సాక్షి, న్యూఢిల్లీ : గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అయిదు ప్రాజెక్టులు ప్రపంచ బ్యాంకు రుణాలతో అమలవుతుండగా, మరో నాలుగు ప్రాజెక్టులకు రుణ ప్రతిపాదనలు ప్రపంచ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) పరిశీలనలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏపీ ప్రభుత్వం పంపిన మరో 12 ప్రాజెక్టు ప్రతిపాదనలను ప్రపంచ బ్యాంకు, ఎన్డీబీ, ఏఐఐబీ పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. రాజ్యసభలో డా. కేవిపి రామచంద్రరావు, మహ్మద్ అలీ ఖాన్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.
ఇక తెలంగాణ నుంచి హైదరాబాద్ మెట్రో రైలు, నగర వీధుల పునరుద్ధరణ కోసం రూ 960 కోట్ల ప్రాజెక్టు ప్రతిపాదనలను గత ఏడాది సెప్టెంబర్‌లో జర్మన్ రుణ సంస్థల పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పంపిందని చెప్పారు. అమరావతిలో మౌలిక వసతుల ఏర్పాటు కోసం రూ 1242 కోట్లతో కూడిన ప్రాజెక్టు ప్రతిపాదనలను జపాన్ ఆర్థిక సాయం కోసం పంపామని తెలిపారు. విశాఖ మెట్రో రైలు కోసం 9988 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో కూడిన ప్రాజెక్టుకు రుణ సహాయం చేయలేమని కెగ్జిమ్ ( ఎక్సపోర్ట్ ఇంపోర్ట్ బ్యాంకు ఆఫ్ కొరియా) నిస్సహాయతను వ్యక్తం చేసిందని వెల్లడించారు. కాగా ఈ ప్రాజెక్టులన్నీ గ్రామీణ రహదారులకు సంబంధించినవేనని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment