రాజధాని మాస్టర్ ప్లాన్‌ను తిప్పికొట్టిన రైతులు
తుళ్లూరు, మంగళగిరి మండలాల అవగాహన సదస్సుల్లో అధికారులపై మండిపాటు
గ్రామ కంఠాలు, అసైన్డ్, లంక భూములు, రహదారులపై స్పష్టతఇవ్వాలని డిమాండ్
అమరావతి మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సుల్లో అధికారులకు రైతులు చుక్కలు చూపిస్తున్నారు. రైతుల సందేహాలకు సమాధానాలు చెప్పలేక అధికారులు నీళ్లు నములుతున్నారు. ‘మా సందేహాలు నివృత్తి చేసిన తరువాతనే సదస్సులు కొనసాగించండి...లేకుంటే తిరుగుముఖం పట్టండి’ అని రైతులు మండిపడుతున్నారు.
గుంటూరు : రాజధాని గ్రామాల్లో మాస్టర్‌ప్లాన్ అవగాహన సదస్సులు ఘర్షణ వాతావరణంలో జరుగుతుండడంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. భూ సమీకరణ సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు, ఉన్నతాధికారులు గ్రామాల్లో పర్యటించి రైతులకు నచ్చచెప్పి, 33 వేల ఎకరాలు తీసుకున్నారు. ఆ తరువాత రైతుల సందేహాలను తీర్చకుండా, అవగాహన సదస్సులకు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, ఉన్నతాధికారులు హాజరుకాకపోవడం పట్ల రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
12 నుంచి గ్రామాల వారీగా సదస్సులు...
రాజధాని నిర్మాణంపై సింగపూర్ కంపెనీలు మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి డిసెంబరు నెలాఖరులో ప్రభుత్వానికి ఇచ్చాయి. ఈ ప్లాన్‌పై ప్రజల అభ్యంతరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్లాన్ వివరాలను వెబ్‌సైట్‌లోనూ, సీఆర్‌డీఏ కార్యాలయాల్లో పరిశీలన నిమిత్తం ఏర్పాటు చేసింది.మాస్టర్‌ప్లాన్ ఆంగ్లభాషలో ఉండడం, ఆ వివరాలు పూర్తిగా రైతులకు అర్థం కాకపోవడంతో జిల్లా యంత్రాంగం రాజధాని గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసింది. ఈ నెల 12 నుంచి గ్రామాల వారీగా జరిగే సదస్సుల వివరాల షెడ్యూలు విడుదల చేసింది. ఆ మేరకు మంగళవారం తుళ్లూరు మండలం నేలపాడు, శాఖమూరు, అనంతవరం, బోరుపాలెం, అబ్బురాజుపాలెం గ్రామాల్లో సిబ్బంది, అధికారులతో కూడిన రెండు బృందాలు పర్యటించాయి. అయితే గ్రామ కంఠాలు, నిమ్మతోటల భూములను ఏ కేటగిరీ కింద పరిగణించాలో ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టత నీయలేదు.
అసైన్డ్‌భూములు, లంక భూములు, రాజధాని గ్రామాల్లో ఆరు లైన్ల రహదారుల ఏర్పాటు వంటి ముఖ్యమైన అంశాలపై కూడా ప్రభుత్వం స్పష్టతనీయలేదు. వీటిపై కొందరు రైతులు తమ సందేహాలను వ్యక్తం చేశారు. మరి కొంత మంది రైతులు తాము ఇచ్చిన భూములకు స్థలాలు ఎక్కడ ఇస్తారు? ఇచ్చిన స్థలాల్లో ఎన్ని అంతస్తుల భవనాలు నిర్మించుకునే అవకాశం ఉంది? వంటి ముఖ్య ప్రశ్నలను లేవనెత్తారు. వాటికీ అధికారులు సమాధానం చెప్పలేకపోవడంతో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ముఖ్యంగా స్పష్టత లేని అంశాలపై ప్రభుత్వ నిర్ణయం వెంటనే వెలువడాలని, లేకుంటే సదస్సులు కొనసాగనీయమని రైతులు హెచ్చరించారు.
నీరుకొండ, కురగల్లులోనూ ఇంతే..
మంగళగిరి మండలం నీరుకొండ, కురగల్లు గ్రామాల్లోని రైతులు బుధవారం అవగాహన సదస్సులను నిలువరించడంతో అధికారులు తిరుగుముఖం పట్టారు. గ్రామ కంఠాలు, అసైన్డు భూములు, రాజధానిలో రహదారుల నిర్మాణం విషయాలను తేల్చిన తరువాతే సదస్సులు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశారు. దీంతో అధికారులు రైతులకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే అవగాహన కార్యక్రమాలు ప్రస్తుతం తమకు అవసరం లేదని, రాజధాని మాస్టర్ ప్లాన్ అంతా తెలుసని, సమస్యలు పరిష్కరిస్తేనే కార్యక్రమం కొనసాగుతుందంటూ అధికారులను హెచ్చరించారు. దీంతో అధికారులు సదస్సులు నిర్వహించకుండానే వెనుదిరిగారు.
తిరుగుబాటు
Published Thu, Jan 14 2016 1:58 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement