మద్యం రక్కసిపై మండిపడ్డ మహిళ
తాటిచెట్లపాలెం(విశాఖ): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన ఎక్సైజ్ పాలసీని వ్యతిరేకిస్తూ అఖిలభారత ప్రజాతంత్ర మహిళాసంఘం(ఐద్వా), ఏపీ మహిళా సమాఖ్య, పలు మహిళా సంఘాలు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపాయి. స్థానిక పోర్టు హాస్పిటల్ నుంచి సాలగ్రామపురం పోర్టు హైస్కూల్ మీదుగా డీఎల్‌బీ కళ్యాణమండపం వరకు ప్రదర్శన నిర్వహించాయి. ‘షాపింగ్‌మాల్స్‌లో మద్యం అమ్మకాలా.. సిగ్గు సిగ్గు’ అంటూ మహిళలు ప్లకార్డులతో నినాదాలు చేశారు. ‘మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దు.. మాకు మంచి నీళ్లు ఇవ్వు బాబూ.. మద్యం దుకాణాలు కాదు’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
ఈ తరుణంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి సహా ఆందోళనలో పాల్గొన్న పలు మహిళా సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బి.ప్రభావతి మాట్లాడుతూ మద్యం వల్ల తల్లి, పిల్ల, చెల్లి అనే ఇంగితం లేకుండా మహిళలపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈతరహా పాలసీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం దారుణమన్నారు. ఏపీ సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల మాట్లాడుతూ మహిళల ఆగ్రహం చవిచూసిన ఏ ఒక్క నాయకుడూ ఎంతో కాలం అధికారంలో నిలవలేదని చంద్రబాబుని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, ఆర్.ఎన్.మాధవి, ఎం.వి.పద్మావతి, సుజాత, పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
పోలీసుల అత్యుత్సాహం
మహిళా సంఘాల నేతలను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు పలువురిపై చేయిచేసుకున్నారు. అరెస్ట్ చేసిన మహిళలను పోలీస్ వాహనాలలో పూర్తిగా ఎక్కించకుండానే వాహన డోర్‌లను గట్టిగా అదమడంతో కొందరు గాయాలపాలయ్యారు. తోపులాటలో కిందపడిన వారిని సైతం పోలీసులు వదిలిపెట్టలేదు. వారికి దెబ్బతగిలి రక్తస్రావం అవుతున్నా పట్టించుకోకుండా అలానే వారిని బలవంతంగా వాహనాల్లోకి నెట్టి తరలించారు.