‘తెలుగు’ దివ్వె వెలుగులీనాలి! | End of world telugu meetings at vijayawada | Sakshi
Sakshi News home page

‘తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!

Published Mon, Feb 23 2015 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 9:44 PM

‘తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!

‘తెలుగు’ దివ్వె వెలుగులీనాలి!

* తెలుగు రచయితల మహాసభల్లో భాషాభిమానుల పిలుపు
* మన భాషకు గౌరవం లేనప్పుడు జీవితానికి అర్థంలేదని వ్యాఖ్య
* న్యాయస్థానాల్లోనూ తెలుగులో పాలన జరగాలి
* మన రచనలు తెలుగుకే పరిమితం కాకూడదు
* ముగిసిన ప్రపంచ తెలుగు మహాసభలు

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష వెలుగులీనాలని, ప్రతి తెలుగువాడూ మాతృభాషకు సేవ చేసేలా చైతన్యం పురివిప్పాలని, తెలుగు భాషాభిమానులు, పలువురు ప్రముఖులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో పిలుపునిచ్చారు. విజయవాడలో రెండు రోజులుగా జరుగుతున్న ఈ మహాసభల ముగింపు వేడుక ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. తెలుగు భాషకు సొబగులద్దిన అతిరథ మహారథులతోపాటు వివిధ రంగాల్లో తెలుగుకు సేవచేస్తున్న ప్రముఖులూ హాజరై తెలుగు ప్రాభవాన్ని చాటిచెప్పారు. ఈ సందర్భంగా భాషా సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లోనూ సాహిత్య, లలిత కళలు, సంగీత సంస్థ(అకాడమీ)లు ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మానవ వనరుల శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థలో తీసుకువస్తున్న మార్పుల్లో తెలుగుకు ప్రాధాన్యత గురించి పెద్దలతో చర్చిస్తామని తెలిపారు.
 
  2017లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను విశాఖపట్నంలో నిర్వహించాలని కోరగా అందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అంగీకరించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి శివారెడ్డి మాట్లాడుతూ.. ఏ లక్ష్యంతో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించారో అది ఇప్పటికీ నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తొలుత కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ విశ్వనాథ్‌ప్రసాద్ తివారీ, కే శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. కేంద్ర సాహిత్య అకాడమీ మాదిరిగానే రాష్ట్రంలోనే సాహిత్య అకాడమీ ఉండాలని సూచించారు. దేశంలో వెయ్యి భాషలుండగా కొన్నింటికి లిపి లేదని అయినా వాటిని పరిరక్షించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహాసభలను దిగ్విజయంగా నిర్వహించిన మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌లు, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారావు, జీవీ పూర్ణచంద్‌లను పలువురు ప్రశంసించారు. సభలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.  
 
   తెలుగుకే పరిమితం కాకూడదు
 రాష్ట్ర విభజనకు ముందు నిధులు, నీరు, నియామకాలు, భాషపై చర్చలు జరిగాయి. తెలుగు ప్రజల్ని ఐక్యంగా ఉంచాల్సిన భాష.. అనైక్యతకు దారితీసింది. తెలుగు మాతృభాషగా ఉన్నవారంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముంది. ఇతర దేశాలు, రాష్ట్రాలు,  ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కలిపే వారధి గా తెలుగు వెలగాలి. పత్రికలు, ప్రసార మాధ్యమాలు(టీవీ) ఒకపక్క తెలుగుకు సేవ చేస్తూనే మరోపక్క ద్రోహం కూడా చేస్తున్నా యి. తెలుగు కంటే ఆంగ్లం శక్తిమంతంగా ఉం టుందని ఆ భాషలోని పేర్లే వాడుతున్నాయి. కానీ.. ఆంగ్లం కంటే తెలుగే శక్తిమంతమైంది. తెలుగు కవితలు, రచనలు కేవలం తెలుగుకే పరిమితం కాకూడదు. హిందీ సహా ఇతర భాషల్లోకి అనువాదం కావాలి. అలా జరిగితే మనకు నాలుగో జ్ఞానపీఠ్ కూడా రావచ్చు.
     - కె.రామచంద్రమూర్తి, సాక్షి, ఈడీ  
 
 తెలుగు కవిత్వం విడిపోరాదు
 తెలుగు రచనలు, కవిత్వం ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, గుంటూరుగా విడిపోకూడదు. బమ్మెర పోతన కవితలు ఆయనలోని అసామాన్యమైన కోణాన్ని ఆవిష్కరించాయి. కవుల మధ్య జరిగే గొడవలు కూడా ఎంతో కవితాత్మకంగా ఉంటాయి. (ఈ సందర్భంగా విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీల మధ్య కవితలతో పడిన ఘర్షణను వినిపించారు)
      - బ్రహ్మానందం, హాస్య నటుడు
 
 తెలుగు నామఫలకం తీసేయమన్నారు
 ప్రజల మధ్య వైషమ్యాలను హరించి జగతిని ఏకం చేసేది భాషే. న్యాయస్థానాల్లో న్యాయం తీరు ఎలా ఉంటుందో 2 పేరాల్లో విశ్లేషించిన అద్భుత రచయిత రాచకొండ విశ్వనాథశాస్త్రికి సరైన గౌరవం దక్కలేదు. తెలుగు నేలపై పుట్టడం ఆయన దురదృష్టం. ఢిల్లీలో నాకు కేటాయించిన బంగళా ప్రవేశ ద్వారానికి తెలుగులో నామఫలకం పెట్టుకుంటే.. ఒక అనుభవశాలియైన(సీనియర్) న్యాయమూర్తి వెంటనే తీసేయమని సూచించారు. కానీ నేను ఒప్పుకోలేదు. అంతేకాదు నేను ఢిల్లీలో ఉన్నంతకాలం ఆ ఫలకం ఉంటుందని చెప్పాను. మన భాషకు గౌర వం, గుర్తింపు లేనప్పుడు మన జీవితానికే అర్థంలేదు. అన్ని పత్రికల్లోనూ పాత నవలలను పరిచయం చేసే ప్రయత్నం చేయాలి. తెలుగువాళ్లు పరస్పరం తెలుగులోనే మాట్లాడుకోవాలి. పిల్లలతో సంభాషణ తెలుగులోనే జరపాలి. ప్రాథమిక విద్యను తెలుగులోనే చెప్పించాలి. భాషాభివృద్ధికి తెలుగు పత్రికలు ఎంతో తోడ్పడుతున్నాయి. కె.రామచంద్రమూర్తిగారు(సాక్షి, ఎడిటోరియల్ డెరైక్టర్) హెచ్‌ఎం టీవీలో ఉండగా భాషాభివృద్ధికి ఎంతగానో పాటుబడ్డారు.  
     - జస్టిస్ ఎన్.వి.రమణ,
     సుప్రీంకోర్టు న్యాయమూర్తి

Advertisement
Advertisement