1104 విద్యుత్ ఉద్యోగుల సంఘ రీజనల్ కార్యదర్శి గోపాలరావు
సాక్షి, అరసవల్లి: ‘పవర్’ ఫుల్‌గా వేటు పడింది... నిందితులకు ‘షాక్’ ట్రీట్‌మెంట్ ప్రారంభమైంది. గ్రామ సచివాలయ పోస్టుల్లో అక్రమాలకు పాల్పడితే సహించబోమని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన విధంగానే... అలాంటి వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు. జిల్లాలో విద్యుత్ లైన్‌మన్ (జేఎల్‌ఎం) పోస్టుల వ్యవహారంలో చక్రం తిప్పేందుకు యత్నించిన దళారీ గ్యాంగ్‌లో ప్రధాన వ్యక్తిగా భావిస్తున్న వ్యక్తిపై తొలి వేటు పడింది. నిరుద్యోగుల నుంచి వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక సర్కిల్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్, 1104 విద్యుత్ యూనియన్ రీజనల్ సెక్రటరీ ఎం.వి.గోపాలరావు (గోపి)పై ఉన్నతాధికారులు గురువారం చర్యలకు ఉపక్రమించారు.
ఈపీడీసీఎల్ సంస్థ పరువుకు సంబంధించిన విషయంగా దీన్ని సీరియస్‌గా భావించిన కార్పొరేట్ ఉన్నతాధికారులు నిందితుడిగా భావిస్తున్న గోపాలరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. గురువారం విశాఖపట్నంలో కార్పొరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమీక్షలో సీఎండీ ఎస్.నాగలక్ష్మి ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో గురువారం సాయంత్రం నుంచే సస్పెన్షన్ అమల్లోకి వచ్చేలా సర్కిల్ ఎస్‌ఈ ఎన్.రమేష్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈపీడీసీఎల్ అధికారుల ఫిర్యాదు మేరకు నమోదైన క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్నందున గోపాలరావును సస్పెండ్ చేస్తున్నట్టు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇదిలావుంటే ఈనెల 7వ తేదీ నుంచే.. గోపాలరావు పరారీలో ఉన్నారు. సర్కిల్ కార్యాలయానికి సెలవు దరఖాస్తును ఇప్పించే ప్రయత్నం చేసినప్పటికీ ఎస్‌ఈ రమేష్ దీన్ని తిరస్కరించిన సంగతి విదితమే. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోగా.. దళారీ గ్యాంగ్‌లో సహకార పాత్ర పోషించిన పలువురు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. క్రిమినల్ కేసుగా నమోదు చేసిన సీసీఎస్ (క్రైం బ్రాంచ్) పోలీసులు దీన్ని చాలెంజ్‌గా తీసుకుని నిందితులుగా భావిస్తున్న ఎం.వి.గోపాలరావు, శ్రీధర్‌లను పట్టుకునేందుకు చర్యలను వేగవంతం చేశారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దర్యాప్తు ప్రక్రియ కూడా మరింత వేగంగా పరుగులు తీసే అవకాశాలు కన్పిస్తున్నాయి.
సమీక్షలో సీఎండీ సీరియస్
తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) కార్పొరేట్ కార్యాలయంలో గురువారం సీఎండీ ఎస్.నాగలక్ష్మి నిర్వహించిన ప్రత్యేక సమీక్ష వాడీవేడిగా సాగింది. డిస్కం పరిధిలోని ఐదు జిల్లాల్లో జేఎల్‌ఎం పోస్టుల ఎంపిక పరీక్షలన్నీ ప్రశాంతంగా జరిగినప్పటికీ, శ్రీకాకుళం జిల్లాలో దళారీ వ్యవహారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విజిలెన్స్ అధికారులు గుర్తించిన సమాచారం మేరకు మరింత లోతుగా దర్యాప్తు సాగాలని ఆదేశించారు. ఇదిలావుంటే విద్యుత్ శాఖకు చెందిన ఉద్యోగే ఇలాంటి దళారీ వ్యవహారాన్ని నడిపించడంపై వస్తున్న ఆరోపణలపై ఆమె సీరియస్ అయ్యారు.
దళారీ గ్యాంగ్‌లో ఒకరుగా ఆరోపణలున్న సీనియర్ అసిస్టెంట్ ఎం.వి.గోపాలరావుకు సహకరించిన సిబ్బందిని కూడా గుర్తించాలని, ముందుగా గోపాలరావును విధుల నుంచి సస్పెండ్ చేయాలని ఆమె సీరియస్‌గా ఆదేశించారు. దీనిపై సర్కిల్ ఎస్‌ఈ ఎన్.రమేష్ స్పందిస్తూ... పరీక్షలన్నీ పారదర్శకంగానే నిర్వహించామని, అయితే వర్షం కారణంగా కొంతమేరకు ఆలస్యమయ్యాయన్నారు. దీంతో రిజర్వ్ డేట్‌లో కూడా కొందరికి పరీక్షలు పెట్టి ప్రక్రియను ముగించామన్నారు. జిల్లాలో మొత్తం 679 జేఎల్‌ఎం పోస్టులకు 986 మంది అభ్యర్థులు మూడు పరీక్షల్లో అర్హులుగా నిలిచారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment