డయల్ యువర్ ఎస్పీకి 30 ఫిర్యాదులు
డయల్ యువర్ ఎస్పీకి 30 ఫిర్యాదులు
Published Fri, Oct 7 2016 12:50 AM | Last Updated on Tue, Mar 19 2019 6:59 PM
నెల్లూరు(క్రైమ్):
జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం జరిగింది. ఎస్పీ విశాల్‌గున్నీ అందుబాటులో లేకపోవడంతో నెల్లూరు రూరల్ డీఎస్పీ డాక్టర్ కె.తిరుమలేశ్వర్‌రెడ్డి, నగర డీఎస్పీ జి. వెంకటరాముడులు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రధానంగా బెల్టుషాపులు, ట్రాఫిక్ సమస్యలు, పోలీసులు నిందితులకు కొమ్ముకాస్తున్నారని ఇలా 30ఫిర్యాదులు అందాయి. దగదర్తికి చెందిన ఎస్.శ్రీనివాసులురెడ్డి, కోటమండలం చిట్టేడుకు చెందిన వెంకటేశ్వర్లు తమ ప్రాంతాల్లో బెల్టుషాపులు పచ్చని సంసారాల్లో చిచ్చురేపుతున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముత్తుకూరుకు చెందిన కృష్ణయ్య కృష్ణపట్నం పోర్టు పామాయిల్ ఫ్యాక్టరీల వద్ద లారీలు ఇష్టారాజ్యంగా నిలపడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం వాటిల్లుతోందన్నారు. నగరానికి చెందిన విజయప్రకాష్ నగరంలో ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నాయని చెప్పారు. నిప్పోసెంటర్‌కు చెందిన మహేశ్వరి భర్త వేధింపులకు గురిచేస్తున్నారని మహిళా పోలీసులకు ఫిర్యాదుచేస్తే చర్యలు తీసుకోవాల్సిన వారు నిందితులకు కొమ్ముకాస్తోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వింజమూరుకు చెందిన కన్నయ్య, కోటకు చెందిన సుధాకర్ పోలీసుస్టేషన్‌లో న్యాయం జరగడం లేదనీ, కేసులు నమోదుచేశారే కాని ఇంతవరకూ నిందితులను అరెస్ట్ చేయలేదని ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో ఎస్‌బీ డీఎస్పీ ఎన్.కోటారెడ్డి, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సి. మాణిక్యరావు, ఎస్‌ఐ బి.సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement