మురారిలో అగ్ని ప్రమాదం...బాలిక సజీవ దహనం
మురారిలో అగ్ని ప్రమాదం...బాలిక సజీవ దహనం
Published Thu, Mar 6 2014 11:48 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
గండేపల్లి, న్యూస్‌లైన్ :కూలిపని నుంచి వచ్చి ఇంట్లో ఆదమరచి నిద్రిస్తున్న బాలిక కేదా వీరవెంకటలక్ష్మి (15) ఆకస్మికంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవదహనమైంది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ ఘోర అగ్ని ప్రమాదం మండలంలోని మురారి గ్రామంలో గురువారం మధ్యాహ్నం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతవగా మూడు కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి. సుమారు రూ.9 లక్షల ఆస్తినష్టం వాటిల్లింది. కాగా ప్రమాదంలో చిక్కుకున్న ఇద్దరు మహిళలను స్థానికులు కాపాడగలిగినా బాలికను ఎవరూ రక్షించలేకపోయారు. కళ్లెదుటే అగ్నికీలల్లో చిక్కుకున్న కుమార్తెను రక్షించేందుకు తండ్రి విఫలయత్నం చేశారు. వివరాలు ఇలా వున్నాయి.
మురారి జాతీయ రహదారిని ఆనుకుని అన్నదమ్ములు కేదా రోణేశ్వర్రావు, పాప దంపతులు, వారి రెండో కుమార్తె వీరవెంకటలక్ష్మి, కేదా గురుమూర్తి, వీరలక్ష్మి దంపతులు, కుమారుడు శివన్నారాయణ ఒకే ఇంటిలోని రెండు వేర్వేరు పోర్షన్లలో నివసిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించాయి. దీంతో వీరి ఇంటితో పాటు పక్కనే ఉన్న పాడిశెట్టి సోమరాజు ఇల్లు కూడా మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు మంటలను ఆర్పేందుకు శ్రమించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, దుస్తులు, బీరువా, టీవీ వంటివన్నీ ఆహుతయ్యాయి. మంటల్లో చిక్కుకున్న పాప, వీరలక్ష్మిలను స్థానికులు బయటకు తీసుకువచ్చారు. వీరవెంకటలక్ష్మి మంటల్లో చిక్కుకోగా తండ్రి రోణేశ్వర్రావు కాపాడే ప్రయత్నం చేశారు. అయితే పై నుంచి మండుతున్న దూలాలు ఒక్కసారిగా ఆమెపై పడడంతో బాలిక మంటల్లో సజీవదహనమైంది. కళ్లెదుటే కన్నకూతురు సజీవ దహనం కావడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
జ్యోతుల నవీన్ పరామర్శ
అగ్ని ప్రమాదంలో కుమార్తెను కోల్పోయిన, నిరాశ్రయులైన బాధితులను వైఎస్సార్ సీపీ యువనేత జ్యోతుల నవీన్ ఓదార్చి ఆర్థిక సహాయం అందజేశారు. గండేపల్లిలో గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఉన్న నవీన్ ఈ సమాచారం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకుని బాధితుల్ని ఓదార్చారు. పార్టీ మండల కన్వీనర్ పరిమిబాబు, అడబాల భాస్కరరావు, మేకా మాదవరావు, ఉప్పలపాటి సాయి, సుంకవిల్లి రాజారావు, రమేష్ తదితరులు కార్యక్రమంలో ఉన్నారు. టీడీపీ నాయకులు కందుల కొండయ్యదొర, కాంగ్రెస్ నాయకులు చలగళ్ల దొరబాబు తదితరులు కూడా బాధితులను పరామర్శించారు. గండేపల్లి ఎస్సై సురేష్, సిబ్బంది, తహశీల్దార్ ఎస్.నరసింహరావు, ఆర్‌ఐ కృష్ణ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Advertisement
Advertisement