వీడని సిక్‌ముడి | Exempt employees are paid | Sakshi
Sakshi News home page

వీడని సిక్‌ముడి

Published Tue, Jan 13 2015 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 7:36 PM

వీడని సిక్‌ముడి

వీడని సిక్‌ముడి

ఉద్యోగుల నుంచి డబ్బులు మినహాయించుకుంటున్నా అందని ఈహెచ్‌ఎస్ సేవలు
ప్రైవేటు ఆస్పత్రుల డిమాండ్లపై మెట్టు దిగని ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు

 
లబ్బీపేట : ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన ఈహెచ్‌ఎస్ స్కీం ఇప్పట్లో అందుబాటులోకి వచ్చేలా లేదు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆ స్కీంలోని పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నెల రోజుల్లో పరిష్కరించాలని అల్టిమేటం జారీ చేసినా, ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఒక్క డిమాండ్‌ను కూడా అంగీకరించే పరిస్థితిలో లేరని తెలిసింది. అదేమంటే మీడియాకు లీకులు చేస్తున్నారంటూ ఆస్పత్రుల యాజమాన్యాలనే తప్పుపట్టే ధోరణిలో వ్యవహరిస్తుండడంతో పరిస్థితి మరింత జటిలమవుతోంది. దీంతో ఆ చిక్కుముడి ఇప్పట్లో వీడేలా లేదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, జిల్లాలోని ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రుల్లో సేవలు పొందవచ్చునని ఇటీవల కలెక్టర్ ప్రకటించడంతో హెల్త్ కార్డు పట్టుకుని వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వానికి, ఆస్పత్రులకు మధ్య ఇంకా సరైన అంగీకారం కుదరకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తినట్లు ఉద్యోగ సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఆర్భాటంగా పథకాన్ని ప్రారంభించి, ఇప్పుడు అమలు చేయడంలో దోబూచులాట ఎందుకని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

వాస్తవమేమిటంటే...

ఉద్యోగులకు ఈహెచ్‌ఎస్ సేవలు అందించడంలో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాటిని పరిష్కరించే వరకూ సేవలు అందించబోమని తేల్చి చెప్పడంతో రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ప్రభుత్వం పొడిగించింది. ఈలోపే ప్రైవేటు ఆస్పత్రులతో చర్చలు జరిపి పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో వారం రోజుల కిందట పలువురు ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులతో పాటు ఎన్జీవో నాయకులతో ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆస్పత్రుల డిమాండ్ల విషయంలో ఎటువంటి అవగాహన కుదరలేదని తెలిసింది. మూడు నెలలుగా ఉన్న బకాయిలు మాత్రం విడతల వారీగా విడుదల చేసేందుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే ఉచితంగా ఓపీ సేవలు, ఇన్వెస్టిగేషన్స్ చేయలేమని ఆస్పత్రులు తేల్చి చెబుతుండగా, ఈ విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.

జీతాల్లో రూ.8 కోట్లు వసూలు

ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి రాక ముందే ఉద్యోగుల జీతాల్లో మాత్రం పథకానికి సంబంధించి డబ్బుల కట్ చేశారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఉండగా, వారి నుంచి నవంబరు, డిసెంబరు నెల జీతాల నుంచి దాదాపు రూ.8 కోట్లు వరకూ జీతాల్లో కట్ చేశారని ఉద్యోగులు అంటున్నారు. పథకం అమలు చేయలేనప్పుడు డబ్బులు ఎందుకు మినహాయించారని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగులకు నగదు రహిత సేవలు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.