
సినీ నిర్మాత కోనేరు కిరణ్ అరెస్ట్
హైదరాబాద్, న్యూస్‌లైన్: బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న సినీ నిర్మాత కోనేరు కిరణ్‌కుమార్‌ను కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కిరణ్‌కుమార్ హీరో నాగచైతన్యతో బెజవాడ సినిమా నిర్మించాడు. ఆ సినిమా నిర్మాణ ఖర్చుల కోసం ప్రసాద్ ల్యాబ్స్ ఫైనాన్స్ నుంచి రూ.కోటి రుణం తీసుకున్నాడు. ఇందుకు సంబంధించి వాయిదాలు చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో ప్రసాద్‌ల్యాబ్స్ ఫైనాన్షియర్లు కోర్టును ఆశ్రయించారు. గతంలో కోర్టు రెండుసార్లు కిరణ్‌కు నోటీసులు జారీచేసి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఆదేశించింది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్మాత తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో శుక్రవారం కోర్టు కిరణ్‌కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌తో పోలీసులకు ఉత్తర్వులు జారీచేసింది. మణికొండలోని కిరణ్ ఇంటి ముందు నిఘావేసిన పోలీసులు.. శనివారం అతనిని అరెస్ట్‌చేశారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం ఉదయం అపోలో ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కిరణ్ చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.