలో తాము ఇల్లు కట్టుకుంటుంటే అన్వర్ సాహెబ్ కుమారులు అడ్డుకుంటున్నారని సోంపల్లెకు చెందిన అబ్దుల్లా ఫిర్యాదు చేశాడు. గుర్రంకొండ గ్రామంలో తన కిరాణా షాపులో రూ.35 వేలు చోరీ జరిగితే ఇంతవరకు రికవరీ చేయలేదని మహ్మద్ ఫిర్యాదు చేశాడు. గన్ రెన్యువల్ చేయాలని పుంగనూరుకు చెందిన కోటేశ్వరరెడ్డి కోరారు. సదుంకు చెందిన మొహక్ గ్రామంలో భూమిని ఆక్రమించుకున్నాడని ఫిర్యాదు వచ్చింది. వాల్మీకిపురంలోని సాకిరేపల్లెలో బాబు, ద్వారక నిత్యం గొడవలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. తనపై పోలీసులు అక్రమంగా కేసు పెట్టారని ములకలచెరువుకు చెందిన అమర్నాథరెడ్డి ఫిర్యాదు చేశారు. అదనపు కట్నం కోసం తమ కుమార్తెను భర్త వేధిస్తున్నాడని చిత్తూరు నగరం కట్టమంచికి చెందిన వరలక్ష్మి ఫిర్యాదు చేశారు. కార్వేటినగరంలో పెండింగ్‌లో ఉన్న అరెస్టు వారెంట్లను పోలీసులు అమలు చేయడంలేదని ఫిర్యాదు వచ్చింది. చోరీ కేసులో నగదు రికవరీ చేయాలని పుంగనూరుకు చెందిన ఆంజప్ప ఫిర్యాదు చేశారు. బంగారుపాళెం మండలంలోని తుంబకుప్పంలో బెల్టుషాపులు రద్దు చేయాలని ఫిర్యాదు వచ్చింది. ఎర్రావారిపాళెంలో వేణు సైకోలా ప్రవర్తిస్తున్నాడని స్థానికులు ఫిర్యాదు చేశారు. విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక వ్యక్తి మోసం చేశాడని పెనుమూరుకు చెందిన హనుమంతకుమార్ ఫిర్యాదు చేశారు. మదనపల్లెలోని ఓ కళాశాల ప్రిన్సిపాల్ మద్యం తాగివచ్చి విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు వచ్చింది. చేనేతలకు రుణాలు ఇప్పిస్తానని మదనపల్లెకు చెందిన త్యాగరాజు, నాగరాజు, పురుషోత్తం మోసం చేశారని స్థానికులు ఫిర్యాదు చేశారు. సదుం మండలం చిరుకువారిపల్లెలో బెల్టుషాపులు అరికట్టాలని, తిరుపతి కి చెందిన రాజారెడ్డి పేపరు పెడతానని చెప్పి రూ.20 వేలు తీసుకుని పారిపోయాడని, తన భర్త రమణ అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని గుడుపల్లెకు చెందిన జ్యోతి, మదనపల్లెకు చెందిన ఓ మొబైల్ దుకాణంపై ఉన్న అరెస్టు వారెంట్లు అమలు చేయాలని స్థానికులు ఫిర్యాదు చేశారు. ములకలచెరువులో ఓ కేసులో ముద్దాయిగా ఉన్న మహేశ్వరరెడ్డిని పోలీ సులు అరెస్టు చేయలేదని విమలమ్మ ఫిర్యాదు చేసింది. తన తల్లిని గుర్తుతెలియని వ్యక్తులు చంపారని, ఈ కేసును ఇంతవరకు ఛేదించలేదని మృతురాలి కుమార్తె జ్యోతి ఫిర్యాదు చేసింది. -
బెదిరిస్తున్నారని ఫిర్యాదు
చిత్తూరు (క్రైమ్), న్యూస్‌లైన్: ‘నాకు ఓటు వేయలేదంటే నీతోపాటు మీ కుటుంబాన్ని హతమార్చుతానని’ ఎంపీటీసీ అభ్యర్థి బెదిరిస్తున్నారని నాగలాపురానికి చెందిన గురవయ్య అనే వికలాంగుడు డయల్ యువర్ ఎస్పీకు ఫిర్యాదు చేశాడు. బుధవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగళాలో నిర్వహించిన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను సన్నిహితం సీఐ చిన్నగోవిందు స్వీకరించారు. సత్యవేడు మండలం నాగలాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా మణి అనే అతను సీపీఎం తరఫున పోటీ చేస్తున్నాడని, ఓటు వేయకపోతే చంపుతానని బెదిరించాడని గుర వయ్య ఫిర్యాదు చేశాడు. రక్షణ కల్పించాలని డయల్ యువర్ ఎస్పీకు విన్నవించాడు. పలమనేరు సినిమా హాల్స్ ఓనర్లందరూ సిండికేట్‌గా మారి, రె ట్టింపు ధరలతో సినిమా టికెట్లను విక్రయిస్తూ ప్రేక్షకులను దగా చేస్తున్నారని ఫిర్యాదు అందింది. నగరి పట్టణంలో రికార్డులు లేని తమిళనాడుకు చెందిన వాహనాలు యథేచ్చగా తిరుగుతున్నాయని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదు చేశారు. కుప్పం మండలంలోని కంగుంది, రామకుప్పం మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు మద్యం తరలిస్తున్న వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు పెట్టకుండా వదిలేశారని ఫిర్యాదు అందింది. కలికిరి, రొంపిచెర్ల గ్రామాల్లో నాటుసారా విక్రయూలు జోరుగా సాగుతున్నాయని, రామకుప్పం వైన్‌షాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. వీటితోపాటు సివిల్ తగాదాలు, కుటుంబ సమస్యలు తదితర వాటితో పాటు మొత్తం 20 ఫిర్యాదులు అందాయి. -
