కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: ప్రాంతీయ వ్యత్యాసం తొలగించాలనే ప్రధాన డిమాండ్‌తో ఆదివారం కర్నూలు నగరంలో నిర్వహించిన వాల్మీకి సమరభేరి బహిరంగ సభ విజయవంతమైంది. జిల్లాతో పాటు అనంతపురం, మహబూబ్‌నగర్, కడప, ప్రకాశం జిల్లాల నుంచి వాల్మీకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో స్థానిక మున్సిపల్ హైస్కూల్ మైదానం కిక్కిరిసింది. ముందుగా కలెక్టరేట్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. పలువురు వాల్మీకులు గుర్రాలపై ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వాల్మీకి మహర్షి చిత్రంతో రూపొందించిన కాషాయ జెండాలు రెపరెపలాడాయి. స్థానిక శ్రీకృష్ణదేవరాయల విగ్రహం వద్ద వాల్మీకి సర్కిల్ ఏర్పాటుకు భూమి పూజ చేపట్టారు.
వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి(వీఆర్‌పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సుభాస్‌చంద్రబోస్ అధ్యక్షతన నిర్వహించిన సభకు కేంద్ర హోంశాఖ మాజీ మంత్రి బూటాసింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ వాల్మీకుల్లో ప్రాంతీయ వ్యత్యాసాన్ని యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా ఎమ్మెల్యే బోయ శ్రీరాములు మాట్లాడుతూ వీఆర్‌పీఎస్ ఉద్యమానికి అన్నివిధాల సహకరిస్తానన్నారు. వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటూ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని సూచించారు. కర్ణాటకలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నందునే 15 మంది ఎమ్మెల్యేలు, ఇరువురు ఎంపీలుగా ఎంపికయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో బరిలో నిలిచే వాల్మీకులను పార్టీలకు అతీతంగా గెలిపించుకోవాలన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేయాలన్నారు.
సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ఎస్టీ రిజర్వేషన్ సాధనకు ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు. ఉద్యమం ప్రారంభించినప్పుడు తనకు నలుగురు అన్నలేనని.. ప్రస్తుతం వేలాది మంది అన్నలు, తమ్ముళ్లు మేమున్నామని భరోసానిస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, అనంతపురం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వాల్మీకులు అధికంగా ఉన్నందున దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు 8 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న చైతన్యాన్ని చూస్తే లక్ష్యం నెరవేరుతుందనే నమ్మకం కలుగుతోందన్నారు. బహిరంగ సభలో భూగర్భ ఖనిజాల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్, అనంతపురం మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బి.వై.రామయ్య, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, మహిళా నాయకురాళ్లు గుడిసె క్రిష్ణమ్మ, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, మంత్రాలయం లక్ష్మన్న, గుడిసె క్రిష్ణమ్మ, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ గట్టు తిమ్మప్ప, వీఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడూరు గిడ్డయ్య, కార్యదర్శి రాంభీంనాయుడు, జిల్లా కార్యదర్శి ఎల్.వెంకటేశ్వర్లు, లాయర్ ప్రభాకర్, కర్నూలు మెడికల్ కళాశాల రిటైర్డు ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీ ప్రసాద్, బీసీ సాధికార కమిటీ కేంద్ర సభ్యులు టి.మద్దులేటి, కప్పట్రాళ్ల మద్దిలేటినాయుడు, వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
ప్రాంతీయ వ్యత్యాసంపై పోరు
Published Mon, Dec 23 2013 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM
Advertisement
Advertisement