సమస్యలపై ఫిర్యాదు చేస్తే తక్షణ పరిష్కారం
-
ఎస్పీ విశాల్‌గున్నీ
నెల్లూరు(క్రైమ్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రజలు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేస్తే తక్షణమే పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ విశాల్‌గున్నీ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని తన చాంబర్‌లో ఆయన డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 15 మంది బాధితులు తమ సమస్యలను ఆయనకు ఫోను ద్వారా తెలియజేశారు. స్పందించిన ఎస్పీ తగిన చర్యలు తీసుకొంటామని వారికి హామీ ఇచ్చారు. నగరంలోని చిల్డ్రన్స్‌పార్కు ప్రాంతానికి చెందిన వాస్తు రామచంద్రయ్య పోలీసు కార్యాలయం వాస్తు సరిగా లేదనీ, దానిని మార్పులు చేయాలని సూచించారు. అనంతసాగరానికి చెందిన విజయకుమార్ తన గేదెలు పోయి నెలలు గడుస్తున్నా కనీస చర్యలు చేపట్టలేదనీ, స్టోన్‌హౌస్‌పేటకు చెందిన వెంకటేష్ ఆత్మకూరు బస్టాండు వద్ద ఆటోల వల్ల ట్రాఫిక్ పూర్తిగా స్థంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదు చేశారు. బట్వాడిపాలెంకు చెందిన ప్రతాప్ తమ ఇళ్ల ఎదుట నిలిపి ఉంచిన వాహనాల నుంచి కొందరు ఆకతాయిలు పెట్రోల్‌ను దొంగలిస్తోన్నారని, రంగనాయకులుపేటకు చెందిన షాహీద్ సింహపురి బార్ అండ్ రెస్టారెంట్ వల్ల అటువైపు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వెంకటాచలం మండలం ఎగువమిట్టకు చెందిన పెంచలయ్య బెల్టుషాపులను తొలగించాలని, గూడూరుకు చెందిన శ్రీనివాసులు తమ ఇంటివద్దనే టపాసులు గోదాములు ఉన్నాయనీ, ప్రతి ఏడాది వారు తమను దీపావళి పండగ చేసుకోనివ్వకుండా అడ్డుకొంటున్నారని తెలిపారు. వీటితో పాటు పలు సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. స్పందించిన ఎస్పీ సత్వరమే న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీలు బి.శరత్‌బాబు, అదనపు ఎస్పీ కె.సూరిబాబు, నగర డీఎస్పీ జి.వెంకటరాముడు, ఎస్‌బీ డీఎస్పీ కోటారెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ సి.మాణిక్యరావు, ఎస్‌ఐ బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.