ఉద్యోగాల పేరుతో కుచ్చుటోపీ
=డయల్ యువర్ ఎస్పీకి బాధితుల ఫిర్యాదు =మొత్తం 32 ఫిర్యాదులు చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: ఉద్యోగాల పేరుతో డబ్బు వసూలు చేసి చేతులెత్తేశారని బాధితులు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్రైమ్ సీఐ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. చిత్తూరు నగరంలోని గిరింపేటలో విక్టియా సొల్యూషన్స్ అనే సంస్థ నిర్వాహకులు ఉద్యోగాలు తీసిస్తామని ఆశచూపి పలువురు నిరుద్యోగుల నుంచి డబ్బు వసూలు చేశారు. డబ్బు కట్టినా ఉద్యోగాలు చూపకుండా కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. దీంతో ఆనుమానం వచ్చి యాజమాన్యాన్ని నిలదీస్తే ఉద్యోగాలు తీసివ్వలేమని చేతులెత్తేశారు. వారిపై చర్యలు తీసుకుని తమ డబ్బు తిరిగి ఇప్పించాలని బాధితులు కోరారు. చిత్తూరు-పలమనేరు జాతీయ రహదారిలోని డాబాహోటళ్ల వద్ద రోడ్డుకిరువైపులా భారీ కంటైనర్లను నిలిపివేస్తుండటంతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక నిత్యం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వాహనదారులు ఫిర్యాదు చేశారు. పూతలపట్టు మండలంలోని అయ్యప్పగారిపల్లె సమీపంలో ఉన్న ఇనుప ఫ్యాక్టరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలతో అనారోగ్యం పాలవుతున్నామని ఆ గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. శాంతిపురం మండలంలోని పలు రహదారుల్లో రోడ్లకిరువైపులా ఉన్న భారీ వృక్షాలను కొందరు రాత్రికి రాత్రే నేలకూల్చి మాయం చేస్తున్నారని అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరారు. వరదయ్యపాళెం, బంగారుపాళెం, పాలసముద్రం పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ విచ్చలవిడిగా సాగుతోంది. ఆ ప్రాంతంలో సారా బారిన పడి నిరుపేదల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ఆ ప్రాంతాల్లో సారాతయారీ దారులపై చర్యలు తీసుకోవాలని పలువురు మహిళలు విన్నవించారు. వీటితో పాటు ఇసుక అక్రమరవాణా, బెల్టుషాపులు, ఆస్తి తగాదాలు, కోర్టుపరిధిలో ఉన్న కేసులు కలిపి మొత్తం 32 ఫిర్యాదులు అందాయి. -
పాఠశాల పక్కనే టపాకాయల గోడౌన్లు
చిత్తూరు(క్రైమ్), న్యూస్‌లైన్: పాఠశాల పక్కనే టపాకాయలను పెద్దసంఖ్యలో నిల్వ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రులు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవా రం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. ఫిర్యాదులను క్రైమ్ సీఐ జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. చిత్తూరు నగరంలోని గాంధీరోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాల పక్కనే టపాకాయల నిల్వలు ఉంచి విక్రయిస్తున్నారన్నారని ఫిర్యాదు చేశారు. ఒక వేళ ఏదైనా ప్రమాదం సంభవిస్తే విద్యార్థుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఈ టపాకాయల గోడౌన్ పై గతంలోనే ఫిర్యాదులు చేశామన్నారు. వారిపై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో గోడౌన్ నిర్వాహకులు తమపై దౌర్జన్యాలకు దిగుతున్నారన్నారు. ఇప్పటికైనా అధికారులు వారిపై క ఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు విన్నవించారు. తమ వాహనం చోరీకి గురై కుప్పంలో ప్రత్యక్షమైందని, దానిని ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కేరళ రాష్ట్రం కొచ్చిన్‌కు చెందిన అశోక్ అనే వాహన యజమాని ఫిర్యాదు చేశాడు. గుర్రంకొండ మండలం మర్రిపాడు గ్రామంలో ఓ ఆర్ఎంపీ డాక్టర్ రోగులకు కాలంచెల్లిన మందుల ను పంపిణీ చేయడంతో, చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, సకాలంలో వైద్యం చేయించుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని అతడిపై చర్యలు తీసుకోవాలని ఆ ప్రాంతవాసులు విన్నవించారు. పుంగనూరు మండలంలోని మేలిపట్ల, రాంపల్లె గ్రామాల్లోని అంగన్వాడీ సెంటర్లలో పౌష్టిక ఆహారం పక్కదోవ పడుతోందని మహిళలు ఫిర్యాదు చేశారు. పీలేరు సబ్జైల్లో ఉన్న ఖైదీలను చూడటానికి వెళ్తే, అక్కడున్న సిబ్బంది రూ.1000 లంచం డిమాండ్ చేస్తున్నారని ఖైదీల బంధువులు వాపోయారు. గంగాధరనెల్లూరు మండలం కొట్రకోన సర్పంచ్ ఇసుక రవాణా అనుమతి కోసం డబ్బు డిమాం డ్ చేస్తున్నారని ఫిర్యాదు అందింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద ఉన్న పెట్రోల్ బంక్‌లో మూడు రోజుల క్రితం 10హెచ్05 ఏఎం1605 నెంబర్ లారీ ఆపి డీజల్ నింపుకుని, కత్తి చూపించి బెదిరించి డబ్బు ఇవ్వకుండా వెళ్లారని బాధిత పంప్ ఆపరేటర్ ఫిర్యాదు చేశాడు. పుత్తూరు, పుంగనూ రు పట్టణాల్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని వాహనదారులు, ప్రజలు ఫిర్యాదు చేశారు. వీటితో పా టు మొత్తం 35 ఫిర్యాదులు అందాయి. -
లిఫ్ట్ అడిగితే నగలు దోచుకున్నారు
చిత్తూరు (క్రైమ్),న్యూస్‌లైన్ : లిఫ్ట్ అడిగితే కారులో బంధించి ఆభరణాలు దోచుకున్నారని వీ.కోటకు చెందిన ఉపాధ్యాయురాలు డయల్ యువర్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం ఎస్పీ బంగ్లాలో డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిం చారు. వీ.కోటకు చెందిన ఉపాధ్యాయురాలు అదే మండలంలోని లింగాపురం పాఠశాలలో పనిచేస్తోంది. ఈనెల 14వ తేదీన బంద్ కారణంగా బస్సులు రాకపోవడంతో వీ.కోట బస్టాప్ వద్ద కారును ఆపి లిఫ్ట్ ఇవ్వాలని కోరింది. కారు ఎక్కి కొంతదూరం వెళ్లేసరికి అం దులోని ముగ్గురు వ్యక్తులు ఆమె నోట్లో గుడ్డకుక్కి బంగారు ఆభరణాలు దోచుకుని మార్గమధ్యంలో వదిలేసి వెళ్లిపోయారు. అదేరోజు ఆమె వీ.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్వేటినగరానికి చెందిన కానిస్టేబుల్ సిద్ద య్య లంచాలు ఇవ్వాలని, అదే స్టేషన్లో పనిచేసే మరో కానిస్టేబుల్ రాజ్‌కుమార్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, బంగారుపాళ్యం మండలం దొరచెరువు వద్ద ఏకాంబరనాయుడు డాబా నడుపుతూ ఆయిల్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నాడని ఫిర్యాదులు వచ్చాయి. మదనపల్లె చిప్పిలి ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోందని మహిళలు ఫిర్యాదు చేశారు. తన భర్తపై కొంతమంది దాడిచేసి గాయపరిచినా పోలీసులు పట్టించుకోలేదని గంగవరానికి చెందిన మహిళ తెలి పింది. చిత్తూరులో సమైక్యవాదుల ముసుగులో కొంతమంది కోర్టు ఎదురుగా ఉన్న వీధిలో రోడ్డుపై సీసాలు పగులగొట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదు అందింది. సదుం ఎంపీడీవో కార్యాలయం పరిసరాల్లో వెంకటప్ప సారా అమ్ముతున్నాడని ఆ ప్రాం త వాసులు ఫిర్యాదు చేశారు. చిత్తూరు నుంచి తిరుపతికి బదిలీ చేయడంతో డ్యూటీ చేయడానికి ఇబ్బంది పడుతున్నామని హోమ్‌గార్డు ఫిర్యాదు చేశారు. పుంగనూరులో తన భర్త రమణారెడ్డి వ్యభిచార గృహానికి వెళుతున్నాడని, తననూ ఆ వృత్తిలోకి రావాలని వేధిస్తున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఇసుక అక్రమ రవాణా, సారా విక్రయాలు, బెల్టుషాపుల ఆగడాలు, వరకట్న వేధింపులు తదితరాలతో కలిసి 25 మొత్తం ఫిర్యాదులందాయి.