ఉలిక్కిపడిన ‘పేట’..!
సాక్షి, సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని వెంకటసాయి పాత సామగ్రి గోదాములో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. కానీ పాత సామగ్రి గోదాములో కటింగ్ మిషన్‌తోనే ఈ పేలుడు తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. పట్టణంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై పక్కన జీవీవీ ఫంక్షన్ హాల్ సమీపంలో ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం చిరునోముల గ్రామానికి చెందిన మెట్టెల నాగరాజు మూడు సంవత్సరాల క్రితం వెంకటసాయి పాత ఇనుప సామగ్రి దుకాణం నెలకొల్పాడు. ఈ దుకాణంలో సుమారు 30 మందికి పైగా పనిచేస్తున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొంత మంంది, స్థానిక పరిసర గ్రామాలకు చెందిన కొంత మంది దీంట్లో పనిచేస్తుంటారు. రోజుమాదిరిగానే ఎవరి పనిలో వారు నిమగ్నమైపోయి ఉన్నారు. కానీ షెడ్ లోపల రాంచందర్ సాహో మిషన్‌తో డబ్బాలను ముక్కలుముక్కలుగా చేస్తున్నాడు. సుమారు 20 ప్లాస్టిక్ డబ్బాలకు పైగా కట్ చేశాడు.
గాయపడిన బుజ్జి, సల్మాన్‌ఖాన్
కుప్పలుతెప్పలుగా ఉన్న డబ్బాలను కట్‌చేస్తుండగా..ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ రేకుల షెడ్లో రాంచందర్ సాహోతో పాటు కటింగ్ మిషన్ వద్ద ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సల్మాన్‌ఖాన్, చివ్వెంల మండలం రాంకోటి తండాకు చెందిన బుజ్జిలు పనిచేస్తున్నారు. కొద్ది దూరంలోనే చిలుకమ్మతో పాటు మరో నలుగురైదురుగు పనిచేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి రాంచందర్‌సాహో(45) మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో పడిపోయింది. అంతేకాకుండా ఆయన శరీరం చిధ్రమై అవయవాలు బయటపడ్డాయి. మిషన్‌లోని భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. సాహో పక్కనే పనిచేస్తున్న సల్మాన్ ఖాన్, బుజ్జిలకు తీవ్ర .. చిలకమ్మకు స్వల్ప గాయాలతో బయటపడింది. వారిని స్థానిక ఏరియాస్పత్రికి తరలించారు. వీరిలో సల్మాన్‌ఖాన్‌కు విషమంగా ఉందని వైద్యులు తెలపడంతో నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.
పేలుడు ధాటికి..
రాంచందర్‌సాహో ప్లాస్టిక్ డబ్బాలు కట్ చేస్తుండగా అధిక లోడుతో కట్టర్ మిషన్ బ్లాస్ట్ అయిందని తొలుత పోలీసులు భావించారు. కానీ మిషన్‌లోని భాగాలు దెబ్బతిన్నట్లుగా కన్పించడం లేదు. కేవలం పైభాగాలు మాత్రమే పూర్తిగా దెబ్బతిన్నాయి. అయితే సాహో కట్ చేసే ప్లాస్టిక్ డబ్బాలో జిలెటిన్‌స్టిక్ ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమమయ్యాయి. ఏదీఏమైనా ఘటనా స్థలంలోని పేలుడు ధాటిని చూస్తే మాత్రం బాంబు పేలిందన్న రీతిలో ఉంది. సాహో మృతదేహం పదిహేను మీటర్ల దూరంలో ఎగిరిపడింది. అంతేకాకుండా షెడ్ రేకులు లేచిపోయాయి. కటింగ్ మిషన్ పక్కనే ఉన్న గోడ పూర్తిగా పగిలిపోయింది.
పేలుడు ఇలా జరిగిందని..
