చెత్త బతుకులు
వారికి రాత్రి.. పగలు తేడా లేదు. చలీ.. ఎండతో కూడా పని లేదు. పట్టణమంతా పరిశుభ్రంగా ఉండాలని నిత్యం అపరిశుభ్రతలో పని చేస్తుంటారు.. వీధుల్లోని చెత్తను ఎత్తడమే వారి పని.. కొన్ని సందర్భాలలో గాయాలపాలవుతున్నా విశ్రాంతి తీసుకునే వీలుండదు.. కొంతమంది తాగుబోతులు కామెంట్లు చేస్తుంటారు. అయినా అన్నిటినీ భరిస్తుంటారు.. ‘ఏం జీతం తీసుకోవట్లేదా.. అని అనుకోవచ్చు.. వారికిచ్చే జీతం కుటుంబపోషణకు ఏ మాత్రం సరిపోవడం లేదు. వారే మునిసిపాలిటీల్లోని మహిళా పారిశుద్ధ్య కార్మికులు.
చేస్తున్న ఉద్యోగం ఏదోఒక రోజు పర్మినెంటు అవుతుందనే ఆశతో ఏళ్లతరబడి కష్టపడుతూనే ఉన్నారు.
ఏం చెప్పినా లాభమేముందయ్యా
‘ఆరేళ్లనుంచి పని సేచ్చాండనయ్యా.. ముగ్గురు పిల్లోళ్లు ఉండారు. ప్రైవేటుబడికి పంపిచ్చేదానికి డబ్బుల్లాక సర్కారోళ్ల బడికి పంపిచ్చాండా! రూ. 6,700 జీతం ఇచ్చాండారు. కటింగులు పోనూ 5,627 రూపాయలు ఇస్తారు. ఇంటిబాడుగ , పిల్లోళ్ల సదువులు, సరుకులు, పాలు...ఇలా అన్నిటికీ లెక్కేస్తే నెలకు 10వేలపైన ఖర్చయితాంది. మా ఇంటియాన కూడా పనికి పోతాడు. ఇద్దరి లెక్క కలిపినా అంతంత మాత్రమే.. పనిమాత్రం శానా ఉంటాది. ఉదయం, సాయంత్రం రెండుపూటల వీధుల్లో కసువు నూకాల. పొరకలు, కొబ్బరినూనె కూడా ఇవ్వరు. మేమే తెచ్చుకోవాల. పనిచేసేటప్పుడు గొజొప్పులు కుచ్చుకున్నా సెలవు ఇవ్వరు. ఏందో మా బతుకులు ఇట్టా గడిచిపోతాండాయి.
-లక్ష్మీదేవి, పారిశుధ్య కార్మికురాలు, రాజంపేట