దోచుకు తినడం టీడీపీ నేతల నైజం
కేంద్ర మాజీ మంత్రి కోట్ల ధ్వజం
డోన్ టౌన్: కాంట్రాక్ట్‌లు, అక్రమ మద్యం వ్యాపారాలు చేసి ప్రజా ధనాన్ని దోచుకుతినే నైజం తమదికాదని టీడీపీ నాయకులకే ఇది వర్తిస్తుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం సాయి ఫంక్షన్‌హాల్‌లో కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గపు ఇన్‌చార్జ్ లక్కసాగరం లక్ష్మిరెడ్డి అధ్యక్షతన కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోట్ల దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అక్రమ కేసులు బనాయించి పార్టీలో చేర్చుకుంటే మనుగడ సాగుతుందనే భ్రమలో టీడీపీ నాయకులు ఉండడం వారి దిగుజారుడు రాజకీయానికి నిదర్శనం అన్నారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు అధికారపార్టీ ఒత్తిళ్లకు తల ఒగ్గకుండా నిలబడ్డారని ఆయన ప్రసంశించారు.
జూన్ నెల అనంతరం నియోజకవర్గంలో గ్రామగ్రామనా పర్యటించి.. కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతామన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించడం, అక్రమకేసుల బనాయించడం.. అధికార పార్టీ నాయకులు మానుకోకపోతే రాబోవురోజుల్లో ఫలితం అనుభవిస్తారని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ హెచ్చరించారు. సమావేశంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ బోరెడ్డి పుల్లారెడ్డి,ప్యాపిలి జెడ్పిటీసీ మాజీ సభ్యుడు సప్తశైల రాజేశ్, కాంగ్రెస్ నాయకులు చిన్నపూజల్లా రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.