రసాయన డబ్బాను కోస్తుండగా పేలుడు సంభవించిందని చివరకు పోలీసులు నిర్ధారించారు. స్పేర్ పంపులు, రసయనాలు వాడిన ఖాళీగా ఉన్న డబ్బాలు గోదాములో భారీగా ఉన్నాయి. కొన్ని డబ్బాలు మూత పెట్టి ఉండగా మరికొన్ని రంధ్రాలు పడి ఉన్నాయి. కొన్ని ఆర్గానిక్ సాల్వెంట్లు ప్రత్యేక పరిస్థితుల్లో పేలుడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. పెయింట్లలో కలిపే థిన్నర్లు ఈ కోవకు చెందుతాయి. కొంత రసాయనం డబ్బాకు అంటుకొని ఉండి, దానికి ఎక్కడ రంధ్రం లేకుండా ఉండి మూత పెడితే అందులో మంట స్వభావాన్ని కలిగి ఉండే వాయువులు ఏర్పడత్తాయి. అలాంటి డబ్బాలను తెరిచినప్పుడు ఒక్కసారిగా శబ్దం వస్తుంది. ఇలానే మూత పెట్టిన రసాయన డబ్బాను మిషన్ కట్టర్‌తో కోయడం లేదా, రసాయనం అంటుకుని ఉన్న డబ్బాను కట్టర్‌తో కోస్తున్నప్పుడు వేడికి స్పార్క్స్ ఒక్కసారిగా లోపటి రసాయన వాయువలకు తగడలడంతో మంటలతో కూడిన భారీ పేలుడు జరుగుతుంది. ఇదే జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఈనెల 8న హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో రసాయన డబ్బా మూత తీస్తుండగా అది పేలి ఒక వ్యక్తి మృతిచెందాడని పేర్కొన్నారు.
నెల రోజులు కాకముందే..
మధ్యప్రదేశ్‌కు చెందిన రాంచందర్‌సాహో ఇంత కాలం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో గల ఓ ప్లాస్టిక్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడి ప్లాస్టిక్ యజమానికి అక్కడ ప్లాస్టిక్ యజమానికి పరిచయంతో సాహోను సరిగ్గా నెల ఆఖరి తేదీన వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో పనిలో కుదిరాడు. కేవలం ప్లాస్టిక్ డబ్బాలను కటింగ్ చేసే పనిలో మాత్రమే కుదిరాడు. పనెల రోజులు కాకముందే ప్రమా దం సంభవించి కన్నుమూయడంతో తోటి కార్మికులు.. కన్నీరుమున్నీరయ్యారు.
నివాసాల మధ్యే ..
పట్టణంలో 17 పాత సామాను గోదాములున్నాయి. పాత సామాను సేకరించిన వారు ఈ గోదాముల దగ్గరకు వచ్చి వీటి నిర్వాహకులకు అమ్ముతారు. ఇనుము, ప్లాస్టిక్, గాజు, పాలిథిన్‌తో పాటు పలు రకాలవి ఈ గోదాముల్లో రోజుల తరబడి ఉంటాయి. పెద్దపెద్ద ప్లాస్టిక్ డబ్బాలను చిన్న కట్టర్ మిషన్లతో కోయించి ముక్కలు ముక్కలుగా చేయిస్తారు. వీటిని మళ్లీ బస్తాలో నింపి హైదరాబాద్‌లోని ప్లాస్టిక్ మిక్సింగ్ ప్లాంట్లకు తరలిస్తారు. జిల్లా కేంద్రంలో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. పెద్ద గోదాములను అద్దెకు తీసుకొని ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. కొన్ని పట్టణానికి సమీపంలో ఉంటే మరికొన్నిజనావాసాల మధ్యే ఉన్నాయి. జీవీవీ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన పేలుడు చుట్టుపక్కల నివాస ప్రాంతాలు లేవు. అయినా భారీ పేలుడు జరగడంతో శబ్దం కిలోమీటరు వరకు వెళ్లింది. రసాయన వాడకం చేసిన ఖాళీ డబ్బాలు కూడా భారీగా పాత సామాను గోదాములకు వస్తాయి. ఈ రసాయన డబ్బాలు మూత పెట్టినవి తీయడం ప్రమాదకరం కావడంతో పేలుడు సంభవిస్తున్నాయి.
భయాందోళనలో ప్రజలు
రోదిస్తున్న తోటి కార్మికులు
వెంకటసాయి ప్లాస్టిక్ దుకా ణంలో సంభవించిన పేలుడుతో పేట ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యా రు. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఉన్న ప్లాస్టిక్ దుకాణానికి సమీపంలోని భగత్‌సింగ్, తిరుమలానగర్, జమ్మిగడ్డ, ఖమ్మం క్రాస్‌రోడ్డు, విజయకాలనీ, మారుతినగర్, దాసాయిగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎన్నడూ లేని విధంగా పెద్ద బాంబు పేలుడు మాదిరిగా శబ్దం వచ్చిందంటూ ఒకరికొకరు చర్చించుకుంటుండగానే.. ప్లాస్టిక్ దుకాణంలో ఏదో పేలుడు సంభవించిందన్న వార్తలు దావానంలా వ్యాపించింది. అయితే దుకాణంలో మాత్రం కటింగ్ మిషన్ పేలితే ఇంత శబ్దం ఎలా వస్తుంది.. కాదు అది తప్పకుండా బాంబు పేలుడేనని ప్రజలు జోరుగా చర్చించుకున్నారు.
ఘటన స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ, డీఎస్పీ
ఘటనాస్థలిని పరిశీలిస్తున్న ఏఎస్పీ, డీఎస్పీ
వెంకటసాయి ప్లాస్టిక్ దుకాణంలో జరిగిన పేలుడు విషయాన్ని తెలుసుకున్న సూర్యాపేట ఏఎస్పీ పూజిత నీలం, డీఎస్పీ నాగేశ్వరరావు, సీఐ శివశంకర్‌లు ఘటనా స్థలా నికి చేరుకున్నారు. దుకాణంలోని పాత ఇనుము సామాగ్రితో పాటు సాహో కట్ చేసిన డబ్బాలను పరిశీలించారు. అయినా క్లూజ్ టీంను రప్పించి వివరాలు సేకరిస్తామని తెలిపారు. పేలుడు జరిగిన ఘట నను వెంటనే పోలీసులు క్లూజ్ టీంకు వివరించి రప్పించారు. దుకాణంలో రసాయనాల లేక.. మిషన్‌లో సాంకేతిక సమస్య.. ఎవరైనా వ్యక్తులు బాంబులు, జిలిటెన్‌స్టిక్స్ పెట్టారా అన్న కోణంలో క్లూజ్ టీం వివరాలు సేకరించారు. దీంతో ఘటన స్థలంలోని వివరాలను టీం సేకరించింది.
క్షణాల్లో జరిగిపోయింది..
దుకాణంలో అందరం పనిలో నిమగ్నమైపోయాం. 20 మీటర్ల దూరంలో ఉండి ప్లాస్టిక్ డబ్బాలను వేరు చేసే పనిలో ఉన్నా. ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చింది. ఏం జరిగిందో అర్థం కాకుండా.. భయాందోళనకు గురయ్యా. వెంటనే తేరుకుని చూడగా.. పక్కనే పనిచేస్తున్న సాహో విగతజీవిగా మారిపోయాడు.
– పద్మ, రాంకోటితండా, కార్మికురాలు
మూడేళ్లుగా పనిచేస్తున్నా ..
ప్లాస్టిక్ దుకాణంలో మూడేళ్లుగా పనిచేస్తున్నా. గతంలో ప్లాస్టిక్ డబ్బాలను కట్ చేసేం దుకు ఇద్దరుముగ్గురు పనిచేసేవారు. కానీ ఏ రోజు కూడా డబ్బాలు కట్ చేస్తుండగా.. ప్రమాదం సంభవించలేదు. కానీ ఇప్పుడు ఇలా జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాం. ఇప్పటికీ ఘటననుంచి తేరుకోలేకపోతున్నాం.
– విజయ, కార్మికురాలు
బాంబు పేలుడు కాదు
పట్టణంలోని జాతీయ రహదారిలో జక్వీవీ ఫంక్షన్‌హాల్ వద్ద ఉన్న పాత సామాను గోదాములో ప్లాస్టిక్ టిన్లను చిన్ని ముక్కలుగా కట్ చేయడానికి మిషన్ఫై ప్రాసెస్చేస్తుండగా రసయనాలు వేడిమికి గురై పేలుడు జరిగింది. అంతే కాని ఇక్కడ ఎలాంటి బాంబు పేలుడు జరగలేదు. ప్రజలు ఇలాంటి రూమర్స్‌ను నమ్మవద్దు. కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణాలు తెలుసుకుంటున్నాం.
– రావిరాల వెంకటేశ్వర్లు జిల్లా ఎస్పీ