సాక్షి, విజయవాడ : దుర్గమ్మ కృష్ణానదీ విహారం ఆదివారం రాత్రి నయనానందకరంగా సాగింది. దసరా ఉత్సవాల్లో చివరిరోజు దశమినాడు కృష్ణానదిలో తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామివార్ల ఉత్సవ మూర్తులను ఆలయ అధికారులు, నగర పోలీసులు పల్లకీలో ఊరేగిస్తూ దుర్గాఘాట్‌కు తీసుకొచ్చారు. రంగురంగుల విద్యుద్దీపాలు, వివిధ రకాల పూలతో అలంకరించిన హంస వాహనంపై ఉత్సవమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు, వేదమంత్రాల మధ్య సుమారు రెండు గంటలపాటు తెప్పోత్సవం జరిగింది.
హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు నౌకా విహారం చేస్తుంటే భక్తులు జయజయధ్వానాలు చేశారు. కళ్లు మిరమిట్లు గొలిపేలా బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం. జ్యోతి, జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందన, పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ
దసరా ఉత్సవాల్లో ఆఖరిరోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనం ఇచ్చారు. శాంతస్వరూపిణి అలంకారంలో భక్తుల్ని కటాక్షించించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం కోసం భక్తులు క్యూలో నిలబడ్డారు. నలభై రోజుల భవానీ దీక్షలు విరమణ చేసేందుకు రాష్ట్రం నలమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఇంద్రకీలాద్రి ఎరుపెక్కింది. రద్దీ ఎక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాన్ని రద్దు చేసి లఘు దర్శనానికి మాత్రమే అనుమతిచ్చారు. ఆదివారం టీటీడీ ఏఈవో రామ్మూర్తిరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొమ్మిది రోజులపాటు కనులపండువగా జరిగిన దసరా ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి.