- పుష్కరాల ముగింపు కోసం భారీగా ఆర్డర్లు
- కొత్తపేటలో బాణసంచా పేలుడు ఘటనపై అనుమానాలు
సాక్షి, రాజమండ్రి : కొత్తపేట పేలుడు ఘటనపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జిల్లాలో దీపావళి పర్వదినానికి రెండు నెలల ముందు నుంచి మాత్రమే బాణసంచా తయారు చేస్తారు. అయితే వేళకాని వేళలో ఇక్కడ బాణసంచా తయారు కావడంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కొత్తపేట ఘటనలో ముగ్గురు మృత్యువాత పడగా, పలువురు క్షతగాత్రులయ్యారు. గోదావరి పుష్కరాల ముగింపు సందర్భంగా చివరి రోజైన శనివారం ఉభయగోదావరి జిల్లాల్లోని గోదావరి పరివాహాక ప్రాంతంలో భారీఎత్తున బాణసంచా కాల్చడం ద్వారా పుష్కరాలకు ఘనంగా ముగింపు పలకాలని సర్కారు నిర్ణయించింది. మరీ ముఖ్యంగా పుష్కరాలు ముగింపోత్సవాలు జరిగే రాజమండ్రిలో కళ్లు మిరుమిట్లుగొలిపేలా కనీసం ఐదారుగంటల పాటు నిర్విరామంగా బాణ సంచా కాల్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను, పుష్కరాల ప్రత్యేకాధికారి ధనుంజయరెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇందుకోసం కనీసం రూ.ఐదారుకోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో శివకాశితోపాటు దేశవ్యాప్తంగా ప్రముఖ బాణసంచా తయారీ కేంద్రాల నుంచి రప్పిస్తున్నారు. కాగా ఉభయగోదావరి జిల్లాల్లో బాణసంచా తయారీదారులకు కూడా భారీగానే ఆర్డర్లు ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వేళ కాని వేళలో జిల్లా వ్యాప్తంగా అధికారికంగానే కాదు అనధికారికంగా కూడా పెద్దఎత్తున బాణసంచా తయారవుతున్నట్టు తెలుస్తోంది. బుధవారం సంభవించిన పేలుడు ఘటన జరిగిన కొత్తపేట బాణసంచా తయారీ కేంద్రానికి కూడా ఇదే రీతిలో ఆర్డర్లు ఇచ్చినట్టు సమాచారం.
గత కొన్ని రోజులుగా ఇక్కడ రేయింబవళ్లు బాణసంచా తయారు చేస్తుండగా. ప్రమాదవశాత్తు బుధవారం ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. ఉభయగోదావరి జిల్లాల్లోనూ ఇదే రీతిలో పెద్దఎత్తున బాణసంచా తయారు చేయడంతో పాటు భారీగా నిల్వ చేసినట్టు తెలుస్తోంది. కొత్తపేట ఘటనకు తోడు గోకవరం బస్టాండ్ వద్ద భారీ విస్ఫోటనం సంభవించిన నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే పుష్కరాల ముగింపు సందర్భంగా జరుపతలపెట్టిన బాణసంచా కాల్పుల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొననున్నందున.. ఏమాత్రం నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరిస్తున్నారు.
ఆ పేలుడుకు బాధ్యులెవరు?
Published Fri, Jul 24 2015 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:02 AM
Advertisement
Advertisement