నకిలీ ట్రైనీ ఎస్‌ఐ అరెస్ట్ | fake trainee sub inspector police arrest | Sakshi
Sakshi News home page

నకిలీ ట్రైనీ ఎస్‌ఐ అరెస్ట్

Published Wed, Dec 18 2013 3:58 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

fake trainee sub inspector police arrest

నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : ట్రైనీ ఎస్‌ఐనంటూ ఓ వ్యక్తిని బెదిరించి అతని వద్ద నగదు, సెల్‌ఫోను అపహరించుకుని వెళ్లిన దుండగుడిని మూడో నగర పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుని వివరాలు వెల్లడించారు. ప్రగతినగర్ 10వ వీధికి చెందిన ఎస్‌కే జాకీర్ నగరంలోని చాకలివీధిలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఎంఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. దుర్వ్యసనాలకు, విలాసాలకు అలవాటు పడిన జాకీర్  దోపిడీలను ఎంచుకున్నాడు. నెల్లూరు రూరల్ మండలం గుడిపల్లిపాడుకు చెందిన పాల వ్యాపారి షేక్ హుస్సేన్ ఈనెల 7వ తేదీ రాత్రి బాబు ఐస్‌క్రీం సమీపంలోని ఓ సెల్‌ఫోన్ దుకాణంలో రీచార్జ్ చేయించుకుని బయటకు వచ్చాడు.
 
 అప్పటికే అక్కడ మాటేసిన జాకీర్ హడావుడిగా హుస్సేన్ వద్దకు వెళ్లి తాను ట్రైనీ ఎస్‌ఐనని, సీసీఎస్ పోలీసుస్టేషన్‌లో ఉంటానని చెప్పాడు. ‘నీవద్ద ఉన్న సెల్‌ఫోన్ చోరీ చేసిందని, నీ ఊరు,పేరు ఎక్కడ’ అంటూ హుస్సేన్‌ను నిలదీశాడు. అతను బిత్తరపోవడంతో తన బైక్‌పై ఎక్కించుకుని సీసీఎస్ పోలీసుస్టేషన్ వద్దకు వెళ్లాడు. స్టేషన్ బయట బైక్‌ను ఆపి సీఐకి ఫోను చేస్తున్నట్లు నటించాడు. సీఐ స్టేషన్‌లో లేరు ఐదో నగర పోలీసుస్టేషన్ వద్ద ఉన్నాడని, అక్కడకి వెళుదామని హుస్సేన్‌నూ మినీబైపాస్‌లోకి తీసుకెళ్లాడు. హుస్సేన్ వద్ద ఉన్న హెచ్‌టీసీ సెల్‌ఫోను, రూ.45 వేల నగదును తీసుకున్నాడు. అయ్యప్పగుడి సమీపంలో బైక్‌ను ఆపి మీ బంధువులు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి స్టేషన్ వద్దకు వస్తే జామీను ఇచ్చి పంపుతామని చెప్పాడు. దీంతో హుస్సేన్ బంధువులకు ఫోను చేసేందుకు రూపాయి కాయిన్ బాక్స్ వద్దకు వెళ్లగా జాకీర్ అక్కడ నుంచి జారుకున్నాడు.
 
 దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు నకిలీ ట్రైనీ ఎస్‌ఐ బాగోతంపై మూడో నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి బైక్ నంబర్‌ను పోలీసులకు తెలియజేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు బైక్ నంబర్ ఆధారంగా నిందితుడి కోసం గాలించారు. మంగళవారం నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని నుంచి రూ.20 వేల నగదు, హెచ్‌టీసీ సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు మూడో నగర సీఐ కేవీ రత్నం, ఎస్‌ఐ నాగభూషణం, ఏఎస్‌ఐ మురళీ, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుల్ రమణలను డీఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement