ఎట్టకేలకు ఊరట | finally relax | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు ఊరట

Published Sun, Aug 11 2013 3:35 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

finally relax

 గజ్వేల్, న్యూస్‌లైన్: నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న ఐదు సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. నిధుల కొరత కారణంగా ఈ ప్రక్రియ రెండున్నరేళ్లుగా పెండింగ్‌లో ఉన్న విషయం తెల్సిందే. తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదల కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో పనులు కూడా ప్రారంభమయ్యే అవకాశమున్నట్టు సమాచారం.నియోజకవర్గంలోని గజ్వేల్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్ మండలాల్లో 33/11కేవీ సబ్‌సేష్టన్‌లు 21 వరకు ఉన్నాయి. గజ్వేల్‌లో అదనంగా 132/33కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, రంగారెడ్డితోపాటు మెదక్ జిల్లాకు విద్యుత్ సరఫరానందించే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఇక్కడే ఉంది. నియోజకవర్గంలో అధికార, అనధికారికం గా కలుపుకొని 22 వేలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండగా సీజన్‌లో నిత్యం 100 మెగావాట్లకుపైగా విద్యుత్ అవసరముంటుంది.
 
  నాణ్యమైన విద్యుత్‌ను అవసరమైన స్థాయిలో అందించేందుకు 400 కేవీ సబ్‌స్టేషన్ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నియోజకవర్గంలోని గ్రామాల్లో తగినన్ని 33/ 11కేవీ, 132/33కేవీ సబ్‌స్టేషన్లు లేకపోవడం సమస్యగా మారింది. ఫలితంగా లో-ఓల్టేజీ సమస్యలు తలెత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వర్గల్ మండలం పాములపర్తి, సీతారామ్‌పల్లి, ములుగు మండలం క్షీరసాగర్, కొండపాక మండలం బందారం, జగదేవ్‌పూర్ మండలం తీగుల్ నర్సాపూర్, తూప్రాన్ మండలం మల్కాపూర్, గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లి గ్రామాల్లో కొత్తగా ఏడు 33/11కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రెండున్నరేళ్లక్రితం వర్గల్‌లో నిర్వహించిన రచ్చబండలో సీఎం అంగీకారం తెలిపారు. మొదటి విడతలో అప్పట్లోనే రెండింటికి మాత్రమే నిధులు మంజూరయ్యాయి. వర్గల్ మండలం పాములపర్తి, ములుగు మండలం క్షీరసాగర్‌లో 33/11కేవీ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.2 కోట్ల చొప్పున నిధులు మంజూరయ్యాయి. పాములపర్తిలో పనులు ముగింపు దశలో ఉండగా క్షీరసాగర్‌లో చురుగ్గా సాగుతున్నాయి.
 
  ఇక పెండింగ్‌లో ఉన్న మిగిలిన ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి తాజాగా రూ.10 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఈ విషయాన్ని ఏపీసీపీడీసీఎల్(ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) డీఈ రాజశేఖర్ ‘న్యూస్‌లైన్’ మాట్లాడుతూ ధ్రువీకరించారు. మూడు నెలల్లోపు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభమయ్యే అవకాశముందని ఆయన వెల్లడించారు. ఈ పనులు పూర్తయితే గనుక రైతుల ఇబ్బందులు తీరనున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement