ఈ రేకుల షెడ్డే వారి నివాస గృహం, చిత్రంలో మంచానికే పరిమితమైన పింజరి రంజాన్
కర్నూలు ,పత్తికొండ రూరల్: సాధికార సర్వే పేరుతో హడావుడి చేసే అధికారుల కళ్లకు ఈ పేద దంపతులు కనిపించడం లేదు. పింఛన్ ఉందా? మీరున్నది సొంతిల్లా? అంటూ ఆరా తీసే విచారణ సిబ్బందీ.. రేకుల షెడ్డులో జీవచ్ఛవంలా బతుకీడుస్తున్న ఈ అభాగ్యుల వైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. విధి పగబట్టడంతో ఇంటి పెద్ద రెండు కాళ్లకు షుగర్ వ్యాధి సోకింది. పూట గడవడానికి కూలి పనులకు వెళ్తూనే మంచానికే పరిమితమైన భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఓ ఇల్లాలు. అధికారులు గూడు కల్పించాలని, దాతలు దయతలిస్తే భర్తకు వైద్యం చేయించుకుంటానని ఆమె కన్నీటితో వేడుకుంటోంది. మండల పరిధిలోని ఆర్. మండగిరి గ్రామానికి చెందిన పింజరి రంజాన్, లాల్‌బీ దంపతులు నిరు పేదలు. వీరికి పిల్లలు లేరు. బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించే రంజాన్ షుగర్ వ్యాధి బారిన పడ్డాడు. మూడేళ్ల క్రితం ఆదోని ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు ఎడమ కాలు మోకాలు వరకు తొలగించారు. 2015లో 60 శాతం వికలత్వంతో వైద్యాధికారులు మెడికల్ సర్టిఫికెట్ జారీ చేయడంతో రూ.1,000 పింఛన్ వస్తోంది. కొంతకాలానికి షుగర్ వ్యాధి మరో కాలుకు విస్తరించింది. పాదం వరకు దెబ్బతిని నడవలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అతడి భార్య లాల్‌బీపైనే పోషణ భారం పడింది. కూలి పనులు చేసుకుంటూ భర్తను పోషిస్తోంది.
గూడు లేక గోడు..
పూట గడవడమే చేతకాని ఈ కుటుంబానికి ఊళ్లో జానెడు స్థలం కూడా లేదు. వేరే వారి రేకుల షెడ్‌లో తల దాచుకుంటున్నారు. దయనీయ స్థితిలో కాలం వెల్లదీస్తూ దాతల సాయం కోసం ఎదురుస్తున్నారు. స్పందించే దాతలు ఆంధ్రాబ్యాంకు ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్: ఎఎన్‌డీబీ 0001949, అకౌంటు నంబర్: 194910100295100 సెల్: 9701851300కి ఫోను చేయవచ్చును.
భర్తకోసమే బతుకుతున్నా
మాకు దిక్కెవరూ లేరు. పని చేసుకుని బతుకుతున్నాం. ఉన్నప్పుడు తింటాం..లేదంటే పస్తులుంటాం. మా కెందుకో ఆ దేవుడు ఇన్ని కష్టాలు పెట్టినాడు. నా పెనిమిటి మంచం నుంచి లేయలేడు. షుగర్ వ్యాధి వచ్చిందంట. పెద్ద వైద్యం చేయాలన్నారు. మా దగ్గర మందు బిల్లలకు కూడా దుడ్లు లేవు. మా ఆయన కోసమే నేను బతుకున్నా..ఎవరైనా సాయం చేయకపోతారా..మా బతుకులు మారకపోతాయా అని ఎదురు చూస్తున్నా. – లాల్‌బి, మండగిరి
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం
గతంలో జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా సామాజిక భద్రత పింఛన్ ప్రతినెలా రూ.వెయ్యి అందిస్తున్నాం. సదరం క్యాంపు కెళ్లి ప్రస్తుత వికలత్వం సర్టిఫికెట్ తెస్తే దాని ప్రకారం పింఛన్ మంజూరుకు ప్రతిపాదన పంపుతాం. ప్రభుత్వ స్థలం మంజూరుకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తా. – రామకృష్ణ, పంచాయతీ కార్యదర్శి,మండగిరి
Comments
Please login to add a commentAdd a comment