
సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ ప్రభుత్వం పుణ్యమా అని ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టుగా ఈపీడీసీఎల్ స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్ల పరిస్థితి ఉంది. ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీల ఓటర్లకు గాలం వేసేందుకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ పేరిట ప్రచారం చేస్తోంది. దీనికయ్యే ఖర్చు మొత్తం ఈపీడీసీఎల్ నిధుల నుంచి మళ్లించడంతో వీరికి జీతాలు నిలిచిపోయాయి. దీంతో ఉగాది పండగ పూట సైతం ఆనందం లేకుండా పోతోందని వాపోతున్నారు.
ఈపీడీసీఎల్ పరిధిలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఈ మీటర్ల నుంచి సుమారు రెండు వేల మంది స్పాట్ బిల్లింగ్ రీడర్లు విద్యుత్ రీడింగ్‌ను నమోదు చేస్తుంటారు. వీరికి ప్రతినెలా పీస్ రేటు కింద, ఈ కాంట్రాక్టర్లకు సూపర్‌వైజింగ్ చార్జీలు కింద ప్రతినెలా ఒకట్రెండు తేదీల్లో చెల్లింపులు చేస్తోంది. స్పాట్ బిల్లింగ్ రీడర్లకు మీటరుకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐలతో కలుపుకుని దాదాపు రూ.3, కాంట్రాక్టర్లకు రూపాయి చొప్పున ఇస్తోంది. ఇలా నెలకు రీడర్లకు రూ.కోటిన్నర, కాంట్రాక్టర్లకు రూ.55 లక్షలు వెరసి రూ.2 కోట్ల వరకు చెల్లిస్తోంది. అయితే వీరికి మార్చి నెలకు సంబంధించి చెల్లింపులు ఇప్పటివరకు చేయలేదు. ఈపీడీసీఎల్‌లో నిధుల కొరత వల్లే ఈ పరిస్థితికి కారణమని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, నష్టాల్లో ఉన్న ఈపీడీసీఎల్ చెల్లింపులకు అవస్థలు పడుతోంది. గత నెలలో ఒక భారీ పేమెంట్ జరగడంతో ఆ నెల చెల్లింపుల బెడద నుంచి గట్టెక్కినట్టు చెబుతున్నారు.
నిధులు మళ్లించారా?
రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఈ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ముఖ్యమంత్రి దీనిని విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్టు తెలిపే రేడియం స్టిక్కర్లను ముద్రించి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదార్ల ఇళ్లకు అంటించే ప్రక్రియను చేపట్టారు. ఈపీడీసీఎల్ పరిధిలో దాదాపు 10 లక్షల ఎస్సీ, ఎస్టీ కనెక్షన్లున్నాయి. వీటికయిన ఖర్చుకు ఈపీడీసీఎల్ నిధులు మళ్లించినట్టు చెబుతున్నారు. దీంతో స్పాట్ బిల్లింగ్ రీడర్లు, కాంట్రాక్టర్లకు చెల్లింపులకు ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఈపీడీసీఎల్ సీజీఎం (ఎక్స్‌పెండిచర్) జీ శ్రీనివాసరెడ్డిని వివరణ కోరగా గురువారం చెల్లింపులకు అవసరమైన చర్యలు చేపట్టామని, లెటరాఫ్ క్రెడిట్ (ఎల్‌వోసీ)లు ఇచ్చామని, నిధులకు ఇబ్బంది లేదని తెలిపారు. అయితే దీనిని కాంట్రాక్టర్లు, స్పాట్ బిల్లింగ్ రీడర్లు ఖండిస్తున్నారు. ఇప్పటికీ కార్పొరేట్ కార్యాలయం నుంచి ఎల్‌వోసీలు విడుదల కాలేదని, శుక్ర, శని, ఆదివారాలు బ్యాంకులకు వరుస సెలవులు కావడంతో సోమ, మంగళవారాల వరకు చెల్లింపుల ప్రక్రియ చేసే అవకాశం లేదని వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment