* అడ్మిషన్ల వివాదం తొలగినా.. రీయింబర్స్‌మెంట్ ఎలా?
* 1956కు ముందు తెలంగాణ వారికే ఫీజులు ఇస్తామన్న టీ-సర్కారు
* అక్కడ నివసిస్తూ చదువుకుంటున్న ఏపీ విద్యార్థులపై మల్లగుల్లాలు
* 11న సుప్రీంకోర్టు తీర్పులో స్పష్టత వస్తుందని ఏపీ సర్కారు నిరీక్షణ
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించుకోవచ్చని సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత ఊరట లభించినప్పటికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో మాత్రం కొన్ని సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలన జరుపుకోవచ్చని, ఆగస్టు నెలాఖరుకు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టంచేసింది.
అడ్మిషన్ల వరకు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదం పరిష్కారమైనా.. అసలు సమస్య ఇపుడే ప్రారంభమవుతోంది. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంటు, దానితో ముడిపడి ఉన్న స్థానికత అంశంపై ఏం చేయాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటివరకు ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దుచేసి కొత్తగా ‘ఫాస్ట్’ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రాంత విద్యార్థులకు మాత్రమే ఆర్థిక సాయమందించే ఈ పథకాన్ని తెలంగాణ స్థానికులకే అందిస్తామని ఆ ప్రభుత్వం స్పష్టంచేసింది.
1956కు ముందు తెలంగాణలో నివసిస్తున్న వారే స్థానికులని ఆ రాష్ట్ర సర్కారు చెప్పడంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఈ నిబంధన వల్ల తెలంగాణలో స్థిరపడి ఉన్న లక్షలాది మంది సీమాంధ్ర విద్యార్థులకు ఆర్థికసాయం అందకుండా పోయే పరిస్థితి తలెత్తుతోంది. ఈ నెల ఏడో తేదీ నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరగనుంది. విద్యార్థులు తమ స్థానికతతో పాటు తమ వార్షిక ఆదాయాన్ని తెలిపే ధ్రువపత్రాలను పరిశీలన సమయంలోనే అధికారులకు అప్పగిస్తారు. సంబంధిత విద్యార్థి లేదా విద్యార్థిని ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హుడా లేదా అని అపుడే నిర్థారించి రికార్డుల్లో పొందుపరుస్తారు. ఆ రికార్డుల ఆధారంగా సీటు కేటాయించిన తరువాత కళాశాలల్లో చేర్చుకుంటారు.
హైదరాబాద్‌లో నివసించే సీమాంధ్ర విద్యార్థులు 1956 నుంచి ఉన్నట్లు నిరూపించుకుంటేనే అక్కడ స్థానిక ధ్రువపత్రాలు అందుతాయి. లేనిపక్షంలో స్థానికేతరులుగా మిగిలిపోతారు. దీనివల్ల తెలంగాణ ప్రాంతంలోని కళాశాలల్లో ఉమ్మడి ప్రవేశంలో సీట్లు సంపాదించినప్పటికీ స్థానికేతరులుగా ఆర్థిక సాయం అందుకోలేరు. అదే సమయంలో వీరు ఆంధ్రప్రదేశ్ వారా? తెలంగాణ ప్రాంతం వారా? అనే స్పష్టత ధ్రువపత్రాల్లో ఉండదు. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తానని చెప్పిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి కూడా అర్హులు కాకుండాపోయే ప్రమాదముంది. అయితే ఈ నెల 11వ తేదీన సుప్రీంకోర్టు తుది తీర్పులో దీనిపైన కూడా స్పష్టత వస్తుందని, ఆ తీర్పు తర్వాత తదుపరి చర్యలపై సమీక్షించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై చంద్రబాబు హర్షం
ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి సర్టిఫికెట్లను పరిశీలించటంతో పాటు అడ్మిషన్ల ప్రక్రియను ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేయటం పట్ల చంద్రబాబు సోమవారం సామాజిక వెబ్‌సైట్ ట్విటర్‌లో హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ ప్రవేశాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కౌన్సెలింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు.
ఫీజులే ప్రధాన సమస్య
Published Tue, Aug 5 2014 12:46 AM | Last Updated on Wed, Sep 5 2018 9:00 PM
Advertisement