సాక్షి, హైదరాబాద్: ‘నీది నాది ఒకే కథ’, గర్ల్ ఫ్రెండు’సినిమాల నిర్మాత అట్లూరి నారాయణరావును ఫాస్ట్ మూవింగ్ కన్‌జ్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) దందా కేసులో సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో అసలు సూత్రధారి గుధే రాంబాబు హైదరాబాద్‌లో ఎఫ్‌ఎంసీజీ స్థాపించి మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్‌ఎం) పేరిట అధిక వడ్డీలు ఆశ చూపి వందలాది మంది నుంచి రూ.540 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశాడు.
బాధితుల ఒత్తిళ్ల నేపథ్యంలో రాంబాబు ఓ చార్టెట్ అకౌంటెంట్ ద్వారా నిర్మాత నారాయణరావును కలవగా, తన పలుకుబడితో కేసు లేకుండా చేస్తానని, ఇందుకు అన్ని ఖర్చులకు గానూ రూ.20 కోట్లు డిమాండ్ చేశాడు. బేరసారాల తర్వాత రూ.2 కోట్లకు అంగీకరించిన నారాయణరావు అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు.
ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. నారాయణరావును అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు అదనపు విచారణ కోసం పోలీసు కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ శుక్రవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీలోకి తీసుకున్న తర్వాత బంగారం రికవరీ చేయాలని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment