కొల్లేరులో కాసుల వేట!
- అభయారణ్యంలో అడ్డగోలుగా చేపల సాగు
- రూ.1.60కోట్ల విలువైన చేపల పట్టివేత
- అడ్డుకోలేని అటవీ శాఖ అధికారులు
- ఎన్నికల తర్వాత పట్టపగలే పట్టుబడులు
కైకలూరు : కొల్లేరు అభయారణ్యంలో అక్రమంగా చేపల సాగుకు అడ్డూ అదుపు లేకుండాపోయింది. యథేచ్ఛగా చేపలు సాగుచేసి పట్టపగలు చేపల ఎగుమతులు చేస్తున్నా అటవీ శాఖ అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కైకలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం స్నానాల రేవుకు సమీపంలోని ముక్కుపెడగా పిలిచే 40 ఎకరాల చెరువులో గురువారం పట్టపగలు చేపల పట్టుబడులు సాగాయి. ఈ చేపల విలువ సుమారు 40లక్షలు ఉంటుంది. కొల్లేరు ఆపరేషన్ సమయంలో ఈ చెరువును ధ్వంసం చేశారు.
గతంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగే ఈ అక్రమ తంతును ఇప్పుడు కొల్లేరు పెద్దల అండదండలతో బహిరంగంగానే కొనసాగిస్తున్నారు. దేవస్థానం వద్దకు ఏకంగా ఓ భారీ లారీని తీసుకువచ్చి దర్జాగా లోడింగ్ చేస్తున్నారు. వడ్లకూటితిప్ప గ్రామ సమీపంలోని 120 ఎకరాల అభయారణ్య చెరువులోనూ రెండు రోజులుగా చేపల లోడింగ్ జరుగుతోంది. ఇక్కడ నుంచి సుమారు రూ.1.20కోట్ల విలువైన మత్స్య సంపదను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం కొల్లేటికోట లాంచీల రేవు వద్ద 50 ఎకరాల తాడిమెట్ట చెరువులో చేపలను పట్టేందుకు అక్కడ పెద్దలు రంగం సిద్ధం చేశారు.
అడ్రస్ లేని అటవీ శాఖ అధికారులు...
కొల్లేరు అభయారణ్యంలో చేపల చెరువులు తవ్వినా, సాగు చేపట్టినా చట్టరిత్యా నేరం. కొల్లేరును పరిరక్షించాల్సిన బాధ్యత అటవీ అధికారులపై ఉంది. కైకలూరు మండలంలో ఓ రే ంజర్ స్థాయి అధికారి, 14 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఒక్క గురువారమే కొల్లేటికోట, వడ్లకూటితిప్పా గ్రామాల్లో పట్టపగలు బహిరంగంగా చేపల పట్టుబడి జరుగుతుంటే కనీసం ప్రశ్నించేందుకు సిబ్బంది రాకపోవడంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
నిరుపయోగంగా చెక్‌పోస్టు
ఆలపాడు వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు నిరుపయోగంగా మారింది. చేపల మేతలతో లారీలు దూసుకుపోతున్నా అడ్డుకునే నాథుడే అక్కడ కరువయ్యాడు. అభయారణ్యంలో పట్టుకున్న చేపలను గుండుగొలును మీదుగా ఏలూరు తరలిస్తున్నారు. వడ్లకూటితిప్ప గ్రామం నుంచి ఆకివీడుకు చేపలు ఎగుమతి చేస్తున్నారు. కొల్లేరులో ఎన్నికల తర్వాత అక్రమాలు తారాస్థాయిలో ఊపందుకున్నాయని, అధికారులు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.
కొల్లేరు కొంప మునగడం ఖాయం !
కొల్లేరు ఆపరేషన్ సమయంలో ధ్వంసం చేసిన చెరువుల స్థానంలో యథావిధిగా చేపల సాగు కొనసాగుతోంది. స్థానిక రెవెన్యూ సిబ్బంది కళ్ల ఎదుటే ఈ తంతు జరుగుతున్నా రాజకీయ నాయకుల ఒత్తిళ్ల కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి లంక గ్రామాల్లో నెలకొంది. కొల్లేరులో నీటి ప్రవాహానికి అక్రమ చేపల చెరువు గట్లు అడ్డుపడటంతో గతంలో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. చేపల చెరువుల తవ్వకాలు కొనసాగితే రానున్న రోజుల్లో మరింత ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అక్రమ పట్టుబడులను అడ్డుకుంటాం : రేంజర్
కొల్లేరు గ్రామాల్లో అక్రమ చేపల పట్టుబడులను అడ్డుకుంటామని రేంజర్ రామ్‌మోహన్ సింగ్ ‘సాక్షి’తో చెప్పారు. తన దృష్టికి ఈ విషయం వచ్చిందని, సిబ్బందిని పంపి నిలుపుదల చేయిస్తానని తెలిపారు.