సీత్యాతండా (వేములపల్లి), న్యూస్‌లైన్: విద్యుత్ సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తోపుచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సీత్యాతండా సబ్‌స్టేషన్‌ను పలు గ్రామాల రైతులు శుక్రవారం ముట్టడించారు. సీత్యాతండా, పుచ్చకాయలగూడెం, దేవతలబాయిగూడెం, బొమ్మకల్ గ్రామాల రైతులు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఆగ్రహంతో ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రెండు రోజులుగా కేవలం అర్ధగంట మాత్రమే విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారని చెప్పారు. దీంతో వరి నాట్లు వేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని, రెండు రోజులుగా కేవలం 23 నిమిషాలు విద్యుత్‌ను సరఫరా చేసి గంట 20 నిమిషాలు సరఫరా చేస్తున్నట్లు రికార్డుల్లో నమోదు చేశారని ఆరోపించారు.
తమ గ్రామాలకు వచ్చే ఫీడర్‌కు మాత్రమే విద్యుత్‌ను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. సుమారు మూడు గంటల పాటు సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. సబ్‌స్టేషన్‌లోని టీవీ, నిల్వ ఉన్న మీటర్లు, సబ్‌స్టేషన్ అద్దాలు, గేటును పూర్తిగా ధ్వసం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్ల పైకి వెక్కి పలువురు రైతులు నిరసన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వచ్చి విద్యుత్‌ను ఏడు గంటలు ఇస్తామని హామీఇచ్చే వరకు ఆందోళన విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీ సులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. సబ్‌స్టేషన్‌పై దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన రైతులపై ఏఈ తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ యాదగిరి తెలిపారు.
విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం
Published Sat, Jan 11 2014 3:27 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement